Share News

రైతుల్లో మీ‘టెర్రర్‌’

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:14 AM

వ్యవసాయ పంపుసెట్లకు బిగిస్తున్న మీటర్లను చూసి జిల్లా రైతులు టెన్షన్‌ పడుతున్నారు. వ్యతిరేకిస్తున్నా ముందుకే వెళ్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఉచిత విద్యుత్‌ను దూరం చేసేందుకేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

రైతుల్లో మీ‘టెర్రర్‌’

రైతుల్లో మీ‘టెర్రర్‌’

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లపై అన్నదాతల్లో ఆందోళన

జిల్లాలో సాగుతున్న బిగింపు ప్రక్రియ

ఉచిత విద్యుత్‌ ఇస్తున్నప్పుడు ఇదేంటని ప్రశ్నిస్తున్న అన్నదాతలు

ప్రభుత్వ నిర్ణయాలపై మండిపాటు

ఇప్పటికే సరఫరాలో రెండు గంటలు కోత

వ్యవసాయ పంపుసెట్లకు బిగిస్తున్న మీటర్లను చూసి జిల్లా రైతులు టెన్షన్‌ పడుతున్నారు. వ్యతిరేకిస్తున్నా ముందుకే వెళ్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఉచిత విద్యుత్‌ను దూరం చేసేందుకేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో అనేక మంది రైతుల పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లు బిగించారు. ఈ తంతు కొనసాగుతోంది. అయితే కొద్దిరోజులుగా వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో రెండు గంటల పాటు నిలిపేస్తుండడంతో ఇప్పటికే రైతులు నిరసన తెలియజేస్తున్నారు. మీటర్లపై మరింత కలవరపడుతున్నారు.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

అనేక సంవత్సరాలుగా రైతులకు ఉచితంగా విద్యుత్‌ అందించే విధానం అమలులో ఉంది. పంపుసెట్లకు రోజూ తొమ్మిది గంటల పాటు త్రిఫేజ్‌ సరఫరా ఇవ్వాలి. కొద్దిరోజులుగా ఏడు గంటలే సరఫరా ఇస్తున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే విధానాన్ని తెరపైకి తేవడమే కాకుండా ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల పంపుసెట్లకు మీటర్లు బిగించేశారు. ఇదంతా గమనిస్తున్న సగటు రైతు ఆందోళన చెందుతున్నాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చి రైతుకు సాగును దూరం చేస్తోందని మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 52వేల వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. వీటికి మీటర్లు బిగించే పక్రియను వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో ఇంతవరకు 6వేల కనెక్షన్లకు మీటర్లు బిగించారు. మొదట శ్రీకాకుళం జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాగా ఉన్న విజయనగరం, పార్వతీపురం ప్రాంతాల్లో పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారు. అయితే గత ప్రభుత్వాలేవీ చేయని పనిని వైసీపీ ప్రభుత్వం చేస్తుండడంతో ఈ ప్రక్రియపై రైతుల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. గత కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు మీటర్ల ఆలోచనే చేయకుండా విద్యుత్‌ వినియోగంతో సంబంధం లేకుండా నిర్దేశిత సమయాల్లో ఉచిత విద్యుత్‌ను అందించే వారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్నదానిలో ఆంతర్యం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

- వ్యవసాయానికి త్రీఫేజ్‌ విద్యుత్‌ను ప్రతిరోజు 9గంటల పాటు అందించాలి. ఉదయం 8గంబటల నుంచి సాయంత్రం 5గంటల వరకు త్రీఫేజ్‌ సరఫరా ఇచ్చేవారు. నెలరోజులకుపైగా ఉదయం 9గంటలకు సరఫరా ప్రారంభించి సాయంత్రం 4గంటలకే నిలిపేస్తున్నారు. మరో వైపు విద్యుత్‌ మీటర్లు బిగిస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారు.

- రైతులకు ఎన్ని పంపు సెట్లు ఉన్నా ఉచిత సరఫరా కొనసాగుతుంది. నెలకు రూ.30 చొప్పున ఆరునెలలకు ఒకసారి రూ.180 వసూలు చేస్తున్నారు. అరటే ఏడాదికి రూ.360 చెల్లిస్తే ఉచితంగా విద్యుత్‌ను పొందవచ్చు. దారిద్రయ రేఖకు దిగువన ఉన్న వారిని గుర్తించేందుకు ఇళ్లలో విద్యుత్‌ వాడకాన్ని 300యూనిట్లు లోపే ఉండాలన్నది ఒక నిబంధన. ఇదే మాదిరిగా వ్యవసాయ పంపు సెట్లకూ అర్హతలను తీసుకు వస్తారేమోనన్న భయం రైతుల్లో నెలకొంది. ఇప్పటికే బొబ్బిలి, తెర్లాం తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బించే తంతును సాగిస్తున్నారు.

మీటర్లు ఎందుకు?

పథకం పేరులోనే ఉచితం అని ఉంది. అటువంటపుడు మళ్లీ మీటర్లు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయటం దేనికి. దాపరికం లేకుండా ప్రభుత్వం విషయం చెప్పాలి. మభ్యపెట్టి ఇబ్బందులకు గురిచేయటం సరికాదు. మీటర్లు ఎందుకు బిగిస్తున్నారో రైతులకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రైతులకు అవగాహనే పర్చకుండా మీటర్లు బిగిస్తుంటే సహజంగానే వారికి ఆందోళన కలుగుతుంది.

- ఎస్‌.లక్ష్మణరావు, రైతు

-----------------------------

భవిష్యత్‌లో ఇబ్బందులు

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు వేసి భవిష్యత్‌లో ఏమైనా కఠిన నిబంధనలు అమలు చేస్తారేమోన్న అనుమానం కలుగుతోంది. ఏ ఆలోచనా లేనపుడు దశాబ్దానికి పైగా అమల్లో ఉన్న విధానానికి భిన్నంగా ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంటుంది. ఉచితాల పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని పంచుతున్నారు. రైతుల వద్దకు వచ్చేటప్పటికి ఉచిత విద్యుత్‌కు సైతం మీటర్లు వేసి ఆందోళనకు గురిచేస్తున్నారు.

- కె.పార్వతి, రైతు

-----------

Updated Date - Apr 17 , 2024 | 12:14 AM