Share News

అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంలో సీఎం మొండి వైఖరి

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:50 PM

అంగన్వాడీల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. సమస్యల పరిష్కారంలో సీఎం మొండి వైఖరి విడనాడాలని నినాదాలు చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో అంగన్వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.

అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంలో సీఎం మొండి వైఖరి
ద్వారకా తిరుమల తొలి మెట్టు వద్ద మొక్కుతున్న అంగన్వాడీలు

సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

అంగన్వాడీల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. సమస్యల పరిష్కారంలో సీఎం మొండి వైఖరి విడనాడాలని నినాదాలు చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో అంగన్వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. కుక్కునూరులో అంగన్వాడీలు పొర్లు దండాలు పెట్టారు. ద్వారకా తిరుమలలో శ్రీవారి ఆలయ తొలిమెట్టు వద్ద కొబ్బరి కాయలు కొట్టి ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించాలని స్వామి వారిని వేడుకున్నారు.

ఏలూరు కలెక్టరేట్‌, జనవరి 1: అంగన్‌వాడీ, మున్సిపల్‌, సమగ్రశిక్ష ఉద్యోగు ల సమ్మెపై సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని కోరుతూ సోమవారం నగరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వ హించారు. పాత బస్టాండ్‌ నుంచి ప్రారంభమైన ప్రదర్శన నగర వీధుల గుండా సాగి కలెక్టరేట్‌ వద్దకు చేరుకుంది. జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ.ప్రసాద్‌ మాట్లాడుతూ జనవరి 1న మహిళలు, ఉద్యోగులను రోడ్డుమీదకు తెచ్చిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలు 21 రోజులుగా సమ్మె చేస్తున్నా జగన్‌ప్రభుత్వం దున్నపోతుమీద వర్షంపడినట్లుగా నటిస్తోందని మండిపడ్డారు.

అంగన్‌వాడీల సమ్మెకు మాజీ ఎంపీ మాగంటి బాబు మద్దతు తెలిపారు. 21 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలను అభినందించారు. జగన్‌ ప్రభు త్వం తక్షణం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులు ముత్తారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, శ్రీరామ్మూర్తి, అంగన్‌వాడీ నాయకులు జయలక్ష్మి, భవాని తదితరులు పాల్గొన్నారు.

కుక్కునూరు: సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీలు పొర్లు దండాలతో నిరసన వ్యక్తం చేశారు. 21 రోజులుగా సమ్మె చేస్తున్నా సీఎం జగన్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదని సీఐటీయు మండల అధ్యక్షులు కుంజా నాగ లక్ష్మి ఆరోపించారు. అంగన్‌వాడీలను క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలకు దూరం చేసిన జగన్‌ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చ రించారు. సమస్యలు పరిష్కరించకుండా అరెస్టుల, నిర్బంధాలు ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్యదర్శి రాయి రమణ, బాడిస సుజాత, విజయ, సౌజన్య, మంగ, వరలక్ష్మి, కణితి మంగ తదితరులు పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల: తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, ఈ ప్రజా ప్రతినిధుల కళ్లు తెరిపించి తమకు న్యాయం చేసేలా చూడు స్వామీ... అంటూ అంగన్వాడీలు సోమవారం ద్వారకాతిరుమల చిన వెంకన్నను మొక్కుకున్నారు. ర్యాలీగా ఆలయ పాదుకా మండపం వద్దకు చేరు కుని తొలిమెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఏడుకొండల వాడా.. వెంకట రమణా.. గోవిందా.. ప్రభుత్వానికి సద్భుద్ది ప్రసాదించాలంటూ నినదించారు.

చింతలపూడి: అంగన్‌వాడీల సమ్మె 21వ రోజుకు చేరగా మునిసిపల్‌ కార్మికుల సమ్మె ఏడవ రోజుకు చేరింది. ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌వీఎస్‌.నారాయణ అన్నారు. జనవరి 1న కూడా కార్యకర్తలు సమ్మె శిబిరాల్లో పాల్గొని నిరసన తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ కార్మికులను బెదిరిస్తున్నారని, సమ్మె విరమించ కుంటే కార్మికులను మార్చాల్సి వస్తుందని ప్రకటించడం అమానుషమన్నారు. కార్మికులు తలచుకుంటే ప్రభుత్వాన్నే మార్చే సత్తా ఉందని గ్రహించాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్‌ 31న జరిపిన ఆటల పోటీల్లో విజేతలైన కార్యకర్తలకు సోమవారం బహుమతులు అందజేశారు. కార్యక్రమాల్లో ప్రాజెక్టు కార్యదర్శి టి.మాణిక్యం, జి.సరళ, హేమలత, పద్మ, చెన్నకేశరి, అరుణ, జి.నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

పోలవరం: అంగన్వాడీల సమ్మె శిబిరం వద్ద ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సభ్యులు శిబిరం వద్ద గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో అంగన్వాడీలు పద్మ, సరస్వతి, హైమవతి, కుబ్ర, జుబేద, వెంకటరమణ, సత్యవతి, విజయ తదితరులు పాల్గొన్నారు.

కామవరపుకోట: జగన్‌ పాదయాత్రలో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ చేపట్టిన సమ్మె 21వ రోజుకు చేరు కుంది. నూతన సంవత్సరం మొదటి రోజు నిరసన ప్రదర్శన జరిపి అనంతరం మండల పరిషత్‌ కార్యాలయం వద్దకు చేరుకుని దీక్ష నిర్వహించారు. సీఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యాఖ్యానించారు. సీఎం డౌన్‌డౌన్‌ అంటూ హోరెత్తంచారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు సుభాషిణి, విజయ, శాంతి తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్క రించే వరకు సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు.

Updated Date - Jan 01 , 2024 | 11:50 PM