Share News

90 రోజుల్లో ..

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:12 AM

ఆచంటలో ఆదివారం టీడీపీ, జనసేన నిర్వహించిన ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు మహిళలు కదలి వచ్చారు.

90 రోజుల్లో ..
ఆచంట సభలో మాట్లాడుతున్న చంద్రబాబు

జగన్‌ సర్కార్‌ పతనం

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి తిమింగలాలు

పశ్చిమలో నిలిచిన అభివృద్ధి.. టీడీపీ–జనసేన కూటమిదే గెలుపు

అధికారంలోకి రాగానే మూడు పంటలకు సాగు నీరు

పోలవరం ప్రాజెక్టు పూర్తి.. ఆక్వాకు రాయితీలు ఇస్తాం

ఆచంట సభలో టీడీపీ అధినేత చంద్రబాబు

భీమవరం/ఆచంట, జనవరి 7 : ‘పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు పంటలకు సాగు నీరందిస్తాం. ఆక్వా రంగానికి రాయితీ ఇచ్చి పూర్వ వైభవం తీసుకువస్తాం. జగన్మోహన్‌రెడ్డి వైసీపీ హయాంలో రెండు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు తగ్గింది. రైతులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. టీడీపీ–జనసేన కూటమి అఽధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూపాయిన్నరకే యూనిట్‌ విద్యుత్‌ అందజేస్తాం’ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఆదివారం టీడీపీ, జనసేన నిర్వహించిన ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు ఉద్వేగంగా మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు మహిళలు కదలి వచ్చారు. ‘ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పతనం ఖాయం. 90 రోజులు కష్టపడండి. ప్రజలను చైతన్యపరచండి. టీడీపీ–జనసేన కూటమి ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లండి. విజయం మనదే’ అంటూ చంద్రబాబు కార్యకర్తకు దిశా నిర్దేశం చేశారు. అధికార పార్టీ నేతలు అవినీతి తిమింగలాలు, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చక్రవర్తులు. ఆచంట ఎమ్మెల్యే రంగనాధరాజు అవినీతి తిమింగలం. ఇళ్ల స్థలాల సేకరణలో కోట్లు దోచుకున్నారు. చెరువులు తవ్వితే కమిషన్‌ తీసుకుంటున్నారు. భారతీయ విద్యాభవన్‌ సొమ్ములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదో ఊహించు కుని ఎగిరిపడుతున్నాడు. టీడీపీ–జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నీ కక్కిస్తాం. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు త న సొంత గ్రామంలో రైతులకు గోనె సంచులు ఇవ్వలేని ఎర్రి పప్ప. తణుకులో నిర్మాణాలు చేప డితే ఐదు శాతం కమీషన్‌ ఇవ్వాలి. టీడీఆర్‌ కుంభకోణంలో కోట్లు దోచుకుని వైసీపీ నేతలకు ఆదర్శంగా నిలిచారు. తణుకులో టీడీఆర్‌ కుంభకోణం చూసి రాష్ట్రమంతా టీడీఆర్‌ బాండ్లు ఇస్తున్నారు. తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. చిలక్కొట్టుడు సత ్యనారాయణ. భవనాలు నిర్మిస్తే కమిషన్‌లు ఇవ్వాల్సిందే. ఎవరిని విడిచిపెట్టడం లేదు. కోట్లు కొల్లగొడుతున్నాడు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ గజ దొంగ. భూములను ఆక్రమించుకుని రూ.52 కోట్లు దోచేశారు. సీఎం జగన్‌ విశాఖ రుషికొండలో ప్యాలస్‌ మాదిరిగానే భీమవరంలోనూ గ్రంధి శ్రీనివాస్‌ సొంత ప్యాలెస్‌ నిర్మించుకుంటున్నారు. ఇక నరసాపురంలో ముదునూరి ప్రసాదరాజు ఏటిగట్టు నిర్మించి రూ.15 కోట్లు బొక్కేశాడు. తక్కువ ధరకు భూములు కొని ఎక్కువ ధరకు విక్రయించి కోట్లు గడించారు. ఇలా అవినీతికి పాల్పడుతున్న వీరందరిని తప్పించే దమ్ము జగన్‌కు ఉందా ? అంటూ చంద్రబాబు నిలదీశారు.

స్థానిక సమస్యల ప్రస్తావన

నిడదవోలు, పాలకొల్లు, తణుకుకు కావాల్సిన మంచినీటి పైపులైన్‌ ప్రాజెక్టు నిలిచిపోయింది. బియ్యపుతిప్ప హార్బర్‌ పనులు ప్రారంభం కాలేదు. ఎన్‌ఐటికి భూములు ఇవ్వలేదు. కాలువలు, డ్రెయిన్‌లలో పూడిక తీయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. రోడ్లు కూడా నిర్మించలేకపోయారు. టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాను అభివృద్ధి చేస్తాం. అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. 2014లో 15 సీట్లు ఎమ్మెల్యే ఇచ్చారు. ఇప్పుడు అదే సత్తా చాటాలి. ఉమ్మడి పశ్చిమలో 15 సీట్లు గెలిపించాలి. ప్రజల్లో మార్పు వచ్చిందనడానికి సభకు విచ్చేసిన యువతే నిదర్శం’ అంటూ పేర్కొన్నారు. దాదాపు గంటసేపు చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. బాబు మాట్లాడుతున్నంత సేపు జనం కదలలేదు. హర్షద్వానాలతో మద్దతు ప్రకటించారు. చంద్రబాబు చేసిన ప్రతీ విన్నపం పైన స్పందించారు. అండగా మేముంటా మంటూ కార్యకర్తలు, నాయకులు, మహిళలు జేజేలు పలికారు. సభకు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అధ్యక్షత వహించగా, సమావేశంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల టీడీపీ అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి, గన్ని వీరాంజనేయులు, కెఎస్‌ జవహర్‌, జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవింద రావు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, మాజీ మంత్రులు పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు కలవపూడి శివ, ఆరిమిల్లి రాధాకృష్ణ, బూరుగుపల్లి శేషారావు, ఇన్‌చార్జిలు వలవల బాబ్జి, బొమ్మిడి నాయకర్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్సీలు అంగర రామ్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

ఉప్పొంగిన ఆచంట..

ఆచంట/పెనుగొండ, జనవరి 7 : నాలుగు న్నరేళ్లలో జగన్‌ ప్రభుత్వం సాగించిన అరాచకాలను ఎండగట్టారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలను వివరించారు. టీడీపీ–జనసేన ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ.. వస్తే ఏం చేస్తామో విశదీకరిస్తూ.. సాగింది.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ప్రసంగం.ఆచంటలో ఆదివారం జరిగిన రా.. కదలిరా.. బహిరంగ సభ జనంతో కిక్కిరిసింది. జిల్లాలోని ఏడు నియోజక వర్గాల నుంచి వచ్చిన జనంతో ఆచంట కిక్కిరిసింది. సభకు అశేషంగా జనం రావడంతో తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం నెలకొంది. టీడీపీ, జనసేన యువకులు ప్లెక్సీలు, జెండాలతో కేరింతలు కొట్టారు. సభ రెండున్నర గంటలపాటు జరగ్గా వచ్చిన జనం సభ పూర్తయ్యే వరకు అలాగే ఉండిపోయారు. హెలిప్యాడ్‌ నుంచి సభా వేదిక వద్దకు వచ్చే మధ్యలో చంద్రబాబు ప్రసిద్ది చెందిన ఆచంటేశ్వ రుడిని దర్శించుకున్నారు. రాష్ట్రానికి స్వర్ణయుగం వచ్చి, ప్రజలకు మంచి చేసే శక్తిని తనకు ఇవ్వాలని కోరుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఆలయం వద్ద టీడీపీ నాయకుడు బోడపాటి దుర్గాప్రసాద్‌ ఏర్పాటుచేసిన కమలా ఫలాలు దండతో స్వాగతం పలికారు. సభా వేదికపై జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు గజమాలతో సత్కరించారు.

పర్యటన సాగిందిలా..

చంద్రబాబు తిరువూరు నుంచి సాయంత్రం 4.05 గంటలకు ఆచంట హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. 4.50 గంటలకు ఆచంటేశ్వరుని దర్శించుకున్నారు. 5.20కు సభా స్థలికి చేరుకున్నారు. 5.35కు బాబు ప్రసంగం ప్రారంభించి 6.30కు ముగించారు. అనంతరం రోడ్డు మార్గంలో రాజమండ్రి ఎయిర్‌ పోర్టుకు బయలుదేరి వెళ్లారు. ఆచంటలో 2.30 గంటలపాటు చంద్రబాబు సాగింది.

Updated Date - Jan 08 , 2024 | 12:12 AM