Share News

పశ్చిమ కమల కిరీటం

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:49 PM

‘‘నరసాపురం ఎంపీగా గెలిచిరా.. నీ సంగతి నేను చూసుకుంటా..’’ అని రాజమహేంద్రవరం ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు పెద్ద హామీనే ఇచ్చారు..ఇప్పుడది నిజం చేశారు. ఏకంగా కేంద్ర మంత్రి పదవే ఇచ్చారు.

పశ్చిమ కమల కిరీటం
భీమవరం పార్టీ కార్యాలయంలో కూటమి అభిమానుల మధ్య కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేస్తున్న వర్మ సతీమణి

భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి

ఆంధ్రప్రదేశ్‌ కోటాలో బీజేపీ తరఫున ఎంపిక

సామాన్య కార్యకర్త నుంచి మంత్రి వరకు

పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడు

కేంద్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

‘‘నరసాపురం ఎంపీగా గెలిచిరా.. నీ సంగతి నేను చూసుకుంటా..’’ అని రాజమహేంద్రవరం ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు పెద్ద హామీనే ఇచ్చారు..ఇప్పుడది నిజం చేశారు. ఏకంగా కేంద్ర మంత్రి పదవే ఇచ్చారు. నరసాపురం ఎంపీగా శ్రీనివాసవర్మ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రధాని మోదీ అన్నట్టుగానే వర్మకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇచ్చారు. పార్టీకి విఽధేయునిగా ఉండడంతో వర్మకు అదృష్టం వరించింది. నరసాపురం లోక్‌సభ టిక్కెట్‌ సాధించినప్పటి నుంచి మంత్రి వరకు అన్నీ ఆయనకు సునాయాసంగానే లభించాయి. తన ప్రయత్నాలన్నీ ఫలించాయి.మూడు దశాబ్దాలకు పైగా వర్మకు భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉంది. భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా అధ్యక్షుడిగా వర్మ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి బీజేపీలో ఉంటూ పార్టీకి వివిధ హోదాల్లో సేవలందించారు. భీమవరం పట్టణ అధ్యక్షుడిగా సేవలందించారు. జిల్లా అధ్యక్షుడిగా పదేళ్లపాటు పార్టీ కోసం కృషి చేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ సీటును వర్మ దక్కించుకున్నారు. భారీ విజయం సాధించారు. కూటమి శ్రేణులంతా వర్మ విజయానికి అలుపెరగని పోరాటం చేశాయి. కేంద్రమంత్రిగా బీజేపీ తరపున వివిధ పేర్లు వినిపించాయి. ముందునుంచి ఢిల్లీలో శ్రీనివాసవర్మ తన ప్రయత్నాలు సాగించారు. కేంద్ర పెద్దలతో సంప్రదింపులు చేశారు. మోదీ అభయం నెరవేరింది. వర్మ ప్రయత్నాలు ఫలించాయి. కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిం చింది. పశ్చిమ గోదావరి జిల్లాకు అది వరం కానుంది. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లన్నింటికీ కేంద్రం నుంచి నిధులు తెచ్చి పూర్తి చేస్తామని ఎన్నికల్లో వర్మ హామీ ఇచ్చారు. మంత్రి వర్గంలో చోటు దక్కడంతో అవన్నీ ఇప్పుడు నెరవేరనున్నాయి.

ఉమ్మడి జిల్లా నుంచి కేంద్ర మంత్రులుగా..

ఉమ్మడి పశ్చిమ జిల్లా నుంచి కేంద్రమంత్రులుగా అతి కొద్దిమందికి మాత్రమే అవకాశం లభించింది. ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికైన బోళ్ల బుల్లిరామయ్య కేంద్రమంత్రిగా వ్యవహరించారు. అలాగే రాజ్యసభకు ఎంపికైన దాసరి నారాయణరావు యూపీఏ ప్రభుత్వంలో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. నరసాపురం నుంచి ఎంపీగా ఎన్నికైన యూవీ కృష్ణంరాజు రక్షణ శాఖ కేంద్ర సహాయ మంత్రిగా జిల్లా నుంచి సేవలందించారు. ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికైన కావూరి సాంబశివరావు జౌలిశాఖ మంత్రిగా వ్యవహరించారు. అలాగే చిరంజీవి సైతం రాజ్యసభకు ఎంపికై కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఇలా అతికొద్ది మందికి మాత్రమే కేంద్ర మంత్రి మండలిలో సేవలందించారు. తాజాగా భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మ కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నారు. జిల్లా నుంచి కేంద్రమంత్రులుగా వ్యవహరించిన వారంతా జిల్లా అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. తాజాగా వర్మకు ఆ అవకాశం లభించింది. భారతీయ జనతా పార్టీకి విధేయునిగా ఉన్న ఆయన రాష్ట్ర అభివృద్ధిలో కీలకమయ్యే అవకాశం ఉంది. కేంద్రమంత్రి వర్గంలో వర్మకు చోటు లభించడంతో జిల్లాలో సంబరాలు చేసుకుంటున్నారు.

భీమవరానికి తొలి కేంద్ర మంత్రి పదవి

(1వ పేజీ తరువాయి) స్వాతంత్య్ర సమరయోధుడు. 1967లో భూపతిరాజు సూర్యనారాయణరాజు, సీత దంపతులకు భీమవరంలో జన్మించారు. హైస్కూల్‌ స్థాయి లోనే విద్యార్థి సమస్యలపై ప్రశ్నించే నాయకత్వ లక్షణాలు వంట పట్టించుకున్నారు. ఇంటర్‌, డిగ్రీలో కూడా విద్యార్థి సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌కు నాయకత్వం వహించారు. పోస్ట్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆయన 1990లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 34 సంవత్సరాల పాటు బీజేపీలో ఆయన చేసిన రాజకీయ సేవలను పార్టీ అధిష్టానం గుర్తించింది.

రాజకీయ ప్రస్థానం ఇలా..

1990 నుంచి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న శ్రీనివాసవర్మ పార్టీలో వివిధ పదవులు చేపట్టారు. 1991 నుంచి 96 వరకు బీజేపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా 1996 నుంచి 99 వరకు జిల్లా కార్యదర్శిగా చేశారు. 1999–2000 మధ్య జిల్లా ఉపాధ్యక్షుడిగా, 2002–05 మధ్యలో పార్టీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడిగా, 2005–07 వరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2007–10 వరకు నర్సాపురం పార్లమెంట్‌ కన్వీనర్‌గా వ్యవహరించారు. 2010–19 వరకు జిల్లా అధ్యక్షుడిగా, 2019–20 మధ్య జోనల్‌ ఇన్‌చార్జీగా పలు పదవులు నిర్వహించారు. 2015–19 మధ్య భీమవరం మున్సిపల్‌ కౌన్సిల్‌ పాలకవర్గంలో కౌన్సిలర్‌గా, ప్యానల్‌ కమిటీ చైర్మన్‌గా పదవి చేపట్టారు. పార్లమెంట్‌ కన్వీనర్‌గా ఉన్న సమయంలో 2009లో పార్లమెంట్‌కు బీజేపీ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2020లో సెప్టెంబరులో రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.

20 ఏళ్ల తరువాత ..

నరసాపురం, జూన్‌ 9 : 20 ఏళ్ల తరువాత నరసాపురం పార్లమెంట్‌ పరిధి నుంచి ఎన్నికైన ఆభ్యర్థికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. రాష్ట్ర విభజన తరువాత ఎంపీగా గెలుపొందిన శ్రీనివాసవర్మకే ఆ ఘనత దక్కింది. మరోవైపు పార్లమెంట్‌ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఇద్దరికి మాత్రమే కేంద్ర మంత్రి వర్గంలో పదవులు దక్కాయి. అందులో తొలి మంత్రి అయిన ఘనత యూవీ కృష్ణంరాజుకు దక్కింది. 1999లో నరసాపురం పార్లమెంట్‌ నుంచి కృష్ణంరాజు బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2000లో ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో ఆహార సహాయ మంత్రి పదవి లభించింది. తరువాత ఏడాదికే రక్షణ సహాయ మంత్రి, మరోసారి విదేశీ వ్యవహారాల సహాయశాఖ మంత్రి పదవులు లభించింది. ఇలా ఐదేళ్లలో మూడు సార్లు మంత్రిగా కొనసాగారు. మళ్లీ 2024లో నరసాపురం నుంచి ఎన్నికైన శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినేట్‌లో బెర్త్‌ దక్కింది.

భీమవరానికి తొలి కేంద్ర మంత్రి పదవి

భీమవరం టౌన్‌, జూన్‌ 9 : నరసాపురం పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్రమంత్రి పదవి దక్కడంతో పార్టీ కేడర్‌ సంబరాల్లో మునిగితేలుతోంది. పార్టీ విధేయుడుగా 34 ఏళ్ల పాటు ఆయన బీజేపీలో గుర్తింపు తెచ్చుకోవడంతో ఆయనను అందరూ బీజేపీ వర్మగా పిలుస్తుంటారు. నరసాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి ఆయన 2 లక్షల 70 వేల మెజార్టీతో విజయపతాకం ఎగుర వెయ్యడంతో అధిష్ఠానంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇంతవరకు భీమవరానికి చెందిన వారు చాలామంది పార్లమెంట్‌ సభ్యులుగా ఎన్నికైనప్పటీకీ ఎవరూ కేంద్ర మంత్రి పదవి దక్కించుకోలేకపోయారు. తొలిసారి 1999లో యూవీ కృష్ణంరాజుకు కేంద్ర మంత్రి పదవి లభించింది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గోకరాజు గంగరాజు ఎన్నికైనా ఆయనకు మంత్రి పదవి వరించలేదు.

విద్యార్థి స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు

సామాన్య ఎగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రీనివాసవర్మకు కేంద్రమంత్రి పదవి వరిం చడం వెనుక బీజేపీలో చేపట్టిన ఎన్నో బాధ్యతలు, ప్రతిపక్ష పార్టీగా చేసిన పోరాటాలు, పార్టీ పురోగతి కోసం చేసిన కృషి, శ్రమ దాగి ఉంది. వీరి తాత గారు భూపతిరాజు స్వాతంత్య్ర సమరయోధుడు. 1967లో భూపతిరాజు సూర్యనారాయణరాజు, సీత దంపతులకు భీమవరంలో జన్మించారు. హైస్కూల్‌ స్థాయిలోనే విద్యార్థి సమస్యలపై ప్రశ్నించే నాయకత్వ లక్షణాలు వంట పట్టించుకున్నారు. ఇంటర్‌, డిగ్రీలో కూడా విద్యార్థి సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌కు నాయకత్వం వహించారు. పోస్ట్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆయన 1990లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 34 సంవత్సరాల పాటు బీజేపీలో ఆయన చేసిన రాజకీయ సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తించింది.

రాజకీయ ప్రస్థానం ఇలా..

1990 నుంచి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న శ్రీనివాసవర్మ పార్టీలో వివిధ పదవులు చేపట్టారు. 1991 నుంచి 96 వరకు బీజేపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా 1996 నుంచి 99 వరకు జిల్లా కార్యదర్శిగా చేశారు. 1999–2000 మధ్య జిల్లా ఉపాధ్యక్షుడిగా, 2002–05 మధ్యలో పార్టీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడిగా, 2005–07 వరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2007–10 వరకు నర్సాపురం పార్లమెంట్‌ కన్వీనర్‌గా వ్యవహరిం చారు. 2010–19 వరకు జిల్లా అధ్యక్షుడిగా, 2019–20 మధ్య జోనల్‌ ఇన్‌చార్జీగా పలు పదవులు నిర్వహించారు. 2015–19 మధ్య భీమవరం మున్సిపల్‌ కౌన్సిల్‌ పాలక వర్గంలో కౌన్సిలర్‌గా, ప్యానల్‌ కమిటీ చైర్మన్‌గా పదవి చేపట్టారు. పార్లమెంట్‌ కన్వీనర్‌గా ఉన్న సమయంలో 2009లో పార్లమెంట్‌కు బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2020లో సెప్టెంబరులో రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.

Updated Date - Jun 09 , 2024 | 11:49 PM