Share News

వైసీపీ వారి చార్జీల మోత

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:37 PM

వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ప్రయాణం కూడా భారంగా మారింది. ఐదేళ్ల కాలంలో పలు ధపాలు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేయడంతో జిల్లావాసులు మండిపడుతున్నారు. మరోవైపు కాలం చెల్లిన బస్సులనే ఇప్పటికీనడిపిస్తుండడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు.

వైసీపీ వారి చార్జీల మోత

సామాన్య, మధ్య తరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం

మరోవైపు కాలం చెల్లిన బస్సులతోనే నెట్టుకొస్తున్న వైనం

ప్రయాణికుల అసంతృప్తి.. అధికార పార్టీపై ఆగ్రహం

పార్వతీపురం టౌన్‌, ఏప్రిల్‌ 18 : వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ప్రయాణం కూడా భారంగా మారింది. ఐదేళ్ల కాలంలో పలు ధపాలు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేయడంతో జిల్లావాసులు మండిపడుతున్నారు. మరోవైపు కాలం చెల్లిన బస్సులనే ఇప్పటికీనడిపిస్తుండడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. మొత్తంగా బస్సు ఎక్కాలంటేనే సామాన్య, మధ్యతరగతి వర్గాలు భయాందోళన చెందుతున్నారు. వాస్తవంగా జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, పాలకొండలో ఆర్టీసీ డిపోలున్నాయి. వాటి పరిధిలో 72 అద్దె ప్రాతిపదికన, 162 వరకు ఆర్టీసీ ఓన్‌ బస్సులు నడుస్తున్నాయి. అయితే 2019 తో పోలిస్తే పల్లె వెలుగు, అలా్ట్ర , ఎక్స్‌ప్రెస్‌ బస్సు చార్జీలు 15 శాతం వరకు పెరిగాయి. అయితే వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత 2022, జూలైలో బస్సు చార్జీలు పెంచింది. దీంతో సుదూర ప్రాంతాల వారితో పాటు 10 కిలో మీటర్ల లోపు ప్రజల పైనా అదనపు భారం పడింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్వతీపురం నుంచి విజయనగరం జిల్లా కేంద్రానికి గాను పల్లె వెలుగు బస్సు చార్జీ రూ. 80 ఉందేది. అదే వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ బస్సు చార్జి రూ. 90కు పెరిగింది. ఎక్స్‌ప్రెస్‌ చార్జీ రూ. 105 నుంచి రూ. 115కు పెరిగింది. జిల్లాకేంద్రం నుంచి విశాఖకు ఎక్స్‌ప్రెస్‌ బస్సు చార్జి రూ.160ల నుంచి రూ.180కు పెంచారు. అలా్ట్ర డీలక్స్‌ అయితే రూ.195 నుంచి రూ.220క వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. పొరుగు రాష్ట్రం ఒడిశాలోనూ ఈ విధంగా బస్సు చార్జీలు లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పార్వతీపురం ఆర్టీసీ డిపో నుంచి రోజూ విశాఖ, విజయనగరం, పాలకొండ, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, బొబ్బిలి తదితర ప్రాంతాలకు 87 బస్సులు నడుపుతున్నారు. వాటిల్లో పల్లెవెలుగు, అలా్ట్ర , ఎక్స్‌ప్రెస్‌ బస్సులున్నాయి. కాగా నిత్యం వాటి ద్వారా డిపోకు రూ. 13 లక్షల నుంచి రూ. 14 లక్షల వరకు వస్తోంది. కాగా టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆర్టీసీ చార్జీలను పెంచలేదు. 2019 అనంతరం వైసీపీ పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్టీసీ చార్జీలను పెంచేయడంతో ఆ ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ప్రధానంగా నిత్యావసర సరుకుల ధరలు నింగినంటగా.. పేద, మద్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏమి కొనలేని .. తినలేని పరిస్థితి ఏర్పడిగా.. కనీసం బస్సుల్లో కూడా వారు ప్రయాణాలు కూడా చేయలేకపోతున్నారు. ఈ విషయమై జిల్లా ప్రజా రవాణాధికారి సుధాకర్‌ను వివరణ కోరగా... ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్టీసీ సంస్థకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకూడదని తెలిపారు.

బస్సుల్లో ప్రయాణం కష్టమే..

ఆర్టీసీ బస్సుల్లో విజయనగరం, విశాఖకు ప్రయాణించాలంటే కష్టమే.. ఎందుకంటే ఆయా ప్రాంతాలకు రూ.110 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి వస్తోంది. అదే రైళ్లలో అయితే రూ.20 నుంచి రూ.60 లోపు చార్జీలతో ఆయా ప్రాంతాలకు వెళ్లిపోతు న్నాం. కానీ సకాలంలో రైళ్లు నడవకపోవడం వల్ల బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే చార్జీలు అమాంతం పెంచేయడం వల్ల బస్సులో ప్రయాణమంటే అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. ఇది మాలాంటి వారికి భారంగా మారింది.

- తేజ, ప్రయాణికుడు, పార్వతీపురం

======================================

ఎంతవరకు సమంజసం

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సుఖం, సురక్షితం అన్నది ఒకప్పటి మాట. కాలం చెల్లిన బస్సుల్లో ప్రయాణం చేయలేకపోతున్నాం. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఎన్నో పనులపై నిత్యం సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. అయితే వైసీపీ సర్కారు దానిని పట్టించుకోకుండా బస్సు చార్జీలను పెంచేయడం ఎంతవరకు సమంజసం.

- సింహచలం, ప్రయాణికుడు, ఎర్రసామంతవలస

Updated Date - Apr 18 , 2024 | 11:37 PM