Share News

ఆధునికీకరణ అంటే ఏమిటి ?

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:24 AM

పశ్చిమ డెల్టా ఆధునికీకరణ ఊసే లేకుండా వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు గడిపేస్తోంది. ఆధునికీకరణ పనుల కోసం పైసా మంజూరు చేయలేదు. తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులు సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వంగా మిగిలిపోయింది.

ఆధునికీకరణ అంటే ఏమిటి ?

పశ్చిమ డెల్టా ఆధునికీకరణ ఊసే లేకుండా వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు గడిపేస్తోంది. ఆధునికీకరణ పనుల కోసం పైసా మంజూరు చేయలేదు. తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులు సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వంగా మిగిలిపోయింది. సాగు నీటి కోసం రైతులు ఇబ్బందులు పడే దుస్థితి కల్పించింది. ఇప్పటికీ వేసవి పనులకు బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. ఫలితంగా వేసవిలో తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులు నిర్వహించలేకపో తున్నారు. కాలువలు అస్తవ్యస్తంగా మారడంతో శివారు ప్రాంతాలకు సాగు నీరు అందని ద్రాక్షే అవుతోంది.

ఐదేళ్లుగా ఆ ఊసే ఎత్తని ప్రభుత్వం

ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారు..

వేసవి పనులకు నిధుల విడుదల అంతంతమాత్రం

రబీకి రూ.2 కోట్లతో సరిపెట్టిన వైనం

నీటి కొరత తప్పదు.. రైతుల ఆందోళన

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రస్తుత రబీలో నీటి ఎద్దడి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆచంట, గణపవరం వంటి మండలాల్లో సాగునీటికి అవస్థలు పడుతున్నారు. మున్ముందు ఇతర మండలాలకు ఈ కష్టాలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టయితే పనులు నిర్వహించేవారు. కాలువల్లో కొద్దిపాటి నీరైనాసరే సక్రమంగా ప్రవహించేది. శివారు ప్రాంతాలకు నీరందే వెసులుబాటు కలిగేది. వైసీపీ ప్రభుత్వ హయాం లో గడిచిన ఐదేళ్లుగా నీటిపారుదల శాఖను ప్రభుత్వం పూర్తిగా విస్మ రించింది. ఇప్పటికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల మేర బకాయిలు చెల్లించాలి. ప్రభుత్వం బకాయిలు ఊసే మరిచిపోయింది. దీంతో వేసవిలో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పనులు సవ్యంగా సాగడం లేదు.

ప్రతిపాదనలకే పరిమితం

రాష్ట్ర ప్రభుత్వం ఆధునికీకరణ పనులు నిర్వహిస్తుందన్న ఆశతో మూడేళ్ల క్రితం పశ్చిమ డెల్టాకు సంబంధించి రూ.250 కోట్లతో ప్రతిపా దనలు పంపారు. ప్రభుత్వం కొర్రీలు వేసి ప్రతిపాదనలను తిప్పి పం పింది. నిధులు కేటాయిస్తుందన్న ఆశతో ఎదురుచూసిన అధికారులకు చుక్కెదురైంది. ఆ తర్వాత ప్రభుత్వమే చొరవచూపింది. పశ్చిమ డెల్టా పరిధిలో మిగిలిన ఆధునికీకరణ పనులను పూర్తి చేస్తామంటూ వైసీపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. వాస్తవానికి రూ.1,400 కోట్లతో ఆధునికీక రణ పనులను 2008లో ప్రారంభించారు. రూ.700 కోట్ల విలువైన పను లు పూర్తిచేశారు. మరో రూ.700 కోట్ల పనులు పెండింగ్‌లో ఉండిపో యాయి. ఏలూరు కాలువ పూర్తిగా ఆధునికీకరణకు నోచుకోలేదు. తాజాగా ఆ మొత్తానికి ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశిం చింది. ఆ మేరకు సాగు నీటి శాఖ పరిధిలో రూ.500 కోట్లు, డ్రైనేజీ విభాగంలో రూ.200 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం సదరు ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. ఆధునికీకరణను అటకెక్కించింది. చివరకు ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌లకు దిక్కు లేకుండా పోయింది. డెల్టా రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.

కేంద్ర నిధులను విస్మరించారు

నీటిపారుదల శాఖ గతంలో కేంద్రం నిధులను ఉపయోగించు కునేది. ఉపాధి హామీ నిధులను ఉపయోగించి పంట బోదెలను ప్రక్షాళన చేసేవారు. నీరు–చెట్టు నిధులతో కాలువల పూడిక పనులు చేపట్టే వారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి నిధుల వినియోగం తగ్గింది. కేవలం జగనన్న ఇళ్లకు మాత్రమే కాస్త ఉపాధి నిధులు ఉపయోగపడుతున్నాయి. అదే నీటిపారుదల శాఖలో మాత్రం పైసా నిధులు వినియోగించుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధు లు విడదల్చడం లేదు. ఫలితంగా నీటిపారుదల శాఖ కేవలం సాగు నీటి పర్యవేక్షణకే పరిమితమవుతోంది. వేసవిలో సాగు నీటి అవసరా లకు తీర్చేందుకు ప్రభుత్వం పెద్దగా నిధులు కేటాయించలేదు. కేవలం రూ.2 కోట్లు మాత్రమే మంంజూరు చేశారు. ఆ మేరకే ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసరమైతే గోదావరిలో సిద్దాంతం వద్ద ఎత్తిపోతలను అమలుచేయాలి. ఇందుకు నిధులు వెచ్చించాలి. కాలువలు, డ్రెయిన్‌లలో మోటార్లు ఏర్పాటుచేయాలి. ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదు. డిసెంబరులో తుఫాను ప్రభావం లేకుంటే ఇప్పటికీ సాగు నీటి కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి తలెత్తేది.

డిసెంబరులో కురిసిన వర్షాలతో రైతులు సునాయాసంగా నాట్లు వేసుకో గలి గారు. ఆ తర్వాత వంతుల వారీ విధానం అమలు లోకి తెచ్చారు. ఎండలు కాస్త తక్కువగా ఉన్నాయి. వేసవి ముదిరితే సాగు నీటికి ఇబ్బందులు తప్పవు. ఈ అవసరాలు తీర్చాలంటే ఎత్తిపోతలు చేపట్టాలి. ఇందుకు ముందుగానే కాంట్రాక్టర్లను పిలవాలి. లేదా రైతులే ఏర్పాటు చేసుకునే విధంగా నిధులు కేటాయించాలి. ప్రభు త్వం మాత్రం నిధులు కేటాయింపుపై పెద్దగా శ్రద్ధ చూప డం లేదు. దీంతో రబీపైనా ఆందోళన నెలకొంటోంది.

ఇదేనా రైతు సంక్షేమం

వెంకయ్య వయ్యేరులో నీటి ప్రవాహానికి అడ్డంకులు

చిట్టడివిలా పేరుకుపోయిన గుర్రపు డెక్క..తొలగించాలని రైతుల డిమాండ్‌

తొలగింపునకు అధికారుల ప్రతిపాదనలు.. స్పందించని జగన్‌ సర్కార్‌

గణపవరం, ఫిబ్రవరి 12 : రైతు సంక్షేమమే ధ్యేయమని జగన్‌ సర్కార్‌ చెబుతున్నప్పటికి ఆచరణలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. సాగు నీటి రంగంలో నిర్లక్ష్య ధోరణి కారణంగా వెంకయ్య వయ్యేరు దుస్థితి రైతుల కంట తడిపెడుతున్నాయి. 40 గ్రామాల ప్రజలకు సాగు, తాగు నీరు అందించే వెంక య్య వయ్యేరులో గుర్రపు డెక్క పేరుకుపోయి చిట్టడివిలా తయారైంది. తాగు నీరు, ఆక్వా, వరి సాగు కు ప్రధానంగా ఈ కాల్వ నీరే ఆధారం. గణపవరంలోని ఇరిగేషన్‌ కార్యాలయం ఎదుటే వెంకయ్య వయ్యేరులో ఈ గుర్రపు డెక్క మేట వేసుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారింది. ప్రభు త్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని, గుర్రపు డెక్క తొలగింపుపై దృష్టి సారించలేదని రైతులు, ప్రజ లు మండిపడుతున్నారు. గుర్రపుడెక్క, తూడును తొలగించి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయాలని రైతులు, ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా క్షేత్రస్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రబీ ముందే గోదావరి జలాల కొరతతో ముందస్తు నాట్లు వేసుకోవాలని మైక్‌లతో హోరెత్తించిన ప్రభుత్వ అధికారులు ఈ కాల్వ మరమ్మతులు, గుర్రపు డెక్కలు తొలగించే ప్రయత్నం చేయకపోవడంతో సాగు, తాగు నీటి ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. అలాగే విదేశీ మారక ద్రవ్యం అర్జించి పెడుతున్న ఆక్వా రంగానికి సాగు నీటి సరఫరాకు గుర్రపు డెక్కే ప్రధాన ఆటంకమని చెబుతున్నారు. ఇప్పటికే వంతుల వారీగా అధికారులు నీరందిస్తున్నారు. దీంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధ ప్రతిపాదికన గుర్రపు డెక్కను తొలగించి సాగు నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని వయ్యేరు పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు కోరుతున్నారు. దీనిపై గణపవరం ఇరిగేషన్‌ సెక్షన్‌ ఏఈ ఫణిశంకర్‌ను వివరణ కోరగా గుర్రపు డెక్క తొలగింపుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే తొలగింపు పనులు చేపడతామని చెబుతున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:24 AM