Share News

కొల్లేరులో నిలిచిన బోటు షికారు

ABN , Publish Date - May 26 , 2024 | 12:27 AM

పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సులోని ఆటపాక పక్షుల కేంద్రంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో వారం రోజులుగా బోటు షికారు నిలిచిపోయింది.

కొల్లేరులో నిలిచిన బోటు షికారు
నిలిచిన బోటు

ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అడుగంటిన నీళ్లు

పక్షులకు దగ్గరగా వెళ్ల లేక.. పర్యాటకుల నిరాశ

కైకలూరు, మే 25 : పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సులోని ఆటపాక పక్షుల కేంద్రంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో వారం రోజులుగా బోటు షికారు నిలిచిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బోటు షికారు లేదని తెలిసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఏటా వివిధ దేశాల నుంచి వలస పక్షులు వేలాదిగా తరలివచ్చి కొల్లేరు పరిసర ప్రాంతాల్లో సేద తీరుతుంటాయి. కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రానికి ఏటా పెద్దఎత్తున పర్యాటకులు తరలి వస్తుంటారు. ప్రస్తుతం సరస్సులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో కళావిహీనంగా మారింది. మరోవైపు పక్షుల ఆహారానికి కొరత ఏర్పడింది. బోటు షికారు నిలిచిపోవడంతో వచ్చే వలస పక్షుల అత్యంత సమీపంగా చూసే అవకాశాన్ని పర్యాటకులు కోల్పోయారు. వేసవిలో వివిధ ప్రాంతాల నుంచి కైకలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న బంధువుల ఇళ్ళకు వచ్చిన వారు సైతం కొల్లేరును సందర్శించకుండా వెళ్లరు. అయితే బోటు షికారు నిలిపివేయడంతో వీరంతా నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొల్లేరు సరస్సు 77,138 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నప్పటికి పర్యాటకంగా చూపేది పక్షుల కేంద్రంలోని 310 ఎకరాలు మాత్రమే. ఇక్కడ వివిధ దేశాల నుంచి వచ్చి వలస పక్షులు విడిది చేస్తాయి. ఆస్ట్రేలియా, సైబేరియా, నైబేరియా, కెనెడా దేశాల నుంచి ఏటా అక్టోబరు నుంచి మార్చి వరకు గూడులను ఏర్పాటు చేసుకొని సంతానోత్పత్తి చేసుకుం టాయి. వీటి విడిది కోసం అటవీశాఖ ఆధ్వర్యంలో చెట్లు, కృత్రిమ ఐరన్‌ స్టాండ్లు, మట్టి దిబ్బలు ఏర్పాటుచేశారు. పక్షుల విన్యాసాలను అత్యంత సమీపంగా తిలకించేందుకు అటవీశాఖ మరబోట్లును ఏర్పాటు చేశారు. అయితే ఈసారి వేసవిలో ఎండ తీవ్రతకు సరస్సులో నీరు గణనీయంగా తగ్గింది. దీంతో మరబోట్లు తిరగక పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నీటి నిల్వలు పెంచేందుకు ఆటపాక పక్షుల కేంద్రం చెరువు గట్ల నిర్మాణంలో అటవీశాఖ అధికారులు విఫలమయ్యారు. ఏటా దాదాపుగా ఇదే తంతు నడుస్తున్నప్పటికి గట్లను పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రస్థాయి అటవీశాఖ అధికారులు సైతం అనేకసార్లు పక్షుల కేంద్రాన్ని సందర్శించిన వీటి అభివృద్ధి కోసం ఒక్క రూపాయి విదిల్చిన పాపాన పోలేదు. అధికారులు ఇలా వచ్చి చూసి వెళ్లడమే తప్ప అభివృద్ధికి తీసుకున్న చర్యలు శూన్యం. సమీపాన వందల ఎకరాల చేపల చెరువుల్లో పుష్కలంగా నీరు ఉంటున్నప్పటికీ పక్షుల కేంద్రంలో నీరు లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించి ఏటా వేసవిలో బోటు షికారు ఏర్పాటుచేసేందుకు గట్లను పటిష్టం చేసి నీటి నిల్వలు పెంచాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

బోటు షికారు లేకపోవడంతో నిరాశ

– బి.బాలాజీ, మచిలీపట్నం

కుటుంబ సభ్యులతో కలిసి ఒకరోజు ఆటపాక పక్షుల కేంద్రాన్ని సందర్శించేందుకు మచిలీపట్నం నుంచి వచ్చాం. బోటు షికారు లేకపో వడంతో నిరాశకు గురిచేసింది. పక్షులను తిలకించకుండా వెనుదిరుగుతున్నాం. అటవీ శాఖ అఽధికారులు పక్షుల కేంద్రంపై దృష్టి సారించి గట్లను పటిష్టం చేసి నీటి నిల్వలు పెంచేలా చర్యలు తీసుకోవాలి.

Updated Date - May 26 , 2024 | 12:27 AM