బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:58 PM
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ అన్నారు.

అధికారులతో కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ సమావేశం
ఏలూరు కలెక్టరేట్, జూన్ 7: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగింది. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి కేవీ.బుల్లికృష్ణ, ప్రిన్సిపల్ మేజిస్ర్టేట్ రచన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్‌పై దృష్టి సారించా లన్నారు. ఇటుకల పరిశ్రమ, జీడి, చిన్నతరహా పరిశ్రమలు, దుకాణాలు తనిఖీచేసి బాల కార్మికులను గుర్తించాలన్నారు. చింతలపూడి, లింగపాలెం ప్రాంతాల్లో పొగాకు, హార్వెస్టింగ్ పనుల్లో తనిఖీ నిర్వహించాలని సూచించారు. జిల్లాలో చైల్డ్‌లేబర్ విజిలెన్స్ గ్రూపును ఏర్పాటు చేయాలని సూచించారు. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీనివాస్, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
మిషన్ వాత్సల్యపై సమన్వయంతో పనిచేయాలి
మిషన్ వాత్సల్య అమలుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికా రులతో జిల్లా బాలల సంక్షేమ, రక్షణ కమిటి చైర్మన్, కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ అధ్య క్షతన సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ నిరాదరణకు గురైన బాలలకు విద్య, ఆరోగ్యం, అభివృద్ధి వంటి అవసరాలకు వాత్సల్య పథకంలో ఆర్ధిక సహాయం అందించబడుతుందన్నారు. ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బాల్యాన్ని అందించటమే ప్రధాన లక్ష్యమన్నారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కేకేవి బుల్లికృష్ణ, బి.రచన, ఐసీడీఎస్ పీడీ కె.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.