సాగు నీటికి ఇబ్బంది రాకూడదు : కలెక్టర్
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:29 AM
రబీలో సాగు నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ సలహా సమా వేశం మంగళవారం నిర్వహించారు.

భీమవరం, మార్చి 5 : రబీలో సాగు నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ సలహా సమా వేశం మంగళవారం నిర్వహించారు. కాల్వల్లో ప్రవాహానికి అడ్డుగా వుంటున్న కర్ర నాచు తొలగింపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ కమిటీని వీఆర్వో, లస్కర్, పోలీస్, వ్యవసాయ శాఖ సిబ్బందితోను, మండల కమి టీలను తహసీల్దార్, ఇరిగేషన్, ఎస్సై, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేయాలన్నారు. ఆయా టీంలు రోజు ఒక గంట కాలువల పర్యవేక్షణతోపాటు, ఐదుగురు రైతు లను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకొని పరిష్క రించా లన్నారు. ఎరువులు కొరత లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఖరీఫ్‌లో 68,796 మంది రైతులకు ధాన్యం కొనుగోలు నిమిత్తం రూ926.67 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 66,991 మంది రైతులకు రూ.910.43 కోట్లు చెల్లించామని ఇంకా 1,305 మంది రైతులకు రూ.16.24 చెల్లించాల్సి ఉందన్నారు. ఈకేవైసీలో వున్న ఇబ్బం దులను సరిచేసి వారం రోజుల్లో నగదు జమకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యవసాయసలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇంకా చెల్లించవలసిన మొత్తాన్ని రైతుల ఖాతాలకు జమయ్యేలా చూడాలన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు, నీటి పారుదల శాఖ ఈఈ దక్షిణామూర్తి, సివిల్ సప్లై జిల్లా మేనేజరు టి.శివరామ ప్రసాదు, జిల్లా సివిల్ సప్లై అధికారి సరోజ, పశుసంవర్ధక శాఖ అధికారి మురళీకృష్ణ, లీడ్‌బ్యాంకు జిల్లా మేనేజరు ఏ.నాగేంద్ర ప్రసాదు, నాబార్డు డీడీ అనిల్‌కాంత్, వ్యవసాయ సలహా మండలి సభ్యుడు కొట్టి కుటుంబరావు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.