‘చెత్త’ పాలన
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:56 PM
జిల్లా కేంద్రం పార్వతీపురంలో డంపింగ్ యార్డు తరలింపు కలగా మారింది. ఈ అంశం వైసీపీ ప్రభుత్వ హయాంలో కాగితాలకే పరిమితం అయింది. అక్కడకు తరలిస్తాం.. ఇక్కడకు తరలిస్తాం అని ఐదేళ్లూ కల్లబొల్లి కబుర్లతో కాలం నెట్టుకొచ్చారే తప్ప డంపింగ్ యార్డు తరలింపు మాత్రం జరగలేదు. దీంతో ప్రజలు నరకం చూస్తున్నారు.

ఐదేళ్లూ కల్లబొల్లి కబుర్లతో గడిపేసిన వైనం
పార్వతీపురం వాసులకు తప్పని ఇబ్బందులు
కొత్త ప్రభుత్వంపైనే ఆశలు
(పార్వతీపురంటౌన్)
జిల్లా కేంద్రం పార్వతీపురంలో డంపింగ్ యార్డు తరలింపు కలగా మారింది. ఈ అంశం వైసీపీ ప్రభుత్వ హయాంలో కాగితాలకే పరిమితం అయింది. అక్కడకు తరలిస్తాం.. ఇక్కడకు తరలిస్తాం అని ఐదేళ్లూ కల్లబొల్లి కబుర్లతో కాలం నెట్టుకొచ్చారే తప్ప డంపింగ్ యార్డు తరలింపు మాత్రం జరగలేదు. దీంతో ప్రజలు నరకం చూస్తున్నారు. యార్డు నుంచి వచ్చే కంపును భరించలేకపోతున్నారు. పిల్లలు, వృద్ధులు రోగాల బారినపడుతున్నారు. దీనిపై ఆందోళనలు, నిరసనలు చేపట్టినా ఫలితం శూన్యం. నూతన ప్రభుత్వంపైనే వీరంతా ఆశలు పెట్టుకున్నారు.
జిల్లా కేంద్రం పార్వతీపురం శివారులో ఉన్న డంపింగ్ యార్డుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రీయ రహదారికి ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డు నుంచి తీవ్ర దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో ఆ చుట్టు పక్కల ఉన్న వివేకానంద కాలనీ, జగన్నాథపురం, తదితర కాలనీల వాసులు నరకం చూస్తున్నారు. అలాగే, రాష్ట్రీయ రహదారి మీదుగా రాకపోకలు సాగించే పాదచారులతో పాటు వాహనచోదకులు డంపింగ్ యార్డు వద్దకు వచ్చేసరికి ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. శ్వాసకోస సంబంధిత వ్యాధులతో తమ పిల్లలు, వృద్ధులు ఇబ్బందుల పడుతున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
గోపసాగరం కలుషితం
డంపింగ్ యార్డుతో వంద ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే గోపసాగరం కలుషితమవుతుంది. దీంతో సాగుకు ఆ నీటిని వినియోగించాలంటే రైతులు భయపడిపోతున్నారు. అలాగే, ఈ సాగరంపై ఆధారపడి 200 రజక కుటుంబాలు బతుకుతున్నాయి. నీరు కలుషితమవడంతో వీరు తమ వృత్తిని నిర్వహించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అదే విధంగా గోపసాగరంపై కొన్ని మత్స్యకార కుటుంబాలు కూడా ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే, నీరు కలుషితం కావడంతో గత నెలలో రూ.1.50 లక్షల విలువచేసే చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో మత్స్యకారులు లబోదిబో మంటున్నారు. గోపసాగరాన్ని రక్షించాలని గత కొన్నేళ్లుగా రైతులు, రజక, మత్స్యకారులు నిరసనలు తెలుపుతున్నా, అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నా పట్టించుకొనే వారే కరువయ్యారు. అదే విధంగా డంపింగ్ యార్డును వేరే చోటకు తరలించాలని జట్టు ఆశ్రమ నిర్వహకులు పద్మజ పలుమార్లు నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. అలాగే, తాజా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు సమస్యను పరిష్కరించాలని కోరినప్పటికీ ఫలితం శూన్యం.
తరలింపునకు ఎన్నో అడ్డంకులు
డంపింగ్ యార్డు తరలింపు అనేది కొన్ని దశాబ్దాలుగా కాగితాలకే పరిమితం అయింది. 2008లో అప్పటి మున్సిపల్ పాలకవర్గం డంపింగ్ తరలింపునకు తీర్మానం చేసి ఆమోదం తెలిపింది. 2010లో పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ పిట్టవలస సమీపంలో కొండ వద్ద రెవెన్యూ అధికారులు 8 ఎకరాలు సేకరించి మున్సిపల్ అధికారులకు అప్పజెప్పారు. అయితే, డంపింగ్ యార్డును ఇక్కడ ఏర్పాటు చేస్తే తాము రోగాల బారినపడతామని మరికి పంచాయతీ ప్రజలు ధర్నాలు, నిరసనలు చేపట్టారు. దీంతో సమస్య మొదటికొచ్చింది. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డు తరలింపునకు పక్కా ప్రణాళికలు పడ్డాయి. పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ రావికోన, బట్టివలస గ్రామాల సమీపంలో డంపింగ్ యార్డు తరలింపునకు రంగం సిద్ధం చేశారు. టీడీపీ నాయకులు చొరవ మేరకు 5 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు కేటాయించారు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీతో పాటు పలు వామపక్షలు, గిరిజన సంఘాలు అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ డంపింగ్ యార్డును తరలిస్తామని హంగామా చేసింది. మొదట పార్వతీపురం మండలం హెచ్.కారాడవలస వద్దకు, తరువాత గరుగుబిల్లి మండలం కోటావానివలస, ఆ తరువాత అదే మండలంలోని సుంకి సమీపంలోకి డంపింగ్ యార్డును తరలిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి వైసీపీ నేతలు ఐదేళ్లు కాలం గడిపేశారు. అందుకే పార్వతీపురం ప్రజలు ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు. టీడీపీ గెలవడంతో తమ సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులకు తెలియజేస్తాం
డంపింగ్ యార్డు తరలింపు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. సమస్య పరిష్కరానికి కృషి చేస్తా.
కె.శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్, పార్వతీపురం మున్సిపాల్టీ