Share News

ఓటర్లకు చేరిన సొమ్ము రూ.400 కోట్లు ఏమైంది

ABN , Publish Date - May 22 , 2024 | 12:17 AM

సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులంతా బహుమతులు పంచారు. ఓటుకి రేటు కట్టారు

ఓటర్లకు చేరిన సొమ్ము రూ.400 కోట్లు   ఏమైంది

మార్కెట్లో కొనుగోళ్ళపై కనిపించని ప్రభావం

ఎందుకింత సైలెంట్‌ అంటూ వ్యాపారుల ఆరా

సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులంతా బహుమతులు పంచారు. ఓటుకి రేటు కట్టారు. గ్రూపుల వారీగా లెక్క కట్టి వారి ఖాతాల్లో వేశారు. నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా పోటీలు పడి మరీ రూ.40 నుంచి రూ.50 కోట్ల వరకు నోట్లకట్టలు విసిరారు. ఒక్క ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో దాదాపు రూ.400 కోట్లకు పైబడే ఖర్చు చేసినట్లు అంచనా. కాని ఇంత సొమ్ము పంచితే ఎక్కడ దీని ప్రభావం మార్కెట్ల మీద పొడ చూపలేదు. బ్యాంకుల్లో రుణాలు తీర్చింది లేదు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులంతా అధికారుల కళ్ళు కప్పి, ఓటర్ల మనసు గుర్తించి ఎడాపెడా నోట్లు విసిరారు. ఓటుకు ఇంత అని డిమాండ్‌ చేసిన వారికి అంతే మొత్తంలో, ఇంకొందరికి తాము ఎంతిస్తే అంతే అనుకునే వారికి అంత మొత్తంలోనూ చేతిలో పెట్టి ఓటు నమస్కారం పెట్టారు. తమను గెలిపించాలని పదే పదే అభ్యర్థించారు. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి డ్వాక్రా సంఘాలను లెక్కకట్టి మరీ పంపకాలు చేశారు. ఎక్కడా గుట్టు బయట పడకుండా అన్ని మహిళ, పురుష సంఘా లతోపాటు కులాలవారీగా కొన్ని గుర్తించిన సంఘాలకు పెద్ద మొత్తంలోనే నగదు బదిలీచేశారు. జిల్లాలో 43,840 మహిళా పొదుపు సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘానికి రూ.10 వేలకు తగ్గకుండా ప్రధాన పక్షాల అభ్యర్థులు చెల్లించారు. ఈ సంఘాల్లో నాలుగు లక్షల 36 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. లోక్‌సభ స్థానం పరిధిలో 15 లక్షల కుపైగా ఓటర్లు ఉండగా, వాటిలో సగానికి సగం మహిళలే. ఈ లెక్కన డ్వాక్రా సంఘాలకు పెద్ద ఎత్తున ఎన్నికల్లో నగదు ముట్టచెప్పినట్లు ప్రచారం గుప్పుమంది. ప్రచారం జరుగుతున్నట్లు ప్రధాన పక్షాలు ఈ సంఘాల్లో మహిళలకు దాదాపు రూ.100 కోట్ల వరకు ఇచ్చినట్లు అంచనా.

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ఓటర్లకు, ఇతర ఓటర్ల కు చేతికి డబ్బు అందిన వెంటనే మార్కెట్‌పై పడే వారు. గృహావసరాలకు వీలుగా ఎలక్ర్టానిక్‌ పరికరాలతో సహా మిగతా వాటికి వచ్చిన డబ్బు అంతా సర్దేసేవారు. కాని ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ పూర్తయ్యి పది రోజులు గడుస్తున్నా ఏలూరు జిల్లా మార్కెట్‌లపై ఈ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. కూలర్లు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ర్టానిక్‌ గ్రూడ్స్‌తోపాటు షాపింగ్‌ మాల్స్‌లోనూ అమ్మకాలు పెరగలేదని అంచనా వేస్తున్నారు. ‘బయట ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఎంత వచ్చినా సరిపోవడం లేదు. నెల వారీ విద్యుత్‌ ఛార్జీలతోపాటు మిగతావన్ని తలకు మించిన భారంగా మారాయి. ఓటుకు డబ్బు తీసుకుంటున్నామని చులకన చేస్తున్నారే తప్ప ఇంటిని గట్టు ఎక్కించేందుకు తృణమో ఫణమో ఆశించిక తప్పట్లేదంటే ఎవరైనా నమ్ము తారా ? ఇక బయట మార్కెట్‌కు వెళ్ళి ఏం కొంటాం, వచ్చే నెల స్కూల్‌ తెరుస్తారు. కాబట్టి ఇంటి ఖర్చు రెట్టింపవు తుంది’’ అంటూ ఏలూరుకు చెందిన ఓ మధ్య తరగతి కుటుంబీకురాలి మనోభిప్రాయం. మహిళా గ్రూపు సంఘా ల్లోనూ వచ్చిన డబ్బుల్లో అత్యధిక భాగం పాత రుణాలు చెల్లించటానికే సరిపోయిందని కొందరు వాదిస్తున్నారు. బ్యాంకర్లు మాత్రం ఈ స్థాయిలో చెల్లింపులు పుంజుకోలేదని చెబుతున్నారు. సామాజికవర్గాల వారీగా కొందరికి గంప గుత్తగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. 100 మందికి తగ్గకుండా గ్రూపుగా ఉన్న మహిళా సంఘాలకు లక్షన్నర నుంచి మూడు లక్షల వరకు చెల్లించారు. కొన్ని మండలాల్లో 500 మందికి తగ్గకుండా ఉన్న వారికి మనిషికి వెయ్యి చొప్పున లెక్కకట్టి అక్షరాల రూ.5 లక్షలను జేబులో పెట్టారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రధాన పక్షాల అభ్యర్థులే రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు ఒక అంచనా. ఈ లెక్కన ఏడు నియోజకవర్గా ల్లోనూ రూ.400 కోట్లకు తక్కువ కాకుండా నగదు ఓటర్ల వద్దకు చేరినట్లే. గత ఎన్నికల్లో అయితే అత్యధికులు టూ వీలర్స్‌ కొనుగోలుకు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడంతో రూ.250 కోట్ల మేర అమ్మకాలు సాగాయని అప్పట్లోనే విశ్లేషించారు. ఈసారి దానికిమించి భారీగా నగదు వినియోగం జరిగినా, అంతా సైలెంట్‌గా ఉండటం కొత్త పరిణామంగా భావిస్తున్నారు.

Updated Date - May 22 , 2024 | 12:18 AM