నోట్ల పండగ
ABN , Publish Date - May 12 , 2024 | 12:57 AM
ఎవరిని కదిపినా అందరినోటా ఒకటే మాట.. ఓటు..నోటు. ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నా నగదు పంపిణీపై నిఘా నేత్రం ఉందని హెచ్చరించినా ఇదేది ఓటర్లకు నగదు పంపిణీని అడ్డుకోలేక పోయింది.

ఎవరిని కదిపినా అందరినోటా ఒకటే మాట.. ఓటు..నోటు. ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నా నగదు పంపిణీపై నిఘా నేత్రం ఉందని హెచ్చరించినా ఇదేది ఓటర్లకు నగదు పంపిణీని అడ్డుకోలేక పోయింది. 48 గంటలు ముందుగానే నోట్ల కట్టలు చేరాల్సిన చోటుకు చేరాయి. ఓటరు స్లిప్పులు అందిస్తున్నామనే నెపంతో పగలు రాత్రి తేడాలేకుండా ఇంట్లో ఎంత మంది ఉన్నారనది ఓట్లు లెక్కేసి మరి నోట్లు అందించారు. అధికార వైసీపీ అయితే విచ్చలవిడిగా బరితెగించి కొన్నిచోట్ల పక్కా ప్లాన్‌తో ఇంకొన్ని చోట్ల చెలరేగిపోయింది. ఈ లెక్కన ఒక్కో నియోజక వర్గంలో రూ.30 కోట్లు తగ్గకుండా నగదు పంపిణీ సాగింది. మరోవైపు పంతాలు, స్థానిక నేతల అలకలు తోడయ్యాయి.
పట్టపగలే యథేచ్ఛగా అందజేత
తెల్లవార్లు పంపిణీ జాతరే
నియోజక వర్గానికి రూ.30 కోట్లు పైబడే
ఎటుచూసిన బేరసారాలు.. అలకలు
ఏలూరు, మే 11 (ఆంధ్రజ్యోతి) :
మరో 24 గంటల వ్యవధిలో పోలింగ్ జరగనుండగా ఊరువాడా నోట్ల కట్టలు తెగాయి. రాజకీయ పక్షాలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పోటీ పడ్డాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటుకు వెయ్యు చొప్పున చెల్లించేందుకు ప్రధాన పార్టీలు ముందుకు వచ్చాయి. అధికార వైసీపీ అయితే లక్ష ఓట్లు తగ్గకుండా ప్రతీ నియోజకవర్గంలోనూ వెయ్యి చొప్పున కొనుగోలు చేసేందుకు ఎప్పుడో వ్యూహం ఖరారు చేసినట్టు ప్రచారం. తొలుత ప్రతీ నియోజకవర్గంలో ఉన్న డ్వాక్రా సంఘా లను లక్ష్యం చేసుకొని ప్రతీ గ్రూపునకు 12 వేల చొప్పున చెల్లించారు. వీరిలో గ్రూపు లీడరుగా ఉన్న వారికి రూ.రెండు వేలు చేతికి ఇచ్చారు. మొత్తం సంఘాల మీద బాధ్యత తీసుకునేవారికి రూ.10 వేలు తగ్గకుండా ముడుపులు ఇచ్చారు. ఏలూరు, దెందులూరు, చింతలపూడి, ఉంగుటూరు నియోజకవర్గాల్లో వైసీపీ మూడవ కంటికి తెలియకుండా ఓటర్లకు నోట్లను విసిరింది. స్థానిక లీడర్లను ఓ గ్రూపుగా ఎంపిక చేసి తాము గుర్తించిన ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్యను లెక్కేసి ఆ మొత్తానికి ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున విభజించి ఓటర్లకు చేర్చేలా జాగ్రత్తలు పడ్డారు. దెందులూరు నియోజక వర్గంలో కొన్ని చోట్ల ఓటుకు రూ.1500 నుంచి రూ.2 వేలు పంచారు. ప్రతిష్టా త్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల్లో, లక్షల్లో బెట్టింగ్ సాగిన నియెజకవర్గాల్లో ఓటుకు అదే స్థాయిలో నోటు ధర పలికింది. ఏలూరులో ఓటుకు రూ.వెయ్యి చొప్పున పట్టపగలే పంపిణీ సాగింది. ప్రార్థనా మందిరాలను సైతం పంపిణీకి కొందరు అనువుగా మార్చేసుకున్నారు. గుంపులు గుంపులుగా ఉంటే అను మానం వస్తుందని కొందరు నేతలు పంపిణీకి వీటిని వాడుతున్నారు.
‘రిజర్వుడు’ల్లోనూ తగ్గేదేలే
రిజర్వుడు నియోజకవర్గం చింతలపూడి పోలవరం నియోజకవర్గంల్లోనూ ఓటుకు కోట్లు గుమ్మరించారు. ఈ నియోజకవర్గాల్లో పంపిణీ మొత్తం ఎవరిది ఎక్కువైతే వారికే అనుకల ఫలితాలు వస్తాయని నానుడితో చింతలపూడి, పోల వరంలోనూ రూ.వెయ్యికి తగ్గ కుండా ఒక్కో ఓటుకు విసిరారు. ఈ క్రమంలోనే పంపిణీ ఎవరి చేతి మీద జరగాలన్న విషయంలో భేదాభిప్రాయాలు పొడచూపాయి. వాస్తవానికి 2014 కు ముందు ఈ నియోజకవర్గాల్లో ఓటుకు రూ.500 మాత్రమే పంపిణీ జరిగేది. ఇప్పు డు మిగతా నియోజ వర్గాలతో సమానంగా రూ.వెయ్యికు తగ్గకుండా పంపిణీ జరి గేలా ఓటర్లు కొందరు పట్టుబట్టి మరీ సాధిస్తున్నారు. ‘ఇక్కడ పరిస్దితులు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. అభ్యర్థులేమో డబ్బుల్లేవు అంటారు, మరి పంపిణీకి కోట్లు కోట్లు ఎలా వచ్చాయి. ఓటుకు వెయ్యి చొప్పున ఒక్కో నియోజకవర్గంలో 15 కోట్లు తగ్గకుండా ఖర్చు అవుతుంది. చూస్తుంటేనే బెరుకు పుడుతుంది’. రాజకీయాల్లో ఆరితేరిన వారే చేసే కామెంట్లు ఇవి.
చివరి రోజే కీలకం
ఓటర్లను మభ్యపరచ డానికి అభ్యర్థులందరికీ చివరి రోజు ఆదివారం. దీని కి తగ్గట్టుగానే ఆయా పార్టీ లు ఆ పార్టీ అను కూలురుకు చికెన్, మటన్ కొనుగోలుకు సాయం చేస్తున్నాయి. మరికొన్ని అయితే ఆదివారం బిర్యానీ లతో ముంచెత్తడానికి వీలుగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తు న్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో కొన్ని కుటుంబాలకు చేపలు, రొయ్యలు, మాంసం పంపిణీ చేశారు. ఆ తర్వాత ఇదంతా బయట పడుతుండడంతో ఈ ప్రయత్నాలను
విరమించుకుని అంత వ్యక్తిగతమే అన్నట్టుగా సరిపడినంత ఖర్చులను ఫోన్ పే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం తెల్లవారుజాముకల్లా పంపిణీ పూర్తిచేయాలని అభ్యర్థులంతా లక్ష్యంగా ఎంచుకున్నారు.
నూజివీడు నియోజకవర్గంలో ‘ఓటుకు నోటు’ పంపిణీ ప్రశాంతంగా, బహిరంగంగా జరుగు తోంది. నిన్నటివరకు చిటపటలాడిన ప్రధాన పార్టీలు ఓట్లకు ధర నిర్ణయించే విషయంలో సయోధ్య పాటించినట్టుగా కనబడుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్‌కు కలిపి ‘ఓటు’కి ఒక్కో పార్టీ రూ. 2 వేల నుంచి రూ.3 వేలు ఇస్తారని భావించిన ఓటర్లకు రెండు పార్టీలు సయోధ్యకు వచ్చి విడి విడిగా చెరో వెయ్యి రూపా యలు చొప్పున ఇస్తూ ఓటర్లకు ఝలక్ ఇచ్చాయి. దెందులూరులో నియోజక వర్గం పెదపాడు మండలంలో అధికార పార్టీ రెండు ఓట్లకు కలిపి రూ.1,500 పంపిణీ చేయగా శనివారం సాయం త్రం నుంచి ప్రతిపక్ష పార్టీలు సైతం రూ.1,500 పంపిణీ చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొవ్వలి, దెందులూరుతో పాటు పలు గ్రామాల్లో రూ. రెండు వేలు పంపిణీ చేస్తున్నారు. ద్వారకా తిరుమల మండలంలో పట్టపగలే ఓటుకు నోటు పంపిణీ జోరుగా సాగింది. అధికార పార్టీ తరపున ఓటుకు రూ.2 వేలు, ప్రతిపక్షం వారు రూ.1,500 ఇస్తున్నారు. స్లిప్పులు ఉన్నవాళ్లకే నగదు పంపిణీ చేస్తున్నారని ప్రచారం సాగడంతో స్లిప్పులు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. తమకు ఓటు వేసేవారిని గుర్తించి వారికి మాత్రమే డబ్బు పంపిణీ చేసుందుకు ఆయా పార్టీల వారు ఆసక్తి చూపుతు న్నారు. జీలుగుమిల్లి మండలంలో పంచాయతీల వారీగా నాయకులకు నగదు అందజేశారు. ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. తమ పార్టీకి ఓటు వేయని వారికి కొన్ని గ్రామాల్లో నగదు పంపిణీ చేయలేదు. వేలేరుపాడులో ఎన్నికల ప్రచారం ముగియడంతో నగదు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇరుపార్టీలు ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నారు. కుక్కునూరు మండలంలో ఎన్నికల దృష్ట్యా జోరుగా డబ్బు, మద్యం పంపిణీ సాగుతోంది. ప్రధాన పార్టీలు ఓటుకు రూ.వెయ్యి పంపిణీ చేస్తున్నారు. ఇండిపెండెంట్, మిగిలిన పార్టీల అభ్యర్థులు మాత్రం పంపిణీకి దూరంగా ఉన్నారు. గణపవరం మండల గ్రామాల్లో ఒక ప్రధాన పార్టీ ఓటరుకు రూ.2వేలు చొప్పున ఇవ్వగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి సైతం రూ.2వేలు చొప్పున ఓటర్లకు అందజేశారు. గ్రామాల్లో పట్టపగలు పోటాపోటీగా ఈ పంపిణీ జరగడం గమనార్హం. భీమడోలు మండలంలో ఓ పార్టీ అభ్యర్థి రాజకీయ పార్టీలకు అతీతంగా ఓటర్లకు రూ. రెండు వేలు పంపిణీ చేశారు. కొన్ని చోట్ల మహిళలకు జాకెట్‌ముక్కలు పంపిణీ చేశారు. అధికార పార్టీ నాయకులు రూ.రెండు వేలు పంపిణీ చేసినప్పటికీ కేవలం తమకు అనుకూల ఓటర్లకు మాత్రమే సొమ్ము పంపిణీ చేశారు. ఉంగుటూరు మండలంలో ఆయా పార్టీల అభ్యర్థులు రూ. రెండు వేలు పంపిణీ చేస్తున్నారు. మూడు రోజులు మద్యం దుకాణాలు మూసివేయనుండడంతో మద్యం దుకాణాలు కిక్కిరిశాయి.
నిఘా ఏమైపోయినట్లు ?
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి రూ.50 వేలకు ఒక్కరూపాయి అదనంగా ఉన్నా ఆంక్షల పేరిట అధికారులు సీజ్ చేశారు. కానీ, పోలింగ్‌కు వారం ముందు నుంచే పోలింగ్ జరిగే ముందు రోజు వరకు ఓటర్లను మభ్య పెట్టేలా ప్రత్యేక టీమలుగా ఏర్పడి నగదు పంపిణీ చేస్తున్నా రు. దీనికి తోడు ఒక పార్టీపై మరో పార్టీ పంపిణీపై నిఘా పెట్టింది. మీరు ఫిర్యాదు చేస్తే మేము కూడా సిద్ధమంటూ బెదిరించి మరీ పంపి ణీ తతంగానికి దిగారు. దెందులూరు నియోజక వర్గంలో ఈ తరహ వాతావరణం ఎక్కువగా బయట పడింది. నూజివీడు, కైకలూరు నియోజక వర్గాల్లో పంపిణీకి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, తీసుకోవడానికి ఓటర్లు పోటీ పడడం ఈసారి విశేషం. ఇంత జరుగుతున్నా నిఘా వర్గాల కంటి కి ఈ సీన్ కనిపించడం లేదా అనే ప్రశ్న ఉన్నది.