Share News

పురపాలక సంఘాల్లో పన్ను బాదుడు

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:01 AM

జిల్లాలోని పురపాలక సంఘాలలో ఆస్తి పన్ను మదింపు వ్యవహారం నిలువు దోపిడీ చందంగా మారింది. గడిచిన ఐదేళ్ళ కాలంలో ఆస్తి పన్ను దాదాపు రెట్టింపయ్యాయి. ఆస్తి విలువలను కృత్రిమంగా పెంచేస్తూ ఏటికేడాది పన్నులు పెంచివేయడంతో సామాన్యులు పన్నులు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

పురపాలక సంఘాల్లో పన్ను బాదుడు

ఐదేళ్లలో 100 శాతం పెరిగిన పన్నులు

ఆస్తి విలువ పెంచేస్తూ వడ్డింపులు

మార్కెట్‌లో పడిపోయిన ఆస్తి విలువలు

ఏప్రిల్‌ మరోసారి పెంచేందుకు రంగం సిద్ధం

పాలకొల్లు, మార్చి 28 : జిల్లాలోని పురపాలక సంఘాలలో ఆస్తి పన్ను మదింపు వ్యవహారం నిలువు దోపిడీ చందంగా మారింది. గడిచిన ఐదేళ్ళ కాలంలో ఆస్తి పన్ను దాదాపు రెట్టింపయ్యాయి. ఆస్తి విలువలను కృత్రిమంగా పెంచేస్తూ ఏటికేడాది పన్నులు పెంచివేయడంతో సామాన్యులు పన్నులు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ఆర్థిక సంవత్స రాంతంలో ఆస్తి పన్నుబకాయిలపై వడ్డీ రాయితీ ఇచ్చారు. ఇప్పుడు మార్చి 31 లోపు పన్ను బకాయి దారులు పుర్తిగా పన్నుచెల్లిస్తే 100 శాతం వడ్డీ రాయితీ ఇచ్చారు. అయినప్పటికీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు కార్పోరేషన్‌తో సహా అన్ని మునిసిపాలిటీలలోనూ లక్షలాది రూపాయల పన్ను బకాయిలు పేరుకుపోయాయి.దీనికి ప్రధాన కారణం ఆస్తిపన్ను పెంపుదలేనని తెలుస్తోంది. తాడేపల్లిగూడెంలో గత టీడీపీ ప్రభుత్వ హయంలో సాలీనా రూ.6 కోట్లు డిమాండ్‌ ఉండగా ఇప్పడది సుమారి రూ14 కోట్లకు చేరింది. భీమవరం మున్సిపాలిటీలో గతంలో 10 కోట్లు డిమాండ్‌ ఉండగా ఇప్పడు రూ. 25 కోట్లకు పైబడింది. పాలకొల్లులో 2019 నాటికీ కేవలం రూ. 3.10 కోట్లు డిమాండ్‌ కాగా ఇప్పడు రమారమి రూ.7 కోట్లకు చేరింది. పన్ను మదింపు సమయంలో సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాలలో పెరిగిన ఆస్తి విలువలకు అనుగుణంగా ఆయా పురపాలక సంఘాలలో ఆస్తి పన్నులు పెంచుతారు. అయితే జగన్‌రెడ్డి హవా మొదలైన తరువాత ఏటి కేడాది పన్నులు పెంచే ప్రక్రియకు తెరతీశారు. ఈ పన్ను పెంపుదల ఆస్తి విలువలు పెరుగుదల ఆధారంగా 2 నుంచి 15 శాతం ఉంటుంది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్య తరగతి ప్రజలు ఆస్తి పన్నులను చెల్లించలేక పోతున్నారు. మరోవైపు అపరాధ రుసుముగా 24 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. 2023 డిసెంబరు లోపుగా ఎన్నికలు జరుగుతాయనే ఉద్దేశంతో గతేడాది బాకీదారులకు వడ్డీ రాయితీ ఇచ్చారు. ఎన్నికలు జరగక పోవడం, ఇప్పుడు ఎన్నికలు జరగనుం డటంతో మరోసాయి తాయిలంగా వడ్డీరాయితీ ప్రకటించారు. పెంచిన మొత్తాలనే కట్టలేని స్థితిలో వడ్డీరాయితీ ఇస్తే లాభం ఏమిటని పేద వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

పన్ను పెంపు సరే..మౌలిక వసతులేవీ ..?

పట్టణాలలో మౌలిక వసతులు కరువయ్యాయి. అన్ని కాలాల్లోనూ దోమల బెడద తప్పడం లేదు. డ్రైయినేజీలలో షిల్టు తొలగించకపోవడంతో దోమలు పెరిగిపోయాయి. మరోవైపు పాలకొల్లు సహా పలు పట్టణాలలో పందులు, పశువుల బెడద వదలడం లేదు. మౌలిక వసతులు కల్పనలో ప్రగతి చూపించలేనప్పడు దారుణంగా పన్నులు వసూలు చేయడం పట్ల పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో మౌలిక వసతులు మెరుగుపరిచే నాయకులకే ఓటు వేస్తామని చెబుతున్నారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి మరో దఫా ఆస్తిపన్నులు పెంచే యోచన విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:01 AM