Share News

రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురి మృతి

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:28 AM

ఆచంట–మార్టేరు ఆర్‌అండ్‌బీ రహదారిలో ఆచంట కొఠాలపర్రు వంతెన వద్ద ఎదురెదురుగా మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమా దంలో ముగ్గురు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురి మృతి

మరో యువకుడికి తీవ్ర గాయాలు.. పాలకొల్లు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స

ఆచంట, మార్చి 8 : ఆచంట–మార్టేరు ఆర్‌అండ్‌బీ రహదారిలో ఆచంట కొఠాలపర్రు వంతెన వద్ద ఎదురెదురుగా మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమా దంలో ముగ్గురు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆచంట ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తెలిపిన వివరాలివి.. ఆచంట పంచాయతీ పరిధి గొల్లపల్లివారిచెరువుకు చెందిన రొక్కాల అభిరామ్‌ (22) ఆచంట పెదపేటకు చెందిన చదలవాడ ఆనంద్‌(22) ఇరువురూ స్నేహితులు. వీరు తూర్పుపాలెం నుంచి మోటారుసైకిల్‌పై ఆచంట వస్తున్నారు. అదేవిధంగా పోడూరు మండలం పండితవిల్లూరు పంచాయతీ పరిధిలో లక్ష్మీచెరువు గట్టుకు చెందిన చుక్కా దుర్గారావు (29), పితాని సాయి ఇరువురు స్నేహితులు సరదాగా ఆచంటలో జరుగుతున్న రామేశ్వరస్వామి శివరాత్రి తిరునాళ్ళు వీక్షించి గురువారం అర్ధరాత్రి ఆచంట నుంచి మోటారు సైకిల్‌పై పండితవిల్లూరు వెళుతుండగా మార్టేరు–ఆచంట కొఠాలపర్రు వంతెన వద్ద ఈ రెండు బైక్‌లు ఢీ కొన్నాయి. అభిరామ్‌, ఆనంద్‌ ఘటన స్థలంలోనే మృతి చెందగా మిగిలిన ఇద్దరిని 108 వాహనంలో ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో దుర్గారావు మృతి చెందినట్టు తెలిపారు. తీవ్ర గాయాలైన పితాని సాయి పాలకొల్లు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆచంట మండలంలో విషాదఛాయలు..

ఈ ప్రమాదంలో మృతి చెందిన రొక్కాల అభిరామ్‌, చదలవాడ ఆనంద్‌ ఇద్దరు యువకులు పనులు చేసుకుంటున్నారు. అభిరామ్‌, ఆనంద్‌ తల్లులు ఉపాధి నిమిత్తం ఇటీవల గల్ఫ్‌ దేశానికి వెళ్లారు. మరొకరు చుక్కా దుర్గారావు కు నాలుగేళ్ల క్రితం వివాహం కాగా మూడేళ్ల కుమార్తె ఉంది. శివరాత్రి పండుగ రోజున ఆచంటలో విషాధఛాయలు అలుముకున్నాయి. మృత దేహాలను పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ రాజ్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 09 , 2024 | 12:28 AM