Share News

మనదే అధికారం

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:14 AM

రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధపడుతుందా ? ఏదైనా కీలక ప్రకటన చేయబోతారా ? అని ఎదురుచూసిన కేడర్‌కు బీజేపీ అగ్రనేత, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నిరాశనే మిగిల్చారు.

మనదే అధికారం
సమావేశంలో రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు పురందేశ్వరి, తపనా చౌదరి, అంబికా కృష్ణ, కామినేని, వర్మ తదితర నేతలు

బీజేపీ శ్రేణులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దిశా నిర్దేశం

వారి చేతకానితనం వల్లే పోలవరం పూర్తికాలేదు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధపడుతుందా ? ఏదైనా కీలక ప్రకటన చేయబోతారా ? అని ఎదురుచూసిన కేడర్‌కు బీజేపీ అగ్రనేత, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నిరాశనే మిగిల్చారు. గోదావరి క్లస్టర్‌ పరిధిలో బూత్‌ కమిటీ సభ్యులకు మంగళవారం ఏలూరులో రక్షణ మంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రత్యేకించి అధికార వైసీపీని దుయ్యబడుతూనే, కేంద్రంలో అత్యధిక స్థానాలతో ఎన్‌డీఏ ప్రభుత్వం రాబోతోందని కార్యకర్తల్లో జోష్‌ పెంచారు. అధికార వైసీపీని ఎడాపెడా కడిగేశారు. పేదలకు గుక్కెడు నీళ్లిచ్చే పథకమైన జలజీవన్‌ కింద రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించడానికి దిక్కు మొక్కు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో అవినీతిమయమే కాకుండా, ఒక విజన్‌ లేని ప్రభుత్వం ఉందని తూర్పారబట్టారు. గంటన్నరకు పైగా సాగిన బూత్‌ కమిటీ సభ్యుల సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒక వైపు, బీజేపీయేతర పక్షాల అపజయాలను ఏకరవు పెడుతూనే ఇంకోవైపు బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను సవివరంగా వివరించారు. ‘‘రామ మందిర నిర్మాణం ఎప్పటిలోపు పూర్తి చేస్తారు ? సంవత్సరాలు, తేదీలు వున్నాయా ? లేదా ? అని కొందరు అనుమానం లేవనెత్తారు. కానీ అయోధ్యలో బాల రాముడిని ప్రతిష్ఠించాం. అనుకున్నది అనుకున్నట్లు క్రతువును పూర్తి చేశాం’’ అని రాజ్‌నాథ్‌ ప్రకటించినపుడు సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మిన్నంటింది. వేదికపై వున్నబీజేపీ నేతలు జైశ్రీరామ్‌ అంటూ నినదించారు. కార్యకర్తల్లో కనిపించిన జోష్‌ను చూసి బీజేపీ ప్రభుత్వం ఏదైతే చెబుతుందో అదే చేస్తుందన్నారు. రాబోయేది ఏపీలో వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఇక్కడి నుంచి ఎంపీలు ఈసారి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తారని సంకేతాలిచ్చారు. ప్రతి కార్యకర్తకు ఒక లక్ష్యం వుండాలి. దీనికి సరిపడా శ్రమించాలి. బీజేపీ ప్రజల నుంచే నాయకులను తయారు చేస్తుంది. కాని, కొన్ని పార్టీలు మాత్రం కుటుంబాలను గురించి ఆలోచిస్తాయి. ప్రధాని మోడీ వల్ల నవభారత్‌ ఏర్పడింది’’ అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పోలవరానికి 50 వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకువస్తే చేతకాని ప్రభుత్వాలు పూర్తి చేయలేకపోయాయని రాజ్‌నాథ్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం వస్తుందో అప్కుడే పోలవరం ప్రాజక్టు పూర్తవుతుందన్నారు. పేదలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు, సొంత ఇళ్లు వంటి పథకాలు అందుబాటులోకి తెచ్చింది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. స్వయం వికసిత భారత్‌ రావాలనే అందరి ఆకాంక్ష అని, ఇది సాధ్యం కావాలంటే బీజేపీ రాష్ట్ర, కేంద్రాల్లో అధికారంలో ఉండాలన్నారు.

డబులింజన్‌ ప్రభుత్వం రావాలి : తపనా చౌదరి

రాష్ట్రంలో డబులింజన్‌ ప్రభుత్వం రావాల్సిందేనని పోలవరం నిర్మాణం సాధ్యం కావాలన్నా, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగాలన్నా ఇదొకటే ఏకైక మార్గమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. ఒకప్పుడు రక్షణ విభాగం ఏకే 47 ఆయుధాలను కొనుగోలు చేసేదని, బీజేపీ పాలనలో ఏకే–203 ఆయుధాలను ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం తయారు చేస్తోందని, ఇది ఘనత కాదా అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి అందరూ అందుకోవచ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అందరూ అండగా ఉండాలన్నారు. అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు. సీనియర్‌ నేత పాకా సత్యనారాయణ మాట్లాడుతూ అందరూ అన్నింటికీ సిద్దం అంటున్నారని బీజేపీ మాత్రం సేవకే సిద్ధమని ప్రకటించారు. సమావేశంలో రాష్ట్ర సంఘటన్‌ మంత్రి మధుకర్‌జి, రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందే శ్వరి, జిల్లా అధ్యక్షుడు విక్రం కిశోర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణప్రసాద్‌, అంబికా కృష్ణ, మహిళా మోర్చ అద్యక్షురాలు నిర్మలా కిశోర్‌, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ, సుభాష్‌ రాజు, ఈతకోట తాతాజీ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 01:14 AM