Share News

పచ్చడి ఘాటు

ABN , Publish Date - May 15 , 2024 | 12:24 AM

పచ్చళ్ల సీజన్‌కు ఎన్నికలు అడ్డుపడ్డాయి. పోలింగ్‌ ముగియడంతో ఆవకాయ పచ్చడిపై మహిళలు దృష్టి సారించారు.

పచ్చడి ఘాటు

మామిడి ధరకు రెక్కలు

మండుతున్న కారం

కాగుతున్న నూనె

పాలకొల్లు రూరల్‌/గణపవరం, మే 14: పచ్చళ్ల సీజన్‌కు ఎన్నికలు అడ్డుపడ్డాయి. పోలింగ్‌ ముగియడంతో ఆవకాయ పచ్చడిపై మహిళలు దృష్టి సారించారు. వేసవిలో అవకాయ, మాగాయ వంటి పచ్చళ్లు పెట్టుకోవడం సర్వసాధారణం. మామిడి నుంచి కారం, నూనె వరకు ధరలు పెరగడంతో పచ్చటి ఘాటెక్కింది. పేద మధ్య తరగతి వారికి పచ్చడి చేదుగా మారింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ప్రధాన పట్టణాలు, మండలాల్లో మామిడి కాయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

హడలెత్తిస్తున్న ధర

ఈ ఏడాది మామిడి ధర వింటేనే హడలెత్తిపోతున్నారు. ఆవకాయ పచ్చడికి పేరొందిన కొత్తపల్లి కొబ్బరి 100 కాయలు రూ.3500 ధర పలుకుతున్నాయి. చిన్న రసాలు రూ.2వేల వరకు, పెద్ద రసాలు రూ.1500 – రూ.1800, సువర్ణరేఖ రూ.1500, దేశవాళి రకం రూ.1400 చొప్పున విక్రయాలు జరిగాయి. స్తోమతను బట్టి మామిడి కాయలు కొనుగోలు చేసుకుంటున్నారు. మామిడి దిగుబడి తగ్గడం, వర్షాలు, వడగళ్లు మామిడిని దెబ్బతీశాయి. తుని, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, జి.కొత్తపల్లి, కంసాలిగుంట, తదితర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నాయి.

100 కాయల పచ్చడి రూ.10 వేలు

గత కొన్ని రోజులుగా మార్కెట్‌లో పలు రకాల పచ్చడి మామిడి కాయలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ధరలు పెరగడంతో వంద కాయల పచ్చడి పెట్టుకునే వారు 50 కాయలతో సరిపెట్టుకుంటున్నారు. వంద కాయలతో ఆవకాయ పచ్చడికి సుమారు రూ 10వేలు ఖర్చవుతున్నదని మహిళలు చెబుతున్నారు. కాయను ముక్కలుగా చేయడాని కాయకు రూ3, గానుగ నూనె (నువ్వుల నూనె) లీటరు రూ 600, వేరుశనగ రూ. 180, పచ్చడి కారం కిలో రూ800, వెల్లుల్లి పావుకిలో రూ80, ఆవాలు కిలో రూ140, మెంతులు కిలో రూ.130 అమ్ముతున్నారు.

సీజన్‌ కూలీలకు ఉపాధి

పచ్చడి మామిడి కాయలు కొనుగోలు చేసినవారు ముక్కలు కొయ్యలేక మార్కెట్‌లోనే ముక్కలు కొట్టిస్తారు. ముక్కలు కొట్టడంలో కాయ దెబ్బతింటే పచ్చడి కూడా పాడవుతుంది. సీజన్‌లో జిల్లాలోని వారపు సంతలకు మామిడి ముక్కలు నరికే మహిళలు కుటుంబాలతో తరలివస్తారు. మామిడి ముక్కలు నరకడమే వారి జీవనోపాధి. పెనుగొండ, పాలకొల్లు, గణపవరం, మాముడూరు, తదితర ప్రాంతాల నుంచి 20 కుటుంబాల వారు మహిళల తో సహా వచ్చి పచ్చడి మామిడిముక్కలు నరుకుతుంటారు. ముక్కలు నరికి నందుకు కాయకు రూ.3 చొప్పున వంద కాయలకు రూ.300 తీసుకుంటారు. గత ఏడాది కాయకు రూ.2చొప్పున వసూలు చేయగా ఈ ఏడాది కాయకు రూ3చొప్పున వసూలు చేసుకున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో ప్రధాన మార్కెట్లలో మామిడి ముక్కలు కొట్టేవారికి గిరాకీ ఉంది. వేసవి నెల రోజులు ఈ కుటుంబాలకు జీవనోపాధిని ముక్కలు నరికే శ్రామికులు తెలిపారు.

Updated Date - May 15 , 2024 | 12:24 AM