Share News

విజేతలెవరో!

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:35 AM

అసెంబ్లీ నియోజకవర్గాలకు రారాజులెవరో.. ఏలికలు ఎవరో, పరాజితులు మరెవరో. నేడు ప్రజాతీర్పు.. కొద్దిగంటల వ్యవధిలోనే తొలిఫలితం వెలువడేలా భారీ ఏర్పాట్లు.. నెలల తరబడి ఓపిక పట్టి పోలింగ్‌, ఆ తదు పరి మూడు వారాలు వేచి ఉన్నవారందరికి నేడు సస్పెన్స్‌ వీడ బోతోంది. విజయంపై టీడీపీ కూటమి, వైసీపీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విజేతలెవరో!

నేడే కౌంటింగ్‌.. ఓటరు తీర్పు వెల్లడి

ఢిల్లీ వెళ్ళే ధీరులెవరో.. అసెంబ్లీలో అడుగుపెట్టే అదృష్టవంతులెవరో

ఉదయం 8 గంటల నుంచే

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం

8.30 నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 86 మంది

ఎంపీ బరిలో 13 మంది అభ్యర్థులు

రెండుచోట్ల అంతా కొత్త ముఖాలే

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

అసెంబ్లీ నియోజకవర్గాలకు రారాజులెవరో.. ఏలికలు ఎవరో, పరాజితులు మరెవరో. నేడు ప్రజాతీర్పు.. కొద్దిగంటల వ్యవధిలోనే తొలిఫలితం వెలువడేలా భారీ ఏర్పాట్లు.. నెలల తరబడి ఓపిక పట్టి పోలింగ్‌, ఆ తదు పరి మూడు వారాలు వేచి ఉన్నవారందరికి నేడు సస్పెన్స్‌ వీడ బోతోంది. విజయంపై టీడీపీ కూటమి, వైసీపీ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గడిచిన రెండు మాసాలుగా నువ్వానేనా అన్నట్లుగా అటు లోక్‌సభా స్థానంలోనూ, ఇటు అసెంబ్లీ స్థానాల్లోనూ హోరాహోరీ యుద్ధమే సాగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగాయి. పార్టీల అధినేతలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఓటర్లకు తాను ఏం చేయబోతున్నామో చెప్పి తమవైపు మళ్ళేలా గుర్తించే ప్రయత్నం చేశారు. అందరి మనసు దోచుకోవడానికి పోలింగ్‌ ముందు వరకు విశ్వ ప్రయత్నం చేశారు. ఎవరు ఓటుకోసం ఇంటికి వచ్చి అభ్యర్థిం చినా జనం వాదనకు దిగకుండా తల ఊపారు. వేయాల్సిన ఓటు ఎవరికో నిర్ధారించుకుని పోలింగ్‌ వరకు ఓటర్లు గుమ్మ నంగా ఉన్నారు. గాలిమావైపే అంటే కాదుకాదు మావైపే నంటూ పార్టీలన్ని పోలింగ్‌నాడే లెక్కలు కట్టాయి. నియోజక వర్గాల వారీగా తాము ఎక్కడా బలవంతులమో, మరెక్కడ బలహీనులమో పోలింగ్‌ బూత్‌ల వారీగా లెక్కలు తీశారు. ఈ క్రమంలోనే ఈసారి అంతా ఆషామాషీ కాదు, ఓటరు నాడి చూసినా అంత తేలిగ్గా కనిపించడం లేదు. డబ్బు అయితే పంచాము కాని, ఓటు దక్కిందో లేదో మంగళవారం జరగనున్న ఓట్ల లెక్కింపులో కాని తెలియదు అన్నట్లుగా తల పండిన రాజకీయ విశ్లేషకులు కొందరు చేతులెత్తేశారు. మరి కొందరు గోదావరి జిల్లాల్లో బలమెటో తేల్చేశారు. కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయి. వైసీపీ వెనుకబడడం ఖాయమని కొన్ని సంస్థలు నిర్ధారించగా, మరికొన్ని రెండోసారి ఛాన్స్‌ పాలక పార్టీకేనని జోస్యాలు చెప్పాయి. ఓటు వేసిన సామాన్య జనం అందరి విశ్లేషణలు, విడమర్చి ప్రకటించిన లెక్కలు, అనుకూలతలపై ఇప్పటివరకు కామెంటే చేయకుండా సైలెంట్‌గా ఉన్నారు. ప్రజాతీర్పు వెలు వర్చే క్షణాలు రానేవచ్చాయి. మరికొద్ది గంటల్లోనే తీర్పుకు అందరూ తలవంచాల్సిందే.

అన్ని పార్టీలకు ఈ తీర్పే సవాల్‌..

ప్రత్యేకించి అధికార వైసీపీ రెండోసారి పగ్గాలు చేపడతా మని ఇప్పటికి లెక్క కట్టింది. వైసీపీ అంచనాలను తల్లకిందు లు చేస్తామని ఏలూరు లోక్‌సభ స్థానంలో ఆ పార్టీకి అడ్రస్సే లేకుండా పోతుందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గాండ్రిస్తోంది. ఈసారి నమోదైన ఓట్లశాతంతో పాటు పోటీచేసిన అభ్యర్థులు సంఖ్య విచిత్రంగానే ఉంది. రిజర్వుడ్‌ నియోజకవర్గాలైన పోలవరం, చింతలపూడిలో పోటీ చేయడా నికి అభ్యర్థుల కొరత ఇంతకు ముందు ఉండేది. 2014–19 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఈ రెండు నియోజక వర్గాల్లోనూ అభ్యర్థుల సంఖ్య సంతృప్తికరంగానే ఉంది. దీన్నిబట్టి చూస్తే పోటీ తీవ్రత ఎంత గాఢంగా ఉందో అంతే స్థాయిలో అభ్యర్థుల పోటీ సాగినట్టు అయింది. ఎంపీ స్థానానికి సంబంధించి ఒకప్పుడు 9 నుంచి 10మంది లోపే పోటీకి అభ్యర్థులు ఉండేవారు. ఇప్పుడు ఏలూరు లోక్‌సభ స్థానానికి పోటీచేసిన అభ్యర్థుల సంఖ్య 13గా ఉంది. ఏలూరు లోక్‌సభలో అభ్యర్థులే కాకుండా ఈ సారి బీసీ వర్గాల మధ్యే ప్రధాన పక్షాల పోటీ అనివార్యంగా మారింది. తెలుగుదేశం పక్షాన పుట్టా మహేష్‌ యాదవ్‌, వైసీపీ పక్షాన కారుమూరి సునీల్‌కుమార్‌ పరస్పరం పోటీ పడ్డారు. వీరిద్దరు ఒకే సామా జిక వర్గానికి చెందిన వారు కావడంతో ఓట్ల చీలిక అని వార్యంగా మారింది. కొన్నిచోట్ల క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. వీట న్నింటిని బట్టి చూస్తే టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ కుమార్‌కు అనుకూలత ఎక్కువగా ఉన్నట్లు పోలింగ్‌ రోజునే విశ్లేషించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వస్తే దెందు లూరులో టీడీపీ పక్షాన ఇంతకు ముందు మూడుసార్లు తలపడిన చింతమనేని ప్రభాకరే మరోసారి రంగంలో నిలి చారు. ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా వైసీపీకి చెందిన అబ్బయ్య చౌదరి రెండోసారి తన అదృష్టాన్ని పరిశీలించుకోబో తున్నారు. ఏలూరులో రాజకీయంగా సీనియర్‌, మాజీ మంత్రి, వైసీపీ అభ్యర్థి ఆళ్ళనానిపై తొలిసారిగా పోటీకి దిగిన టీడీపీ అభ్యర్థి బడేటి చంటి అటు ప్రచారంలోనూ, ఇటు ఓటర్లను ఆకర్షించటంలో తనదైన శైలి ప్రదర్శించి అనుకూలతలే ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఉంగుటూరు నియోజక వర్గం నుంచి జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు బరిలో ఉండగా, ఆయనను సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్న కుప్పాల వాసుబాబు, వైసీపీ పక్షాన ఢీ కొంటున్నారు. వీరి ద్దరి మధ్య హోరాహోరీ పోరుసాగి ఓటర్లలో నూ ఉత్కంఠ రేపింది. ఎస్సీ రిజర్వుడ్‌ నియో జకవర్గం చింతలపూడిలో తెలుగుదేశం పక్షాన రోషన్‌కుమార్‌ బరిలోకి దిగారు. తొలిసారి పోటీ చేస్తున్న ఆయన ఇక్కడ అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోయేందుకు ప్రయత్నించా రు. అనుకూలతలు అన్ని తనవైపే ఉన్నాయని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన వైసీపీ అభ్యర్థిగా కె.విజయ్‌రాజు సైతం తొలిసారిగా అసెంబ్లీ బరిలో ఉన్నారు. అటు రోషన్‌, ఇటు విజయ్‌రాజు మధ్య ఓటర్లు ఎవరివైపు అనుకూలత ప్రదర్శించారో నేడు తేలబోతోంది. పోలవరం ప్రాజెక్టుకు ఆయువుపట్టు అయిన పోలవరం ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు తొలిసారిగా పోటీలోకి దిగారు. అంతే సమాం తరంగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ప్రస్తుత సిట్టింగ్‌ వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మి పోటీ చేశారు. రిజర్వుడ్‌ నియోజకవర్గాలైన చింతలపూడి, పోలవరంలోనూ రాజకీయాల్లో కొత్త అయిన ఈ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎవర్ని ఎంచుకోవడానికి సిద్ధపడ్డారో నేడు తేలబోతోంది. నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ పక్షాన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పోటీచేయగా, సీనియర్‌ ఎమ్మెల్యేగా వైసీపీ పక్షాన మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు ఢీ కొంటున్నారు. వీరిద్దరి నడుమ పోటీ ఒక ఎత్తుగా సాగగా, ఫలితాలు ఏ వైపు మొగ్గు చూపబోతున్నా యో అదేస్థాయిలో ఉత్కంఠ రేపుతున్నాయి. కైకలూరు నియోజకవర్గంలో సీనియర్‌ నేత డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, బీజేపీ పక్షాన రంగంలో నిలువగా, ఆయనను వైసీపీ పక్షాన రెండోసారి పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఢీ కొంటున్నారు. వీరిద్దరి మధ్య నువ్వానేనా అనే స్థాయిలో సాగిన యుద్ధంలో మొదలు తటస్థ ఓటర్లే తీర్పులో కీలకం కాబోతున్నారు.

ఏలూరు లోక్‌సభ అత్యంత విలక్షణం

ఏలూరు లోక్‌సభ స్థానంలోనూ దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈసారి విలక్షణమైన పోటీ సాగింది. చింతలపూడి, పోలవరం, ఏలూరు నియోజక వర్గా ల్లో కొత్త ముఖాలు బరిలో నిలిచాయి. డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, కొలుసు పార్థసారథి, మేకా వెంకట ప్రతాప్‌ అప్పా రావు, చింతమనేని ప్రభాకర్‌ వంటి సీనియర్లు ఈసారి తమ అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు. ఎన్నికల ఎత్తుగడలో ఆరితేరిన వీరంతా ఒక వ్యూహం ప్రకారం ముందుకే సాగారు. ఆర్థికంగా, ఇమేజ్‌పరంగా ఎక్కడా వెనక్కి తగ్గకుండా తమ నియోజకవర్గాల్లో ఎత్తులు వేశారు. కొన్నిచోట్ల ఆసాంతం సక్సెస్‌ అవ్వగా, మరికొన్నిచోట్ల ఫిప్టీ పిఫ్టీగా సాగాయి. ఏలూ రు లోక్‌సభ స్థానం పరిధిలో రాజకీయ కుటుంబాలకు చెందిన వారే ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులుగా రంగంలోకి దిగడం ఈసారి విశేషం. తెలుగుదేశం సీనియర్‌నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణ అల్లుడు, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ తనయుడు అయిన పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ ఏలూరు లోక్‌సభ స్థానంలో బరిలో నిలిచారు. రాజకీయాల్లో కొంత కొత్త అయినా రాజకీయ కుటుంబాల నేపథ్యం ఉండడంతో పోల్‌ మేనేజ్‌మెంట్‌లో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అధిష్ఠానాన్ని ఒప్పించే విషయం లోనూ ధైర్యం చేశారు. మరోవైపు మంత్రి కారుమూరి నాగేశ్వ రరావు తనయుడు కారుమూరి సునీల్‌కుమార్‌ లోక్‌సభ అభ్యర్థిగానే బరిలో నిలిచి కొన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నించారు. వీరిద్దరి మధ్య పోటీ ఆసాంతం ఉత్కంఠగానే సాగింది. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో ఆది నుంచి తెలుగుదేశం అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తూ వచ్చింది. కాని ఈసారి పొత్తుపేరిట ఏడు అసెంబ్లీ స్థానాల్లో మూడింటిని బీజేపీ, జనసేనకు వదిలేసింది. దీంతో ఓట్ల బదిలీయే పార్లమెంట్‌ స్థానాన్ని నిర్దేశించబోతోంది.

అసలు కంటే పోస్టల్‌ ఓట్లకే భారీ ఏర్పాట్లు

ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఈవీఎంలలో నమోదైన అసలు ఓట్ల కంటే పోస్టల్‌ ఓట్లకే ఈసారి టెన్షన్‌ ఎక్కువైంది. పోస్టల్‌ బ్యాలెట్ల వివరాలు ఉంగుటూరు 1,614, దెందులూరు 2,165, ఏలూరు 3,123, పోలవరం 2,872, చింతలపూడి 2,267, నూజివీడు 1,923, కైకలూరు 1,651, మొత్తం 15,615. వృద్ధులు, అత్యవసర సర్వీస్‌ ఓటర్లు ఉంగుటూరు 368, దెందులూరు 358, ఏలూరు 826, పోలవరం 145, చింతలపూడి 238, నూజివీడు 267, కైకలూరు 341 మొత్తం 2,543.

ముందు పోస్టల్‌ ఓట్ల లెక్కింపే

ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు, ఫలితాలు జారీ మిగతా ఓట్ల లెక్కింపుపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతున్నారు. తొలుత మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఆరంభమవుతుంది. ఎంపీ నియోజకవర్గ పరిధిలో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటిని కలిపి సాయంత్రం 4,5 లోపే ఫలితాలను వెలువరిస్తారు. ఈలోపు మంగళవారం ఉదయం 8.30 దగ్గర నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలి గంటలోనే ఒకటి, రెండు నియోజకవర్గాలు తొలిరౌండ్‌ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత మేర ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థికి 14 టేబుళ్లు, అసెంబ్లీకి సమాంతరంగా మరో 14 టేబుళ్లు అంటే మొత్తం మీద ఒక్కో నియోజకవర్గానికి 28 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అటు 14, ఇటు 14 ఈవీఎంలలో ఒకేసారి ఓట్ల లెక్కింపు జరగబోతోంది. వీలు కుదిరితే మొదటి రౌండ్‌ వరకు ఎక్కడైనా అభ్యంతరాలు ఉన్నా కాస్త ఆలస్యమైనా రెండో రౌండ్‌ నుంచి లెక్కింపు వేగాన్ని పెంచబోతున్నారు. ఎక్కడైతే పోలైన ఓట్ల సంఖ్య తక్కువగా ఉంటుందో, ఆయా నియోజకవర్గాల్లో ఫలితాలను త్వరగా ప్రకటించాలన్న ఆతృత అధికారుల్లోనూ ఉంది. ఎక్కడికక్కడ మంగళవారం ఉదయమే కౌంటింగ్‌ కేంద్రాల్లో డెమో నిర్వహిస్తారు. ఏజెంట్లు విషయంలోనూ వారి కదిలికలపైన ఓ కన్నేసి ఉంచారు.

పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య

ఏలూరు ఎంపీ స్థానం 13

ఏలూరు అసెంబ్లీ స్థానం 14

ఉంగుటూరు 12

దెందులూరు 15

పోలవరం 12

చింతలపూడి 8

నూజివీడు 10

కైకలూరు 15

Updated Date - Jun 04 , 2024 | 12:35 AM