బెట్టింగ్ భూతం !
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:43 PM
ఐపీఎల్ మ్యాచ్‌లు వచ్చాక చాలామంది బెట్టింగుల మాయలో మునిగిపోతున్నారు. ఎంతో మంది క్రికెట్ బెట్టింగుల వల్ల అప్పులు పాలవుతున్నారు. వాటిని తీర్చే మార్గం లేక, బుకీల వేధింపులు భరించలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు.

ఐపీఎల్ బెట్టింగ్‌ల జోరు
అప్పుల్లో కూరుకుపోతున్న కుటుంబాలు
తీర్చలేక ఆత్మహత్యలు
నాడు బుకీలు.. నేడు ఆన్‌లైన్ యాప్‌లు
ఏలూరు చొదిమెళ్ళకు చెందిన భానుసుందర్ ఫిలిప్పైన్స్‌లో ఎంబీబీఎస్ చదివాడు. ఫోన్‌లో క్రికెట్ బెట్టింగు యాప్‌లలో బెట్టింగ్‌లు ఆడి లక్షల్లో పోగొట్టుకున్నాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక అప్పులు ఇచ్చిన వారికి వైద్యం పేరుతో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అనారోగ్యం పాలు చేయడం, హతమార్చడానికి కూడా వెనుకాడలేదు. రెండు రోజుల క్రితం ఏలూరు పోలీసులు ఆ డాక్టర్‌ను అరెస్టు చేశారు.
గతంలో భీమవరం మండలానికి చెందిన ఒక యువకుడు క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లోవారు ఎంత చెప్పినా వినకుండా బెట్టింగ్‌లకు కాయడంతో అప్పుల పాలయ్యాడు. చివరకు ఉన్న ఆస్తిని అమ్మినా కూడా అప్పులు తీరలేదు. ఆ కుటుంబం రోడ్డున పడింది.
భీమవరం శివారు ప్రాంతానికి చెందిన ఒక యువకుడు రొయ్యల చెరువులు చేస్తూ బాగా సంపాదించాడు. అయితే కొంతకాలానికి క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. చెరువుల్లో రొయ్యలు ఉన్నా సరే వాటిని పట్టించుకోకుండా రాత్రీ, పగలు బెట్టింగ్‌ల్లో మునిగి తేలాడు. చివరకు సంపాదించినదంతా అప్పులకు సరిపోలేదు. ఇలా బెట్టింగ్‌ల భూతానికి ఎంతోమంది బలవుతున్నారు..
ఏలూరు క్రైం/భీమవరం క్రైం, ఏప్రిల్ 3: క్రికెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ టీవీలో క్రికెట్ వస్తుంటే చూడకుండా ఉండలేరు. ఇష్టం ఉంటే ఫర్వాలేదు..కానీ అది బెట్టింగుల వైపు మళ్లిందంటే జీవితాలే సర్వనాశనం అయిపోతాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు వచ్చాక చాలామంది బెట్టింగుల మాయలో మునిగిపోతున్నారు. ఎంతో మంది క్రికెట్ బెట్టింగుల వల్ల అప్పులు పాలవుతున్నారు. వాటిని తీర్చే మార్గం లేక, బుకీల వేధింపులు భరించలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు.
ఐపీఎల్ అంటే
ఇండియన్ ప్రిమియర్ లీగ్ 17 సంవత్సరాల క్రితం భారత దేశంలో ప్రారంభించారు. అప్పటి వరకూ ఉన్న క్రికెట్ విధానం వేరు. ఐపీఎల్ ఆట విధానం వేరు. భారత దేశంలో 12 టీమ్‌లు, 20 ఓవర్స్ చొప్పున ఆటను ఆడతాయి. దీనినే 20–20 అని అంటారు. 17వ సారి భారత దేశంలో ప్రస్తుతం 12 టీమ్‌లతో 74 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. శనివారం, ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఒక మ్యాచ్, రాత్రి 7.30కి మరో మ్యాచ్ జరుగుతాయి. మిగిలిన రోజుల్లో రోజుకు ఒక మ్యాచ్ చొప్పన క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి.
రకరకాలుగా బెట్టింగ్‌లు
ఐపీఎల్‌లో మొదటి ఆరు ఓవర్లకు ఎన్ని రన్స్ తీస్తారో దీనిని మొదటి ఫ్యాన్సీ అంటారు. దీనిపైన పందాలు కడతారు. ఇక రెండవ ఫ్యాన్సీ 7,8,9,10 ఓవర్లపై పందాలు నిర్వహిస్తారు. మూడో ఫ్యాన్సీగా 11వ ఓవర్ నుంచి 15 ఓవర్ వరకూ ఎన్ని రన్స్ తీస్తారు లేదా ఎన్ని వికెట్లు తీస్తారు అనే దానిపై మూడో ఫ్యాన్సీగా రెట్టింపు పందేలు కాస్తారు. నాల్గో ఫ్యాన్సీగా 16 నుంచి 20 ఓవర్ల మధ్యలో ఎన్ని వికెట్లు, ఎన్ని ఓవర్లు లేదా ఏ బ్యాట్స్‌మెన్ ఔట్ అయిపోతాడో రెట్టింపు పందాలు కాస్తారు. ఏ టీమ్ గెలుస్తుందో కూడా తాడోపేడో తేల్చేలా పందాలు కాస్తారు.
యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు
గతంలో క్రికెట్ బుకీలు పందాలు కాస్తూ ఉండేవారు. వారు ఒక హోటల్‌లోనో, లాడ్జీ రూమ్‌ల్లోనూ, ఒక ఇంట్లోనో టీవీ పెట్టుకుని, మొబైల్స్ పెట్టుకుని పందాలు నిర్వహించేవారు. నేడు ఆన్‌లైన్‌లో వివిధ యాప్‌లు రావడంతో వంద రూపాయల నుంచి కోట్లాది రూపాయల వరకూ యాప్‌ల్లో జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో వేలు, లక్షల రూపాయల్లో మాత్రమే పందాలు సాగుతున్నాయి. కొన్ని యాప్‌లలో మినిమం వంద రూపాయల నుంచి ప్రారంభం కాగా, కొన్ని యాప్‌లలో వెయ్యి రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా బాక్స్ బెట్టింగులు ఎక్కువగా జరుగుతున్నాయి. క్రికెట్ బుక్కీల పరిభాషలో బాక్స్ అంటే లక్ష రూపాయలు పందెం అని అర్థం. ఇక ఎన్ని బాక్స్‌లు అంటే అన్ని లక్షలు పందెంలో పెడుతున్నట్టు. బుకీలు 20 శాతం సొమ్ములను తీసుకుని మిగిలిన సొమ్ము ఇస్తారు. పందాలు కాసేవారు పాత వారు అయితే అప్పుల్లో కూడా పందాలు కడుతూనే ఉంటారు. అప్పులు తీర్చకపోతే నేరుగా రికవరీ బృందం దిగిపోతుంది. ఇళ్ళకు బంధువులు, స్నేహితుల రూపంలో వచ్చి ఇంట్లో తలుపులు వేసి పంచాయతీ పెడతారు. క్షణాల్లో వారి నుంచి చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఆస్తులకు సంబంధించిన డాక్యు మెంట్లను స్వాఽధీనం చేసుకుని వెళ్ళిపోతారు. లేదా ప్రాణాలు తీస్తామంటూ బెదిరిస్తారు.బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడు తున్నారు.
తల్లిదండ్రులే దృష్టి పెట్టాలి
జిల్లాలో పేద వాడి నుంచి ధనికుడి వరకూ చిన్న ఉద్యోగుల నుంచి కొంత మంది పెద్ద ఉద్యోగులు కూడా ఈ బెట్టింగ్‌ల బారినపడ్డట్లుగా తెలుస్తోంది. నేరుగా వారి మొబైల్స్‌లోని ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే క్రికెట్ బెట్టింగు యాప్‌లను డౌన్‌లోడు చేసుకుని బెట్టింగుల్లో కూరుకు పోతున్నారు.తల్లి దండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఎక్కువ శాతం మంది యువతే ఈ బెట్టింగులకు పాల్పడు తున్నట్లు తెలుస్తున్నది. తెలిసీ తెలియని వయస్సుల్లో క్రికెట్ పట్ల ఆకర్షణకు గురై ఆపై క్రీడాకారులపై అభిమానాన్ని పెంచుకుని బెట్టింగులకు పాల్పడు తున్నారు. ఇలాంటి వారిని ప్రాథమిక దశలోనే గుర్తించి తల్లిదండ్రులే కౌన్సెలింగ్ ఇవ్వాలి.