Share News

కదనరంగంలో కమలం

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:00 AM

భారతీయ జనతా పార్టీ ఎన్నికల కదన రంగంలోకి దిగడానికి అంతర్గతంగా భారీ కసరత్తు చేస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీ నియో జక వర్గాల వారీగా ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులను అందుకుంది.

కదనరంగంలో కమలం

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు భారీగా దరఖాస్తులు

సీనియర్లతోపాటు కొత్త ముఖాలు కూడా రెడీ

నిలదొక్కుకోవడానికి వీలుగా ఎత్తులు

క్షేత్రస్థాయిలో పట్టున్న వారికే ఈసారి అవకాశం

క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లుగా తపన చౌదరి, లక్ష్మీనారాయణ

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

భారతీయ జనతా పార్టీ ఎన్నికల కదన రంగంలోకి దిగడానికి అంతర్గతంగా భారీ కసరత్తు చేస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీ నియో జక వర్గాల వారీగా ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులను అందుకుంది. గతంలో ఒక్కొ నియోజకవర్గంలో మూడంకెలు దాటకుండా బొటాబొటిగానే ఓట్లు లభించాయి. కాని ఈ మధ్య కాలంలో తమ పార్టీ పుంజుకుందని, మిగతా పార్టీలకు పోటీగా, సమానంగా నిలదొక్కుకోవడానికి సిద్ధమనే సంకేతాలను బయటకు పంపుతోంది. ఆ మేరకు పార్టీ కేడర్‌ను అప్రమత్తం చేసింది. జిల్లా అధ్యక్షులతో పాటు కోర్‌ కమిటీలు, క్లస్టర్ల వారీగా ఇన్‌చార్జ్‌లు, కో–ఇన్‌చార్జ్‌లను తాజాగా నియమించింది. పార్టీ పదాధికారులు నియోజకవర్గాల్లో బలాబలాలపై ఇప్పటికే ఆరా తీసి నివేదికలు సిద్ధం చేశారు. రానున్న కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకునేం దుకు అడుగులు వేస్తోంది. ఇతర పార్టీలతో పొత్తు ఉంటుందా, లేదా అనేదానిపై స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి వీలుగా బీజేపీ నేతలు ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రంగంలోకి దిగుతున్నారు. పార్టీ గతంకంటే పుంజుకుందనే ధీమాతో నేతలు ఉన్నారు. తాజాగా రాష్ట్ర నాయకత్వం మారి ఆ స్థానంలో పురందేశ్వరి పార్టీ పగ్గాలు చేపట్టడమే కాకుండా జిల్లాలను చుట్టిముట్టి వచ్చారు. జిల్లా స్థాయి కేడర్‌కు ఆమె సమయం కేటాయిస్తుండడం, తదను గుణంగానే పార్టీ నుంచి ఆదేశాలు వెలువడిన వెంటనే రంగం లోకి దిగి, సర్దుబాటు చేయడం వంటి చర్యల్లో ఈమధ్యన పురోగతి కనిపిస్తోంది. ప్రత్యేకించి జిల్లా అధ్యక్ష స్థానాలతో పాటు కొత్త కమిటీలను నియమించారు. పాత కమిటీల్లో ఉన్న సీనియర్లకు పదోన్నతి కల్పిస్తూ వారిలో అసం తృప్తి లేకుండా జాగ్రత్తపడ్డారు. అయినా కొందరు ఈ విషయంలో వెనుకబడే ఉండడం పట్ల అసంతృప్తి లేకపోలేదు.ఏలూరు జిల్లాలో కేడర్‌, నియోజక వర్గ నాయకత్వాలు సమన్వయం సాధించేలా ఇప్పటివరకు తీసుకున్న చర్యలన్నీ ఫలించాయి. ఈ నేపథ్యంలోనే పొత్తు సంగతి ఎలా ఉన్నా ఎన్నికల రంగంలో నిలదొక్కుకోవడానికి వీలుగా బీజేపీ తన కేడర్‌ను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న గారపాటి సీతారామాంజనేయచౌదరి (తపన చౌదరి) ఏలూరు పార్లమెం టు స్థానం నుంచి పోటీ చేయాలనే భావంతో ఇప్పటికే ఆయన కొన్నే ళ్లుగా సేవా కార్యక్రమాలు సా గిస్తున్నారు. తాగునీరు సరఫ రాకు వీలుగా ట్యాంకర్ల ఏ ర్పాటు, కొన్ని గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం, మరికొన్ని చోట్ల సేవా కార్యక్రమాల నిర్వహ ణకు విరాళాలు ఇస్తూ దాదాపు చాలా నియోజకవర్గాల్లో నిలదొక్కుకున్నారు. బీజేపీ పక్షాన ఒంటరిగానైనా లేకుంటే రాష్ట్ర రాజకీయాల్లో భాగంగా ఆకస్మిక పొత్తులు ఏర్పడితే ఆ దిశగాను పోటీకి ఆయన ఇప్పటికే సమాయత్తమయ్యారు. సీనియర్లను దగ్గర చేర్చుకోవడం, కేడర్‌తో తాను సన్నిహితంగా ఉండడం ద్వారా తగిన కార్పెట్‌ పరచుకున్నారు. తపనా చౌదరి తమ పార్టీ అభ్యర్ధిగా చాలా కాలం నుంచి బీజేపీలో ప్రచారం సాగుతూనే ఉంది.

తాజాగా కొన్ని జిల్లాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఆయా క్లస్టర్లకు బీజేపీ ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఉత్తరాంధ్రలో అరకు, శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖపట్నం, అనకాపల్లి క్లస్టర్‌కు ఇన్‌చార్జిగా తపన చౌదరిని నియమిం చారు. ఈ మధ్యనే అనారోగ్యానికి గురైన ఆయన కొంచెం తేరుకున్నారు. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కదులుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తులను అందుకుంది. పోలవరంలాంటి ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న ఆశావహులంతా ఉన్నత చదువులు చదివిన వారే. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. వాస్తవానికి బీజేపీ బలాన్ని అంచనా వేస్తూ వస్తున్న కొంతమంది పోటీ వచ్చేసరికి తమకే టికెట్లు కేటాయించాలనే రీతిలో ఉన్నారు. ఇంతకుముందు జిల్లా అధ్యక్షులుగా కొనసాగిన వారు, వివిధ పదవుల్లో ఉన్న వారు సైతం ఇప్పుడు ఆశా వహుల జాబితాలో ఉన్నారు. పూర్వపు జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ ఇప్పుడు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు క్లస్టర్‌కు ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. దీనికి తోడు పశ్చిమలో సీనియర్‌, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మ, పాకా సత్యనారాయణ వంటి నేతలంతా ఇప్పటికే ఎన్నికల కసరత్తులో నిమగ్నమై ఉన్నారు. ప్రత్యేకించి కీలక నియోజకవర్గాల్లో పోటీకి దిగేం దుకు వీలుగా సన్నద్ధమవుతున్నారు.

కీలక స్థానాల్లో నువ్వా నేనా..

కీలక స్థానాల్లో పోటీ నువ్వానేనా అనేటట్టుగా మారనున్నందున ఆ మేరకు బీజేపీ సైతం తగిన అభ్యరు ్థలను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. అందుకనే ఇప్పుడు ఎక్కడికక్కడ నియోజకవర్గ స్థాయి సమా వేశాలు నిర్వహిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ సైతం మరోవైపు నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి పెట్టింది. ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు ఎక్కడికక్కడ తగిన నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకించి జిల్లా అధ్యక్షులు తాతాజీ, విక్రమ్‌ కిషోర్‌తో పాటు మిగతా వారి పనితీరుపైన ఒక కన్నేసి ఉంచారు. ఇప్పుడు పార్టీకి అందిన దరఖాస్తులు చూస్తుంటే పార్టీకి ఇమేజ్‌ మరింత పెరిగినట్టుగా భావిస్తున్నామని సీనియర్లు చెబుతున్నారు. ఎందుకనంటే గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులన్నీ పార్టీకి కాస్తంత అనుకూలంగానే కనిపిస్తున్నా యని సీనియర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు పార్లమెంటు నుంచి గారపాటి చౌదరి పోటీకి సిద్ధంగా ఉన్నందున నరసాపురం నుంచి ఎవరిని బరిలోకి దింపుతారనే విషయంపైన లోతైన కసరత్తు చేస్తున్నారు. భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు ఏలూరు, నూజివీడుల, కైకలూరు అసెంబ్లీ స్థానాల నుంచి దాదాపు పది మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. దీనిని బట్టి చూస్తుంటే విద్యావంతులు, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నవారు, వివిధ వర్గాలతో సాన్నిహిత్యం పొందిన వారినే అభ్యర్థులుగా ఎన్నిక చేసే అవకాశం ఉంది. రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీనివాసవర్మను సైతం ఈసారి ఎన్నికల బరిలోకి దింపే యోచనలో పార్టీ ఉన్నట్టు సమాచారం.

Updated Date - Jan 29 , 2024 | 12:00 AM