Share News

యమ‘కంకర’లు

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:02 AM

నిన్న కనిపించిన కొండ, నేడు సగమై, రేపటికి ఏకంగా మాయమైపోతోంది. ఇదేదో గారడీ కాదు కనికట్టు అంతకన్నా కాదు. యమ‘కంకర’ల దోపిడీ ఇది. గ్రామాల్లోని కొండలు కరిగిపోతున్నాయి. అక్రమార్కుల చేతుల్లో పడి కనుమరుగై పోతున్నాయి. ఎలాంటి లైసెన్సులు గాని, ముందస్తు అనుమతులు గాని లేకుండా యథేచ్ఛగా కంకర కొండలను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులు కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

యమ‘కంకర’లు
నెల్లిమర్ల: బొప్పడాంలో కరిగిపోయిన కంకర కొండ

యమ‘కంకర’లు

జిల్లా అంతటా కరుగుతున్న కొండలు

ఉదాసీనంగా వీఆర్‌ఓలు

ప్రభుత్వ ఆదాయానికి తూట్లు

నెల్లిమర్లలో ధ్వంసమవుతున్న ప్రకృతి వనరులు

నిన్న కనిపించిన కొండ, నేడు సగమై, రేపటికి ఏకంగా మాయమైపోతోంది. ఇదేదో గారడీ కాదు కనికట్టు అంతకన్నా కాదు. యమ‘కంకర’ల దోపిడీ ఇది. గ్రామాల్లోని కొండలు కరిగిపోతున్నాయి. అక్రమార్కుల చేతుల్లో పడి కనుమరుగై పోతున్నాయి. ఎలాంటి లైసెన్సులు గాని, ముందస్తు అనుమతులు గాని లేకుండా యథేచ్ఛగా కంకర కొండలను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులు కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

నెల్లిమర్ల/ చీపురుపల్లి/ గజపతినగరం, జూన్‌ 1:

నెల్లిమర్ల మండల కేంద్రంతో పాటు జగ్గరాజుపేట, చంద్రంపేట, పారసాం, టెక్కలి, చనమల్లుపేట, బొప్పడాం గ్రామాల్లో కంకర కొండలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక సమయంలో తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. సొంత ఇళ్ల నిర్మాణాల కోసమని.. ఇతర అవసరాల కోసమని చెప్పి అక్రమార్కులు వీఆర్‌ఓలను మభ్య పెట్టి ఆ తర్వాత లారీలద్వారా తరలిస్తున్నారు. ఈ తంతు ఏళ్లుగా సాగుతున్నా అక్రమంగా తరలిపోతున్న కంకర లారీలను, ట్రాక్టర్లను ఆపే దాఖలాలు లేవు. కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ సిబ్బంది చేతి వాటం, మరి కొన్ని ప్రాంతాల్లో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఈ తంతు సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ కొండలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించి కంకర తరలింపును అరికడితే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

చీపురుపల్లిలోనూ..

మట్టి దొంగల ధన దాహం కారణంగా కొండలు తరిగి తరిగి కరిగిపోతున్నాయి. పట్టపగలే యంత్రాలతో తవ్వేసి, లారీలతో తరలిస్తున్నారు. ఈ ధ్వంస రచన గురించి మైనింగ్‌, రెవెన్యూ సిబ్బందికి తెలిసినా పట్టించుకోవడం లేదు. చీపురుపల్లి మండంలోని పీకే పాలవలస, పెదనడిపల్లి పంచాయతీలు, చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుకనున్న కోడూరు పరిథిలోని కొండల నుంచి కొంతకాలంగా కంకర తరలింపు ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఈ మండలంలో కొండ ప్రాంతం తక్కువగా ఉండడంతో గ్రావెల్‌కు బాగా డిమాండు ఉంది. దీనిని ఆసరా చేసుకొని దోపిడీదారులు చెలరేగిపోతున్నారు. చిన్నపాటి గుట్టల్ని కూడా విడిచి పెట్టకుండా దొలిచేస్తున్నారు. చెరువుల్లో గ్రావెల్‌, మట్టిని కూడా వదలడం లేదు. తవ్వుకున్నో డికి తవ్వుకున్నంత అన్న చందంగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడకపోవండతో కొండలు, వాటిపై ఉండే వృక్ష సంపద నాశనమవుతోంది.

గ్రావెల్‌ తవ్వేసి.. ఆక్రమించేసి

గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో పెద్దకొండ నుంచి నిత్యం గ్రావెల్‌ తరలించుకుపోతున్నారు. ఈ నియోజకవర్గంలో గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో ఈ దందా ఎక్కువ. కొండలను తవ్వేయడం.. ఆపై స్థలాలను ఆక్రమించడం మామూలైపోయింది. ఇప్పటికే కొంత మంది ఆక్రమణదారులు కొండ చుట్టూ స్థలాన్ని ఆక్రమించుకొని తోటలు సాగు చేయగా మరికొంత మంది గ్రావెల్‌ను ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. ఆదివారం వచ్చిందంటే రాత్రీపగలు యథేచ్ఛగా గ్రావెల్‌ తరలించుకుపోవడం అలవాటుగా మారింది.

అనుమతి తప్పనిసరి

కొండల నుంచి గ్రావెల్‌ తీయడానికి మైనింగ్‌ శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. గ్రావెల్‌ తీయాలనుకున్న కొండ ఏ సర్వే నంబరులో ఉందో తెలియజేస్తూ సంబంధిత తహసీల్దారు ద్వారా గనుల శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. పంచాయతీ అనుమతి కూడా ఉండాలి. ఈ తతంగమేదీ లేకుండానే అక్రమార్కులు కొండలను తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:02 AM