Share News

పోలీసులపై ఏసీబీ వల

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:18 AM

నరసాపురం పోలీస్‌ స్టేషన్‌పై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేసి ఎస్‌ఐ బీఎస్‌డీఆర్‌ ప్రసాద్‌, రైటర్‌ నాగేశ్వరరావును వలపన్ని పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ.25 వేలు లంచం తీసు కున్న జీపు డ్రైవర్‌ ప్రసాద్‌ లొంగిపోయాడు.

పోలీసులపై ఏసీబీ వల
పట్టుబడిన సొమ్ముతో ఏసీబీ అధికారులు

డిపార్టుమెంట్‌కు చెందిన వ్యక్తి నుంచే రూ.25 వేలు లంచం డిమాండ్‌

ఏసీబీకి చిక్కిన నరసాపురం ఎస్సై, రైటర్‌, హోంగార్డు

రాజమహేంద్రవరం తరలింపు

నరసాపురం, మార్చి 11 : నరసాపురం పోలీస్‌ స్టేషన్‌పై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేసి ఎస్‌ఐ బీఎస్‌డీఆర్‌ ప్రసాద్‌, రైటర్‌ నాగేశ్వరరావును వలపన్ని పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ.25 వేలు లంచం తీసు కున్న జీపు డ్రైవర్‌ ప్రసాద్‌ లొంగిపోయాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపిన వివరాలివి.. విజయవాడకు చెందిన విజయసాగర్‌కు నరసాపురం పట్టణానికి చెందిన యువతితో వివాహమైంది. ఇటీవల ఇతనిపై పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో 498 కేసు నమోదైంది. అతని తండ్రి హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కేసు నమోదు కాగానే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి తనపై, కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు పెట్టారని, న్యాయం చేయాలని కోరాడు. దీనికి ఎస్‌ఐ రూ.20 వేలు, రైటర్‌ నాగేశ్వరరావు తనకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం ఇస్తేనే కేసులో కొందరి పేర్లను తొలగిస్తామని లేకపోతే యధావిధిగా ఉంచుతామని బెదిరించారు. దీనిపై విజయసాగర్‌ ఏలూరు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు బాధితుడికి రూ.25 వేలు నగదు ఇచ్చి స్టేషన్‌ సమీపంలో మాటేశారు. లంచం సొమ్మును ఇచ్చేందుకు ఎస్‌ఐ వద్దకు వెళ్లితే డ్రైవర్‌కు అందించాలని చెప్పాడు. సొమ్మును తీసుకున్న డ్రైవర్‌ జీపులో పెట్టగానే మాటు వేసిన ఏసీబీ పోలీసులు ఒక్కసారిగా దాడిచేశారు. దీంతో ఉల్కికిపడ్డ డ్రైవర్‌ పరుగులు తీశాడు. గుర్తిం చిన ఎస్‌ఐ, రైటర్లు బయటకు పరుగులు తీశారు. ఏసీబీ పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. జీపు డ్రైవర్‌, హోంగార్డు ప్రసాద్‌ సాయంత్రం ఏసీబీ అధికారుల వద్ద లొంగిపోయాడు. వీరిపై కేసులు నమోదు చేసి రాజమండ్రి తరలించారు. ఈ దాడుల్లో సీఐ సతీష్‌, ఎస్‌ఐ ఎన్‌వీ భాస్కర్‌, సిబ్బంది ఉన్నారు.

ఉలిక్కిపడ్డ పోలీసులు..

కొంతకాలంగా నరసాపురం పోలీస్‌ సర్కిల్‌ లోని కొన్ని స్టేషన్లపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కొందరు మధ్యవర్తులుగా కేసులు డీల్‌ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నేరుగా లంచాలు తీసు కోకుండా మధ్యవర్తుల ద్వారానే వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈ ఆరోపణలు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌పై లేకపోలేదు. ఈ క్రమంలో ఏసీబీ దాడులు చేయడం పట్టణంలో సంచలనమైంది.

Updated Date - Mar 12 , 2024 | 12:18 AM