సమష్టి కృషితో ఎన్నికలు : కలెక్టర్ నాగరాణి
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:20 AM
జిల్లాలో నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిర్వహణకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

భీమవరం రూరల్, అక్టో బరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిర్వహణకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఆమె ఇరు శాఖల అధికారులతో సమీక్షించారు. ‘నీటితీరువా వసూలు, శివారు భూములకు నీటి విడుదల, తదితర అంశాలను నీటి పంపిణీ సంఘాల ద్వారా నిర్వహిస్తాం. జిల్లాలో వున్న ఒక ప్రాజెక్టు కమిటీ పరిధిలో 20 నీటి పంపిణీ కమిటీలు ఉన్నా యి. జిల్లాలో 112 నీటి వినియోగదారుల సంఘాలకు గాను 98 మేజర్, 14 మైనర్ సంఘాలు ఉన్నాయి. మేజర్ సంఘాల్లో 12 మంది సభ్యుల చొప్పున, మైనర్ సంఘాల్లో ఆరుగురు సభ్యుల చొప్పున ఉంటారు. అక్టోబరు 31న ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా జాబితా ప్రకటన, వీటిపై నవంబరు 1, 2 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, వాటిని 3న పరిష్కరించి తుది విడుదల చేస్తాం. 6 నుంచి 10 వరకు భూయజమానుల జాబితా, ఓటర్ల జాబితా తయారీ, 11, 12 అభ్యంతరాల స్వీకరణ, 13న వాటిని పరిష్కరించి తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తాం. నవంబర్ 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. 21 నుంచి 23 మధ్య నీటి సంఘాల సభ్యులు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. 24 నుంచి 26 మధ్య నీటి పంపిణీ సంఘాలకు, నవంబర్ 27, 29 తేదీల మధ్య ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు జరుగుతాయి’ అని కలెక్టర్ వివరించారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో జె.ఉదయభాస్కరరావు, నీటిపారుదలశాఖ అధికారి పి.నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు.