Share News

దోమల నిర్మూలనతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:10 AM

ఆరోగ్యాన్ని దెబ్బతీసే దోమల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పెదవేగి పీహెచ్‌సీ వైద్యాధికారి మల్లికార్జున్‌ అన్నారు.

దోమల నిర్మూలనతో సంపూర్ణ ఆరోగ్యం
భీమడోలు మండలం గుండుగొలను పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ర్యాలీ

గ్రామాల్లో మలేరియా నిర్మూలనపై అవగాహన ర్యాలీ

పెదవేగి, జూన్‌ 11: ఆరోగ్యాన్ని దెబ్బతీసే దోమల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పెదవేగి పీహెచ్‌సీ వైద్యాధికారి మల్లికార్జున్‌ అన్నారు. దోమలను నిర్మూలిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఆయ న చెప్పారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవం, ఆశా డేను పురస్కరించు కుని మంగళవారం దోమల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్‌ మల్లికార్జున్‌ మాట్లాడుతూ వర్షాకాలం జ్వరాలు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యు ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు. సహాయ మలేరి యా అధికారి జే.గోవిందరావు మాట్లాడుతూ ప్రాణాంతక డెంగ్యూ, చికన్‌ గున్యా, మెదడువాపును వ్యాప్తి చేసే దోమలను నిర్మూలించాలన్నారు. నీటి నిల్వ ఉన్న ప్రాంతాలు, డ్రమ్ములు, ప్లాస్టిక్‌ గ్లాసులు, నిరుపయోగంగా ఉండే టైర్లు వంటివాటిలో నీరు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వారానికోసారి పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్‌ పూర్ణిమ, డాక్టర్‌ మాధవి, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ మంగమ్మ, హెల్త్‌ సూపర్‌వైజర్లు రమేష్‌, యామిని, సుజాత, హెల్త్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరావు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

భీమడోలు: గుండుగొలను పీహెచ్‌సీ ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా మలేరియాపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. వైద్యురాలు శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో వైద్యసేవల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దోమలతో డెంగీ, మలేరియా వస్తాయని, ఇంటి పరిసరాల్లోని నీటి నిల్వ ప్రాంతాల్లో దోమలు పెరుగుతాయన్నారు. చలి జ్వరం, వణుకు, చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటే చికిత్స చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌వీ మల్లేశ్వరి, ఎంపీహెచ్‌ఎస్‌ రామకృష్ణ, నవీన్‌, హెల్త్‌ అసిస్టెంట్లు మురళీ, ఎఎన్‌ఎంలు, ఆశలు పాల్గొన్నారు.

లింగపాలెం: మలేరియా నిర్మూలన అందరి బాధ్యతని, మలేరియా నిర్మూలనకు ప్రజలు సహకరించాలని కె.గోకవరం పీహెచ్‌సీ వైద్యాధికారి ఆర్‌.కృష్ణకిషోర్‌ అన్నారు. కె.గోకవరం పీహెచ్‌సీలో మలేరియా నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమలు కుట్టడం ద్వారా వచ్చే వ్యాధులపై డాక్టర్‌ కృష్ణకిషోర్‌ అవగాహన కల్పించారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు దోమల వలన వ్యాప్తి చెందే వ్యాధులపై అవగాహన కల్పించాలని, ఇళ్లలో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకునేలా చూడాలని వారికి తెలిపారు. యూనిట్‌ అధికారి ఎన్‌ఏ.ప్రసాద్‌, ఆరోగ్య విస్త రణాధికారి ఎస్‌కే.అబ్రార్‌ హుస్సేన్‌, ఆరోగ్య పర్యవేక్షకులు ఉమా మహేశ్వర రావు, రాణి, శేఖర్‌, విష్ణుమూర్తి, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:10 AM