రోడ్డు ప్రమాద అనర్థాలపై అవగాహన
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:10 AM
వాహనదారులు గమ్యానికి చేరడంలో పది నిమిషాలు లేటైనా పర్వాలేదు కానీ... ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే ఆ కుటుంబానికి ఎనలేని నష్టం వాటిల్లుతుందని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ అన్నారు.

వాహనదారులకు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కౌన్సెలింగ్
ద్వారకాతిరుమల, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): వాహనదారులు గమ్యానికి చేరడంలో పది నిమిషాలు లేటైనా పర్వాలేదు కానీ... ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే ఆ కుటుంబానికి ఎనలేని నష్టం వాటిల్లుతుందని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ అన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు ఎస్పీ ఓ విన్నూత్న కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో మండలంలోని ఎం నాగులపల్లి అడ్డరోడ్డు వద్ద గతంలో ప్రమాదానికి గురైన బైక్‌ను చూపుతూ రోడ్డుప్రమాదం వల్ల జరిగే అనర్థాలపై ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించారు. అలాగే హెల్మెట్ వాడకం వల్ల వాహనదారులకు జరిగే లాభాలను వివరించారు. ఇదే సమయంలో ద్విచక్ర వాహనంపై కుటుంబంతో హెల్మెట్ లేకుండా వెళ్తున్న వ్యక్తిని ఆపి అతనికి అతని భార్యకు ఎస్పీ చేతుల మీదుగా హెల్మెట్‌ను అందచేసి కౌన్సెలింగ్ ఇచ్చారు.