Share News

జనసేనలో నిరసనలు

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:33 AM

ఏలూరు, తణుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలను టీడీపీకి కేటాయించడంపై ఆయా నియోజకవర్గాల ఇన్‌ చార్జ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు.

జనసేనలో నిరసనలు
ఏలూరులో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న రెడ్డి అప్పలనాయుడు

రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానన్న అప్పలనాయుడు.. నాదెండ్ల మనోహర్‌ బస వద్ద విడివాడ ఆందోళన

ఏలూరు కార్పొరేషన్‌/పెంటపాడు, ఫిబ్రవరి 26 : ఏలూరు, తణుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలను టీడీపీకి కేటాయించడంపై ఆయా నియోజకవర్గాల ఇన్‌ చార్జ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఏలూరు జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్‌ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని పలువురు కార్యకర్తలు కోరారు. దీనిపై ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం ఎంతో చేశా. కాని నాకు టిక్కెట్‌ ఇవ్వకుండా అన్యాయం చేశారు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రతీ కార్యకర్త అభిప్రాయాన్ని తెలుసుకుని, అందుకు అనుగుణంగా నా కార్యాచరణ ప్రణాళికను రెండు రోజుల్లో ప్రకటిస్తానని పేర్కొన్నారు. నాయకులు బి.వి.రాఘవయ్య చౌదరి, సిరిపల్లి ప్రసాద్‌, సరిది రాజేష్‌, కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, శ్రావణ గుప్త తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తణుకు టిక్కెట్‌ను టీడీపీ ఇవ్వడంపై నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్‌ విడివాడ రామచంద్రరావు మండిపడ్డారు. టీడీపీ–జన సేన సభ నిర్వహణ ఏర్పాట్లు పరిశీలించేందుకు ప్రత్తిపాడు వచ్చిన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ సోమవారం రాత్రి అలంపురంలోని జయ గార్డెన్స్‌లో బస చేశారు. ఇక్కడ నిరసన తెలిపేందుకు ఆయన అనుచరులతో కలిసి వచ్చి అతిథి గృహం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌, ఇతర నాయకులు, పోలీసులు అడ్డుకున్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు కార్యకర్తలకు సర్దిచెప్పి విడివాడను అతిథి గృహం లోపలకు తీసుకెళ్లారు. విడివాడతో మనోహర్‌ 45 నిముషాలపాటు మాట్లా డారు. అనంతరం విడివాడ బయటకు రాగా అనుచర వర్గం విడివాడ నాయకత్వ వర్థిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ తణుకు బయల్దేరి వెళ్లారు.

Updated Date - Feb 27 , 2024 | 01:33 AM