Share News

చాలా పెద్ద తప్పు చేశాం

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:33 AM

చంద్రబాబు అవసరాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అంతా గుర్తించారు. రాష్ట్ర విభజన జరిగి ఆర్థిక లోటులో ఉన్నా ఉద్యోగులకు చంద్రబాబు 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు.

చాలా పెద్ద తప్పు చేశాం

చంద్రబాబును కాదనుకుని

జగన్‌ను తెచ్చుకున్నాం

ఇప్పుడు దీన్ని సరిదిద్దుకోవాలని

నిర్ణయించుకున్నాం

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్‌

చంద్రబాబు అవసరాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అంతా గుర్తించారు. రాష్ట్ర విభజన జరిగి ఆర్థిక లోటులో ఉన్నా ఉద్యోగులకు చంద్రబాబు 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. పది నెలల బకాయిలు విడుదల చేశారు. అటువంటి చంద్రబాబును కాదనుకుని జగన్‌ను తెచ్చుకున్నాం. ఇది మేం చేసిన పెద్దతప్పు. దీన్ని సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను చైతన్యవంతుల్ని చేస్తున్నాం. రాష్ట్రానికి కాపాడేది చంద్రబాబు మాత్రమే. జగన్‌ మొత్తం నాశనం చేశాడు. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు, పెన్షనర్లు పడిన ఇబ్బందులు ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో చూడలేదు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారు. వాళ్ల అసమర్థతతో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని సుబ్బరాయన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

- విజయవాడ, ఆంధ్రజ్యోతి

ఉద్యోగులు, పెన్షనర్ల ఓట్లు అవసరం లేదన్న భావనలో జగన్‌ ఉన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ పడలేదు. ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదు. ఈ ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనికి నిదర్శనం 2022 ఫిబ్రవరిలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం. ఉద్యోగ సంఘాల నేతలను భయపెట్టి దాన్ని అణచివేయాలనుకున్నారు. దీంతో ఉద్యోగులే బాధ్యతను భుజాన వేసుకుని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌కార్డులను ఏ ఆసుపత్రిలోనూ అనుమతించడం లేదు. అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నాం. రీయింబర్స్‌మెంట్‌ బిల్లుల డబ్బులు రెండేళ్లయినా రావడం లేదు. ఉద్యోగ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్‌ సకాలంలో రావడం లేదు. ఏపీజీఎల్‌ఐ మెచ్యూర్‌ అయినా డబ్బులు ఇవ్వడం లేదు.


బకాయిలు ఎంత మొత్తంలో ఉంటాయి

2019 నుంచి ఇప్పటివరకు ఒక్కో పెన్షనర్‌కు రూ.2లక్షల నుంచి 4 లక్షల వరకు పీఆర్సీ, డీఏ బకాయిలు ఉన్నాయి. బకాయిలకు సంబంధించిన బిల్లులు చేయించి, ఖజానా శాఖకు పంపారు. డబ్బులు లేక ఆ శాఖ బిల్లులు పాస్‌ చేయలేదు. వాటిని చూపించి ఇన్‌కం టాక్స్‌ కట్‌ చేశారు. బకాయిలు తీసుకోకుండానే వందలాది మంది చనిపోయారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. దీనికి పూర్తి బాధ్యత సీఎందే. ఉద్యోగులకు 70ఏళ్లు వచ్చాక అప్పటి వరకు తీసుకుంటున్న పెన్షన్‌కు అదనంగా పది శాతం పెంచాలి. దీన్ని జగన్‌ 3 శాతం తగ్గించాడు. ధరలు పెరిగినప్పుడు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను పెంచకపోగా తగ్గించారు.

పార్టీ ఏర్పాటు చేయాలన్నఆలోచన రావడానికి కారణం?

గవర్నమెంట్‌ టెక్స్ట్‌బుక్‌ ప్రెస్‌లో అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పనిచేశాను. రాష్ట్ర నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, 2019 జూన్‌ 30న గుంటూరులో ఉద్యోగ విరమణ చేశాను. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు సీఎం జగన్‌కు పాలాభిషేకాలు చేస్తూ ఉద్యోగులను మోసం చేస్తున్నాయి.

సీఎం ఏం చేశాడని పాలాభిషేకాలు అభిషేకాలు చేశారు? ఈ సంఘాల నాయకులు వైసీపీకి కార్యకర్తలుగా తయారయ్యారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించకుండా మౌనం పాటిస్తున్నారు. పదవుల కోసం అమ్ముడుపోయి ఉద్యమాన్ని అమ్మేశారు. అందుకే పెన్షనర్ల సమస్యపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. సన్నిహితులతో చర్చించిన తర్వాత ఆంధ్రా పెన్షనర్ల పార్టీని ఏర్పాటు చేశాం.

రాష్ట్రంలో ఎంతమంది పెన్షనర్లు ఉన్నారు?

రాష్ట్రంలో 3.87 లక్షల మంది ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారు. వీరుకాకుండా ఆర్టీసీ, మున్సిపల్‌, పంచాయతీ, సహకార శాఖ, జిల్లాపరిషత్‌ స్థానిక సంస్థల పెన్షనర్లు లక్షల్లో ఉన్నారు. జగన్‌ సీఎం అయ్యాక ఆరు, ఏడు నెలలు మాత్రమే పెన్షన్‌ ఒకటో తేదీన మా ఖాతాల్లో జమ అయింది. ఇప్పుడు 16, 17, 18 తేదీల వరకు జమ చేస్తున్నారు.


మీ కార్యాచరణ ఏమిటి?

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. వారిలో చైతన్యం తీసుకువస్తున్నాం. చంద్రబాబు ఎందుకు అవసరమో వివరిస్తున్నాం. ఈ సమావేశాల్లో మంచి స్పందన వస్తోంది. వచ్చే నెల 9న పులివెందులలో సభ పెడతాం. అక్కడ పరిణామాలు ఎలా ఉన్నా సభను నిర్వహిస్తాం.

మీ లక్ష్యం ఏమిటి..

జగన్‌ను ఓడించాలన్నదే మా సంకల్పం. మార్చి 26న చంద్రబాబును కలిశాం. పెన్షనర్ల సమస్యలపై వినతిపత్రం ఇచ్చాం. పెన్షనర్లకు సంక్షేమ సంస్థ ఏర్పాటు చేయాలని, ప్రతి పెన్షనర్‌కు రూ.20లక్షల ఆరోగ్య బీమా చేయాలని కోరాం. అధికారంలోకి రాగానే సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Apr 26 , 2024 | 05:36 AM