Share News

బీఎడ్‌లకు 204.. డీఎడ్‌లకు 102

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:24 AM

మెగా డీఎస్సీ స్థానే కేవలం 306 పోస్టులతో దగా డీఎస్సీ నోటిఫికేషన్‌. తీరా చూస్తే ఇప్పుడు డీఎస్సీ దరఖాస్తుదారుల ఆశలు మరోసారి గల్లంతు.

బీఎడ్‌లకు 204.. డీఎడ్‌లకు 102

ఇక ఎవరి పోస్టులు వారికే !

బీఎడ్‌ అభ్యర్థులకు రెట్టింపు పోటీ

ఎస్జీటీ ఉద్యోగార్హుల్లో ఉత్సాహం

అమలు సాధ్యం కాని ప్రకటనలతో ఆశలను వమ్ము చేశారంటూ స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థుల నిరుత్సాహం

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 7 : మెగా డీఎస్సీ స్థానే కేవలం 306 పోస్టులతో దగా డీఎస్సీ నోటిఫికేషన్‌. తీరా చూస్తే ఇప్పుడు డీఎస్సీ దరఖాస్తుదారుల ఆశలు మరోసారి గల్లంతు. తొలుత నోటిఫికేషన్‌లో సెకండరీగ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులు అర్హులేనన డంతో ఉమ్మడి జిల్లాలో వేలాదిమంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు గంపెడాశలతో దరఖాస్తు చేసుకోగా ఇప్పుడు ఎస్జీటీ పోస్టులకు కేవలం డీఎడ్‌/డీఎల్‌ఎడ్‌ విద్యార్హతలుగల అభ్యర్థులే అర్హులంటూ ప్రభుత్వం స్పష్టంచేయడంతో నిరుత్సాహం నెలకొంది. వాస్తవానికి ఎస్జీటీ పోస్టులు డీఎడ్‌/డీఎల్‌ఎడ్‌ అభ్యర్థులకు మాత్రమే పరిమితమంటూ జాతీయ ఉపాద్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, వాటిని అనుసరించ కుండా రాష్ట్రప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగ నియామకాలపై బిల్డప్‌ కోసమే అమలు సాధ్యం కాదని తెలిసిమరీ ఎస్జీటీ ఉద్యోగాలకు బీఎడ్‌ అభ్యర్థులూ అర్హులేనంటూ ప్రచార ఆర్బాటం చేసిందంటూ దరఖాస్తుదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ మేరకు గురువారం జారీచేసిన మార్గదర్శకాల్లో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌/డీఎల్‌ఎడ్‌ అభ్యర్థులే అర్హులని స్పష్టతనివ్వడంతో ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ేసుకున్న బీఎడ్‌ అభ్యర్థుల్లో నిరుత్సాహం నెలకొంది.

ఇక బీఎడ్‌ అభ్యర్థులకు 204 పోస్టులే..

డీఎస్సీ–2024 రిక్రూట్‌మెంట్‌లో ఉమ్మడి జిల్లాలో మొత్తం 306 ఉపాధ్యాయ ఉద్యోగాలను నోటిఫై చేసిన విషయం విదితమే. వీటిలో ఎస్జీటీ కేడర్‌ 102 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్‌/టీజీటీ కేడర్‌ పోస్టులు 204 ఉన్నాయి. నోటిఫై చేసిన ఎస్జీటీ ఉద్యోగాల్లో 88 పోస్టులు జిల్లాలోని వివిధ మున్సిపాల్టీల్లోను, మిగతా 14 గిరిజన పాఠశాలల్లోను భర్తీ చేయడానికి ఉద్దేశించారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీఎడ్‌ విద్యార్హతలతో కేవలం ఎస్జీటీ కేడర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డీఎస్సీ దరఖాస్తు నిమిత్తం చెల్లించిన రుసుంను వారి బ్యాంకు ఖాతాలకు జమచేస్తారని తెలిసింది. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు రెండింటికీ దరఖాస్తు చేసుకున్న బీఎడ్‌ అభ్యర్థులు స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ నియామకపోటీకి కొనసాగవచ్చని విద్యాశాఖ కార్యాలయ వర్గాలు వివరించాయి. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌/డీఎల్‌ఎడ్‌ అభ్యర్థులను మాత్రమే అర్హులుగా చేయడంతో ఈ విభాగంలో ఉద్యోగార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని, ఆ మేరకు పోటీ కూడా పరిమితంగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే బీఎడ్‌ అభ్యర్థులకు ప్రత్యేకించిన 204 స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ పోస్టులకు జిల్లాలో విపరీతమైన పోటీ తప్పదని భావిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కేడర్‌ వారీగా డీఎస్సీ–2024కి అందిన దరఖాస్తుల సంఖ్య అధికారికంగా ఇంకా వెల్లడికాలేదు. మరోవైపు డీఎస్సీ పరీక్షల తేదీలను రీషెడ్యూల్‌ చేయాలంటూ హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోవడంపై అభ్యర్థుల్లో డైలమా నెలకొంది.

Updated Date - Mar 08 , 2024 | 12:24 AM