Share News

హస్తవాసి

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:09 AM

వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను మంగళవారం కాంగ్రెస్‌ ప్రకటించింది. దీర్ఘకాలికంగా కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉన్నవారికి, వైసీపీని వీడి ఈ మధ్యనే కాంగ్రెస్‌లో చేరిన వారికి అసెంబ్లీ టిక్కెట్లు లభించాయి. పీసీసీ చీఫ్‌ షర్మిల ఈ మేరకు జాబితాను ప్రకటించారు. దీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నవారికి అవకాశమిచ్చారు. అలాగే కొత్త జిల్లాలకు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వారికి కూడా ఛాన్స్‌ ఇచ్చారు.

హస్తవాసి

కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎలీజాకు చింతలపూడి

పాత కొత్తతరం కలబోసి అవకాశాలు

వైసీపీ నుంచి చేరిన వారికి ప్రత్యేక ఛాన్స్‌

దెందులూరు స్థానంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి

టిక్కెట్‌ నిరాకరించడంతో ఆశావహులు చౌదరి పార్టీకి రాజీనామా

షర్మిల దిష్టిబొమ్మ దహనం చేసిన అనుచరులు

ఇంకా తేలని ఎంపీ సీట్లు

(ఏలూరు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను మంగళవారం కాంగ్రెస్‌ ప్రకటించింది. దీర్ఘకాలికంగా కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని ఉన్నవారికి, వైసీపీని వీడి ఈ మధ్యనే కాంగ్రెస్‌లో చేరిన వారికి అసెంబ్లీ టిక్కెట్లు లభించాయి. పీసీసీ చీఫ్‌ షర్మిల ఈ మేరకు జాబితాను ప్రకటించారు. దీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నవారికి అవకాశమిచ్చారు. అలాగే కొత్త జిల్లాలకు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వారికి కూడా ఛాన్స్‌ ఇచ్చారు.

పాత, కొత్త ముఖాలతో జాబితా

కాంగ్రెస్‌కు జవజీవాలు ఇవ్వాలనే సంకల్పంతో పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడంలో పీసీసీ జాగ్రత్తలు పాటించింది. పాత, కొత్త తరాల మధ్య సమన్వయంతో పాటు కాస్తంత లోపాలు లేకుండానే జాబితాను విడుదల చేసినట్లు కొంత మంది భావిస్తున్నా అదే సమయంలో ఈ మధ్యనే వైసీపీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన వారికి కూడా అసెంబ్లీ అభ్యర్థి జాబితాలో వారికి చోటు ఇవ్వడం పట్ల కొంత ఆశ్చర్యం వ్యక్తమైంది. ఏలూరు లోక్‌సభ స్థానంలో ఆరు అసెంబ్లీ స్థానాలకు నరసాపురం లోక్‌సభ స్థానంలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్య ర్థులను ప్రకటించారు. ఏలూరు, ఆచంట అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థులను ఎవరినీ ప్రకటించలేదు. కమ్యూనిస్టులతో ఎన్నికల పొత్తు కారణంగా ఈ రెండు స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్లు భావిస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీచేసేందుకు కాస్త ఉత్సాహం చూపిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాను వైసీపీ పక్కన పెట్టింది. ఆయనకు ఛాన్స్‌లేదని మూడువారాల క్రితమే తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ పట్ల తీవ్ర అసంతృప్తి ఆగ్రహంతో ఉన్న ఆయనను పార్టీలో చేర్చు కునేందుకు టీడీపీ ఒకవైపు, మరోవైపు కాంగ్రెస్‌ పోటీపడ్డాయి. ఇదే తరుణంలో ఆయన ఈ మధ్యనే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎదుట కాంగ్రెస్‌లో చేరారు. పట్టుమని వారం తిరగకముందే ఎమ్మెల్యే ఎలీజాకు చింతలపూడి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగగా కాంగ్రెస్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో చింతలపూడి నియోజకవర్గంలోని ఓట్ల చీలిక అత్యధికంగానే ఉంటుందని భావిస్తున్నారు. విభజిత పశ్చిమగోదావరి జిల్లాకు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న మర్నీడి శేఖర్‌(బాబ్జి)కి తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. పార్టీకి దీర్ఘకాలికంగా విధేయుడిగా, నమ్మకస్తుడిగా ఉన్న పాతపాటి హరికుమార్‌రాజుకు ఉంగుటూరు నియోజక వర్గం సీటు దక్కింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ హరికుమార్‌రాజు ఇదేస్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో ఆయనకు మిగతా నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థుల కంటే రికార్డు స్థాయిలో ఓట్లు దక్కడం హరికుమార్‌ రాజుకు ప్రాముఖ్యత దక్కింది. దెందులూరు నుంచి ఆలపాటి నరసింహమూర్తి, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీవీఆర్‌కే చౌదరి మధ్య పోటీ జరిగినా చివరకు నరసింహమూర్తి అభ్యర్థిత్వం పట్లే కాంగ్రెస్‌ మొగ్గు చూపింది. పెదవేగి మండలం ముండూరుకు చెందిన నరసింహమూర్తికి అవకాశం ఇచ్చి తనను పక్కన పెట్టడంపై చౌదరి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్‌కు రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటించారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల దిష్టిబొమ్మను ఆయన అనుచరులు దహనం చేశారు. పార్టీని నమ్ముకుని ఉన్నందుకు జరిగిన న్యాయం ఇదేనా అంటూ జాబితాపై చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గం నుంచి దువ్వెల సృజనకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇచ్చింది. ఇంతకు ముందే సృజన టీడీపీ, వైసీపీలో కూడా కొనసాగారు. నూజివీడు నియోజకవర్గంలో చాలాకాలం నుంచి కాంగ్రెస్‌నే వెన్నంటి ఉంటున్న కృష్ణమరీదుకు అసెంబ్లీకి పోటీ చేసే ఛాన్స్‌ దక్కింది. ఈ నియోజకవర్గంలో కృష్ణ పలువురికి సుపరిచితుడు కూడా. కైకలూరు నుంచి బొడ్డు నోబుల్‌ని కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మధ్యనే జరిగిన కాంగ్రెస్‌ సర్వసభ్య సమావేశంలో నోబుల్‌ వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకుని మూడు రోజులు వ్యవధిలోనే నోబుల్‌కి కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పార్టీలో సీనియర్లుగా ఉన్న అనేకమందికి కూడా ఈసారి అసెంబ్లీకి పోటీ చేసేందుకు వీలుగా పలువురు అభ్యర్థిత్వాన్ని పీసీసీ ఖరారు ప్రకటించింది. ఈ జాబితాలో పాలకొల్లు నుంచి కొలుకులూరి అర్జున్‌రావు భీమవరం నుంచి అంకెం సీతారామ్‌, తణుకు నుంచి కడలి రామా రావును అభ్యర్థిత్వాలను ప్రకటించారు. వీరంతా కాంగ్రెస్‌లో దీర్ఘకాలి కంగా నాయకత్వం వహిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను చక్కపెడుతూ వచ్చారు. నరసాపురం నుంచి తానూరి ఉదయభాస్కర్‌ కృష్ణప్రసాద్‌ను కూడా జాబి తాలో చేర్చారు. మొత్తంమీద కాంగ్రెస్‌ విడుదల చేసిన తొలి జాబితాలో పాత, కొత్త తరాల కలయికతో పాటు ఈ మధ్యనే పార్టీలో చేరిన టిక్కెట్లు దక్కటం కాంగ్రెస్‌ మార్పుకు నిదర్శనంగా మిగిలింది.

ఆచంట, ఏలూరు సంగతి ఏంటి ?

ఏలూరు, ఆచంట అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌ పెండింగ్‌లో పెట్టింది. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పోలవరం నియోజకవర్గాన్ని తమకే కేటాయించాల్సిందిగా సీపీఐ ఇప్పటికే కాంగ్రెస్‌ను కోరింది. వామపక్షాలతో కాంగ్రెస్‌ ఎన్నికల పొత్తుకు దిగింది. ఈ అవగాహనలో భాగంగానే సీపీఐ పోలవరం కోరుకున్నా ఆ స్థానం నుంచి సృజనను కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రక టించారు. ఆ స్థానానికి బదులుగా ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని వామపక్షాలకు కేటాయించినట్లు భావిస్తున్నారు.ఈ స్థానం నుంచి పార్టీ సీనియర్‌ నాయకుడు బండి వెంకటేశ్వరరావును రంగంలోకి దింపాలని ఇప్పటికే సీపీఐ ఏకాభిప్రాయానికి వచ్చింది. సోమవారం ఈ మేరకు జిల్లా కార్యవర్గ సమా వేశమై తీర్మానం కూడా చేసింది. ఏలూరులో స్థిరపరుచితుడైన బండి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగితే మెరుగైన ఓట్లశాతం దక్కగలదని సీపీఐ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఆచంట అసెంబ్లీ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఈ స్థానం నుంచి ఇంతకు ముందు పలుమార్లు సీపీఎం పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈసారి సీపీఎంకు ఆ స్థానాన్ని కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు నరసాపురం, ఏలూరు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరినీ ఇంకా ఖరారు చేయలేదు. ఈ రెండు స్థానాలను పెండింగ్‌లోనే ఉంచారు.

Updated Date - Apr 03 , 2024 | 12:09 AM