Share News

ప్రభుత్వ వైద్యం పేదలకు చేరువవ్వాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Aug 24 , 2024 | 12:24 AM

ప్రభుత్వ వైద్యం పేదలకు చేరువుగా ఉండేలా వైద్య సిబ్బంది సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు.

 ప్రభుత్వ వైద్యం పేదలకు చేరువవ్వాలి: కలెక్టర్‌
వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి

పాలకొల్లు రూరల్‌, ఆగస్టు 23: ప్రభుత్వ వైద్యం పేదలకు చేరువుగా ఉండేలా వైద్య సిబ్బంది సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రసూతి, జనరల్‌ వార్డు తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ప్రసవాలు, జ్వరాల కేసులు వివరాలను వైద్యులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ నాగరాణి మాట్లాడుతూ ప్రజలలో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం కలిగించేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణతోపాటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించినపుడే వైద్యులుగా మీరు గుర్తింపు పొందడమేగాక, రోగుల మన్ననలు పొందుతారన్నారు. తద్వారా సమాజానికి మంచి జరుగుతుందన్నారు. పీహెచ్‌సీలో గురువారం జన్మించిన శిశువు బర్త్‌ సర్టిఫికెట్‌ను శిశువు తల్లికి జిల్లా కలెక్టర్‌ నాగరాణి అందజేశారు. జిల్లా కలెక్టర్‌ వెంట ఆర్డీవో ఎం.అచ్యుత్‌ అంబరీష్‌, తహసీల్దారు దుర్గాకిషోర్‌ ఉన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 12:24 AM