Share News

టీడీపీ రాగానే చింతలపూడి నిర్మాణం

ABN , Publish Date - Feb 16 , 2024 | 12:30 AM

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన చింతలపూడిని ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి రైతులకు కానుకగా ఇస్తానని, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు.

 టీడీపీ రాగానే చింతలపూడి నిర్మాణం
వేల్పుచర్లలో స్థానికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పార్థసారథి

ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

నూజివీడు టౌన్‌, ఫిబ్రవరి 15: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన చింతలపూడిని ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి రైతులకు కానుకగా ఇస్తానని, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు పట్టణంలో బుధవారం రాత్రి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నూజివీడు పట్టణ టీడీపీ అధ్యక్షుడు మల్లిశెట్టి జగదీష్‌ నివాస గృహంలో పట్టణంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ప్రజానాడి స్పష్టంగా ఉందని, టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో పాత మున్సిపాల్టీల్లో నూజి వీడు ఒకటని, అయినా ఆ స్థాయిలో నూజివీడు పట్టణం అభివృద్ధి సాధించ లేదన్నారు. తాను అధికారంలోకి రాగానే మున్సిపల్‌ నిధులు, కేంద్ర నిధులు ఏవి అందుబాటులో ఉన్నా నూజివీడులో రహదారుల విస్తరణ చేపట్టడంతో పాటు డ్రైనేజి వ్యవస్థ మెరుగుకు చర్యలు చేపట్టి పరిసర ప్రాంతాలకు కేంద్ర స్థానంగా నూజివీడును అభివృద్ధి చేస్తానన్నారు. నూజివీడు పట్టణంలో ముఖ్య కార్యకర్తలతో మాట్లాడటానికి వచ్చిన ఆయనను నూజివీడు మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పసుపులేటి జగన్‌, పట్టణ అధ్యక్షులు మల్లిశెట్టి జగదీష్‌ సాదరంగా ఆహ్వానించారు. నూజివీడు కౌన్సిలర్‌లు యార్లగడ్డ ప్రసాద్‌, తిరుమలశెట్టి సాధనా స్రవంతి, పట్టణ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ ఎం. శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ముసునూరు: నవరత్నాలకు ఈ ప్రభుత్వం నొక్కుతున్న బటన్‌లో సగం బటన్‌ రైతుల సంక్షేమానికి కేటాయిస్తే సాగుకష్టాలు తప్పేవని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. వేల్పుచర్ల, బలివే గ్రామాల్లో గురు వారం విస్తృతంగా పర్యటించారు. తొలుత టీడీపీ వేల్పుచర్ల గ్రామ అధ్యక్షులు మానం గంటేశ్వరరావు తదితరులతో సమావేశమై పలు విషయాలను చర్చించారు. అనంతరం పాదయాత్రగా గ్రామదేవత అంకమ్మ ఆలయానికి వెళుతుండగా స్థానికులు ఆయనకు తమ సమస్యలను వివరించారు. గడ్డం సుబ్బమ్మ నివాస గృహం షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమై మూడేళ్ళు గడిచినా నేటికి ప్రభుత్వం నుంచి పరిహారం, ఇతర సదుపాయాలు అందలేదని పార్ధసారధి దృష్టికి తేగా ఆయన వెంటనే ముసునూరు తహసీల్దార్‌ జవహర్‌ బాజీకి ఫోన్‌చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అగ్నిబాధిత కుటుంబానికి రూ.5వేలు నగదుతో పాటు పక్కా ఇల్లు మంజూరు చేయాలనే విషయం మీకు తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడురోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించి బాధితురాలికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం అంకమ్మ వారిని దర్శించుకుని ఆలయానికి రూ.50 వేలు విరాళాన్ని ఆయన అందజేశారు.

చెక్‌డ్యామ్‌ పరిశీలన...

బలివే శివారు వెంకటాపురం తమ్మిలేరులో కొట్టుకుపోయిన చెక్‌డ్యామ్‌ను పార్థసారఽథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ చెక్‌డ్యామ్‌ నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఈ చెక్‌డ్యామ్‌ మంజూరైనప్పటికీ టీడీపీ ప్రభుత్వం దీన్ని నిర్మించిందని 2019–20 మధ్యలో కురిసిన భారీ వర్షాలకు చెక్‌డ్యామ్‌, సప్లైఛానెల్‌ కొట్టుకుపోయి మరమ్మతుకు గురికాగా నేటి వరకు ఈ ప్రభుత్వం మరమ్మతులకు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో రైతుల సమస్యల పరిష్కా రానికి నిధులను కేటాయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం బలివే రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. టీడీపీ నాయకులు పర్వతనేని గంగాధర్‌, తుమ్మల నాగేశ్వరరావు, మానం వంశీ, గద్దె రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2024 | 12:30 AM