పింఛన్‌దారులపై వైసీపీ కక్ష
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:36 PM
ప్రభుత్వ నిర్లక్ష్యం పింఛన్‌దారుల పాలిట శాపంగా మారింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పింఛన్ సొమ్ము పంపిణీ చేస్తామని చెప్పి మోసం చేసింది. బ్యాంకులకు అరకొరగా నగదు జమచేయడంతో జిల్లాలో బుధవారం పింఛన్ల పంపిణీ అరకొరగా జరిగింది.

- సచివాలయాలకు చేరని నగదు
- కావాలనే బ్యాంకులకు జమ చేయని ప్రభుత్వం
- సచివాలయ ఉద్యోగుల ప్రదక్షిణలు
-వలంటీర్లను తప్పించడంతోనే ఆలస్యమంటూ వైసీపీ దుష్ప్రచారం
- ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్న పింఛన్‌దారులు
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/ శృంగవరపుకోట, ఏప్రిల్ 3:
-ప్రభుత్వ నిర్లక్ష్యం పింఛన్‌దారుల పాలిట శాపంగా మారింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పింఛన్ సొమ్ము పంపిణీ చేస్తామని చెప్పి మోసం చేసింది. బ్యాంకులకు అరకొరగా నగదు జమచేయడంతో జిల్లాలో బుధవారం పింఛన్ల పంపిణీ అరకొరగా జరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకూ పింఛన్‌దారులు పడిగాపులు కాశారు. మరోపక్క సచివాలయాల వద్ద టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంతో ఎండలోనే నిరీక్షించారు. ఇదంతా ప్రభుత్వం కావాలనే చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షంపై విషం చిమ్మేందుకు ఈ నాటకాలడుతోందని జనాలు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు.
-శృంగవరపుకోట మండలంలో 20 గ్రామ సచివాలయాల వరకు ఉన్నాయి. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఈ సచివాలయాల పరిధిలోని పింఛన్‌దారులకు నగదు పంపిణీ చేసేందుకు కేవలం రూ.10.78 లక్షలు మాత్రమే బ్యాంకు ఖాతాలకు జమయ్యాయి. రూ.381 నుంచి రూ.1.03 లక్షల వరకు బ్యాంకు ఖాతాల్లో కనిపించడంతో ఈ సొమ్మును తీసుకువెళ్లి ఎవరికి పంపిణీ చేయాలో అర్ధంకాక సచివాలయ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. ఉదాహరణకు శృంగవరపుకోట పంచాయతీలోని ఓ సచివాలయానికి చెందిన పింఛన్‌దారులకు రూ.19.51 లక్షలు అవసరం. కానీ, బ్యాంకులో రూ.80.662 మాత్రమే జమకావడంతో పింఛన్ల పంపిణీ చేపట్టలేదు. ఈ పరిస్థితి జిల్లావ్యాప్తంగా ఉంది.
జిల్లాలో 2,82,748 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల పింఛన్ అందించేందుకు రూ.84.84 కోట్లు అవసరం. ప్రతినెల ఒకటో తేదీ నుంచి వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఆ బాధ్యతల నుంచి వలంటీర్లను ఎన్నికల కమిషన్ తప్పించింది. వారి స్థానంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పింఛన్ల పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. అయితే, బుధవారం సాయంత్రం వరకూ పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును మాత్రం బ్యాంకులకు జమ చేయలేదు. ఈ నగదు కోసం బ్యాంకుల వద్ద సచివాలయ ఉద్యోగులు పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకుల వద్దకు రావడం, ఖాతాలను తనిఖీ చేయడం.. నగదు జమకాకపోవడంతో తిరిగి సచివాలయాల్లో పనులు చూసుకొనేందుకు వెళ్లడంతోనే రోజంతా గడిచింది. నగదు ఎప్పుడు జమవుతుందో మండల స్థాయి అధికారులే చెప్పలేకపోతున్నారు. బుధవారం రాత్రికి ఏ సమయానికైనా జమవుతుందని, గురువారం ఉదయం నుంచి పంపిణీ చేస్తామని చెబుతున్నారు. ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారుజామున చేతికి అందే డబ్బులు ఈ నెలలో మూడు రోజులు గడిచినా అందకపోవడంతో పింఛన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో వృద్ధులు, దివ్యాంంగులు, వితంతువులు ఉన్నారు.
టీడీపీపై విష ప్రచారం
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత శృంగవరపుకోట మండలం అలుగుబల్లి గ్రామానికి చెందిన ఇద్దరు గ్రామ వలంటీర్లు వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిపై కలెక్టర్ నాగలక్ష్మికు ఫిర్యాదు అందింది. మండల ఎన్నికల అధికారి, ఎంపీడీవో సాంబశివరావుతో విచారణ చేయించారు. నిజమేనని నిర్ధారణకు రావడంతో ఇద్దరు వలంటీర్లను తొలగించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 14 మంది వలంటీర్లను విధుల నుంచి తప్పించారు. ఇలా చాలామంది వలంటీర్లు వైసీపీతో అంటగాగుతున్నారు. ప్రచార కార్యకర్తల్లా మారారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో సామాజిక పింఛన్ల పంపిణీకి వారిని దూరంగా పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీన్నికూడా వైసీపీ రాజకీయంగా వాడేసుకుంటుంది. ప్రతిపక్షాల వలనే వలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి తప్పించారంటూ దుష్ప్రచారం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుతోనే వలంటీర్లను పింఛన్లు పంపిణీ చేయకుండా తప్పించారని విష ప్రచారానికి దిగింది. అయితే, పత్రికల్లో వచ్చిన కథనాలు, ఫిర్యాదులు, హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ వలంటీర్లతో పింఛన్ల పంపిణీ చేయవద్దని ఆదేశించిందని, కానీ వైసీపీ నేతలు టీడీపీయే కారణం అనడం ఏంటని జనాలు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు.
ఇంటింటికీ వెళ్లి అందించండి
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే మండల పరిషత్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ల టీడీపీ నేతలు వినతిపత్రాలు అందించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సీఎస్ జవహర్‌రెడ్డి, సెర్ప్ కమిషనర్ తదితరులకు లేఖ రాశారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మకుండా ఉండేందుకు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జిల్లాలో 626 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఇందులో 11 నుంచి 12 డిపార్ట్‌మెంట్లకు చెందిన ఉద్యోగులు పని చేస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో 8,872 మంది, వార్డు సచివాలయాల్లో 1827 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సచివాలయ పరిధిలో నాలుగు వేల జనాభా మాత్రమే ఉంది. 100 నుంచి 800 మంది వరకు పింఛన్‌దారులు ఉంటారు. ఇప్పటికే వీరితో పరిచయం ఉన్న సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదే విషయాన్ని టీడీపీ సూచించింది. ఇంటింటికీ వెళ్లి సామాజిక పింఛన్లు అందించాలని పట్టుబడుతుంది. కానీ, టీడీపీపై వ్యతిరేకత కలగాలన్న వైసీపీ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు నడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి అవకాశం ఇవ్వడం లేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకూ కేవలం సచివాలయాల వద్ద పంపిణీ చేయాలని, మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న వారి ఇళ్లకు మాత్రమే వెళ్లి పింఛన్లు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి శనివారం లోపు శతశాతం పూర్తి చేయాలని చెప్పింది. కానీ, బుధవారం రాత్రయినా నగదు మాత్రం బ్యాంకులకు జమకాలేదు. జిల్లాలో 28.12శాతం పింఛన్ల పంపిణీని పూర్తి చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు.
అరకొరగా..
విజయనగరం రూరల్/విజయనగరం దాసన్నపేట: విజయనగరం మండలంలో అరకొరగా పింఛన్ల పంపిణీ జరిగింది. సారిక, కొరుకోండ, కోరుకొండపాలెం తదితర సచివాలయాల పరిధిలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల తరువాత పింఛన్ల పంపిణీ చేపట్టారు. మండలంలో 6,097 పింఛన్‌దారులకు గాను 3,102 మందికి పంపిణీ చేశారు. విజయనగరంలోని 10, 33 సచివాలయాలు (పీఎస్సార్ కాలనీ, రాజీవ్‌నగర్ కాలనీ, లంకవీధి) తదితర ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పింఛన్ల పంపిణీ జరగలేదు.
వెనుదిరిగారు..
నెల్లిమర్ల: పింఛన్‌దారులకు సొమ్ము అందించడంలో సచివాలయ ఉద్యోగులు విఫలమయ్యారు. బుధవారం ఉదయం 10 గంటలకే సచివాలయ ఉద్యోగులు బ్యాంకుకు వెళ్లి సొమ్ము తీసుకువచ్చి పింఛనుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, సాయంత్రం 4 గంటలైనా వారు బ్యాంకు నుంచి తిరిగి సచివాలయాలకు రాకపోవడంతో పింఛన్‌దారులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఉత్తచేతులతోనే ఇళ్లకు వెనుదిరిగారు.
యాభై శాతం లోపే..
రేగిడి: మండలంలో 25 సచివాలయాల పరిధిలో 10,996 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతినెల పింఛన్ అందించేందుకు రూ.3.19 కోట్లు అవసరం. కానీ, ఈ నెల యాభై శాతం లోపే బ్యాంకుకు నగదు జమయింది. నగదు కొరతతో కొన్ని సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. బుధవారం సాయంత్రం 6గంటలైనా పింఛన్లు పంపిణీ జరగలేదు. ఈ విషయమై ఎంపీడీవో శ్యామలాకుమారి వివరణ కోరగా.. ‘బుఽధవారం సాయంత్రానికి రెండువిడతలుగా రూ.1.32కోట్లు జమయ్యాయి. ఈ నగదును పింఛన్‌దారులకు ఇబ్బంది లేకుండా పంపిణీకి చర్యలు చేపట్టాం.’ అని తెలిపారు.
పడిగాపులు
రాజాం: పురపాలక సంఘంలోని 11 వార్డు సచివాలయాల పరిధిలో 4వేల మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి రూ.1.50 కోట్లు అవసరం. అయితే, మాదిగవీధి, లచ్చయ్యపేట సచివాలయాలకు మాత్రమే అరకొరగా నిధులు మంజూరయ్యాయి. మిగతా చోట్ల పింఛన్‌దారులు పడిగాపులు కాశారు. రాజాం పట్టణంలోని సత్యనారాయణపురం, కొండంపేట, ఆదర్శనగర్, తదితర సచివాలయాల్లో పరిధిలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచే పింఛన్ల కోసం నిరీక్షించారు. లచ్చయ్యపేట సచివాలయం -2లో చీకట్లోనే పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్లు అందక వస్త్రపురికాలనీ వాసులు వెనుతిరిగారు. గురువారం నుంచి పూర్తిస్థాయిలో పంపిణీ చేపడతామని పురపాలక సంఘం మేనేజర్ ఎంవీ నాగరాజు తెలిపారు రాజాం మండలంలోని 17 గ్రామ సచివాలయాల పరిధిలోని 8,012 పింఛన్లకు గాను రూ.2.34కోట్లు మంజూరయ్యాయి గురువారం ఉదయం నుంచి పంపిణీ చేస్తామని ఇన్‌చార్జి ఎంపీడీవో వావిలపల్లి శ్రీనివాసరావు తెలిపారు. బొబ్బిలి: అదిగో క్యాష్ వచ్చేస్తోంది..... ఇదిగో క్యాష్ వచ్చేస్తోంది... అంటూ అధికారులు చెబుతుండడంతో బుధవారం రాత్రి 7.30 గంటలు దాటే వరకు సచివాలయాల దగ్గర అటు సిబ్బంది, ఇటు పింఛన్‌దారులు పడిగాపులు కాశారు. 35.34 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు మునిసిపల్ కమిషనరు లాలం రామలక్ష్మి బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
సౌకర్యాలేవి?
భోగాపురం/వంగర: వేసవిలో ఎండ తీవ్రత దృష్ట్యా పింఛన్‌దారులకు సచివాలయాల వద్ద టెంట్లు, తాగునీరు వంటి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ, చాలాచోట్ల ఈ ఏర్పాట్లేవీ కన్పించలేదు. లబ్ధిదారులకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా వేయలేదు. టెంట్లు, కుర్చీలకు డబ్బులు ఎవరు పెడతారని సచివాలయ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. దీంతో పింఛన్‌దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.