Share News

AP News: ఏప్రిల్ 17 నుంచి ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Mar 25 , 2024 | 05:44 PM

ఏప్రిల్ 17 నుంచి ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ జేఈవో వీర బ్రహ్మం వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదీన ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆయన తెలిపారు.

AP News: ఏప్రిల్ 17 నుంచి ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు

రాజంపేట, మార్చి 25: ఏప్రిల్ 17 నుంచి ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ జేఈవో వీర బ్రహ్మం వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదీన ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆయన తెలిపారు. సోమవారం ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామి వారి బ్రహోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ జేఈవో వీర బ్రహ్మం అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటలకు వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఈ బ్రహ్మోత్సవాలను టీటీడీలోని అన్ని విభాగాలతోపాటు జిల్లా యంత్రాంగం, పోలీసుల సమిష్టి కృషితో విజయవంతం చేయాలని ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా విజ్జప్తి చేశారు. గతంలో చోటు చేసుకున్న లోటుపాట్లను సవరించుకొని శ్రీసీతారాముల కల్యాణాన్ని ఘనం నిర్వహించాలని సూచించారు. ఇక ఈ బ్రహోత్సవాల ఏర్పాట్లను సమన్వయం చేసుకొంటూ వేగవంతంగా పూర్తి చేయాలని అన్ని విభాగాజల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 20వ తేదీ హనుమంత వాహనం, ఏప్రిల్ 21వ తేదీ గరుడ వాహనం, ఏప్రిల్ 23వ తేదీ రథోత్సవము, ఏప్రిల్ 25వ తేదీ చక్రస్నానం, ఏప్రిల్ 26వ తేదీ పుష్పయాగము జరుగుతాయని తెలిపారు.

ఈ బ్రహోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. ఈ బ్రహ్మోత్సవాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ స్పష్టం చేశారు. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు

ఈ సమీక్ష సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొని.. బ్రహ్మోత్సవాలు వేళ భక్తుల రద్దీ నేపథ్యంలో.. భక్తుల భద్రత, వాహనాల పార్కింగ్, అన్న ప్రసాదాల పంపిణీ, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, ప్రధమ చికిత్స కేంద్రాలు, ప్రజా రవాణా, సైన్ బోర్డులు, పారిశుద్ద్యం తదితర అంశాలపై పలు కీలక సూచనలు చేశారు.

Updated Date - Mar 25 , 2024 | 05:44 PM