వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:12 AM
రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పీవీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ
ఏలూరు టూ టౌన్, జూన్ 16 : రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పీవీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. రైతు కూలి సంఘం రాష్ట్ర మహాసభలు ఆదివారం టొబాకో మర్చంట్ అసోసియేషన్ హాలులో రెండో రోజు కొనసాగించారు. వ్యవసాయ రంగ సంక్షోభం, పాలకుల విధనాలు, మన కర్తవ్యాలు అంశంపై వక్తలు మాట్లాడా రు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పితేనే వలసలు అరికట్టడం సాధ్యమవుతుందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంయుక్త కిసాన్ మోర్చ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలే మార్గమని అన్నారు. పదేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం, కార్పొరేట్లకు రూ.25 లక్షల కోట్ల రుణాలు రద్దు చేసిందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కూడా చెల్లించకుండా లక్షల కోట్ల నష్టానికి గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 19 కోట్ల రైతు కుటుంబాలకు కుటీర పరిశ్రమలకు ఇచ్చిన రుణాల కన్నా కేవలర 20 కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలే ఎక్కువన్నారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బ్యాంకులకు కార్పొరేట్ సంస్థలు కట్టాల్సిన రూ.28 లక్షల కోట్లు వసూలు చేశారా అని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులు ప్రభుత్వం సహకరించక ప్రైవేటు వడ్డి మూడు రూపాయలకు తీసుకొచ్చి రుణాల్లో కూరుకుపోతున్నారని అన్నారు. ప్రభుత్వం పంటల బీమా కంటే ఇన్సూరెన్స్ కంపెనీలకే ఎక్కువ మేలు చేస్తున్నాయని అన్నారు. పీడీఎస్‌ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో లక్షలాదిగా ఉన్న ఉద్యోగాలను ఉద్దేశపూర్వ కంగా భర్తీ చేయడం లేదన్నారు. రైతాంగ సమితి నాయకులు డాక్టర్ రాజమోహన్ భారత రాజ్యాంగ ఉద్యమం కనీస మద్దతు ధర అంశం పై వివరించారు. ఢిల్లీలో రైతుల సమస్యల పరిష్కారం కోసం నెలల తరబడి ఉద్యమాలు చేసి వందలాది మంది ప్రాణాలర్పించారని అన్నారు. దీని ఫలితంగా మోడీ ప్రభుత్వం మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయక తప్పలేదన్నారు. ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాల్, కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.కేశవరావు, రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ నాగరాజు పాల్గొన్నారు.