Share News

బిల్లులిస్తేనే పనులు

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:20 PM

తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పాత రెగ్యులేటర్‌ పరిధిలోని ఆధునికీకరణ పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో వైసీపీ సర్కారు అలసత్వం ప్రదర్శిస్తుండడంతో కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారు.

బిల్లులిస్తేనే పనులు
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు

రూ.15 కోట్లకు పైగా బకాయిలు

చెల్లింపుల్లో వైసీపీ సర్కారు అలసత్వం

తోటపల్లి ఆధునికీకరణ పనులపై నీలినీడలు

రానున ్న ఖరీఫ్‌లో రైతులకు తప్పని ఇబ్బందులు

(గరుగుబిల్లి)

తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పాత రెగ్యులేటర్‌ పరిధిలోని ఆధునికీకరణ పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో వైసీపీ సర్కారు అలసత్వం ప్రదర్శిస్తుండడంతో కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారు. బిల్లులు వస్తాయో రావోనన్న దిగులులో ఉన్నారు. ఇప్పటికే అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, సకాలంలో చెల్లించకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు చేసిన పనులకు పూర్తిస్థాయిలో చెల్లిస్తేనే పనులు తిరిగి చేపడతామని వారు చెబుతున్నారు. దీంతో సంబంధిత అధికారుల్లో ఆందోళన నెలకొంది. గడువులోపు పనులు పూర్తికాకపోతే రానున్న ఖరీఫ్‌లో ఇబ్బందులు తప్పవని మరోవైపు రైతులు ఆవేదన చెందుతున్నారు. సర్కారు స్పందించి త్వరగా బిల్లులు మంజూరు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని ఎడమ ప్రధాన, కుడి పిల్ల కాలువల అభివృద్ధికి గత తెలుగుదేశం ప్రభుత్వం సుమారు రూ. 190 కోట్లు మంజూరు చేసింది. దీంతో కొంతమేర పనులు జరిగాయి. అయితే ఆ తర్వాత ఎన్నికలు జరగడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారింది. ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనుల నిర్వహణకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం రెండు కాలువల పరిధిలో సుమారు రూ. 40 కోట్లతో 30 శాతానికి పైగా పనులు జరిగాయి. గతంలో నిలిచిన పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా సంబంధిత కాంట్రాక్టర్లకు సుమారు రూ. 15 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. అయితే రెండేళ్ల నుంచి ప్రభుత్వం చెల్లింపులకు తీవ్ర జాప్యం చేస్తుంది. దీంతో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి 37.62 కిలో మీటర్లకు గాను 16 మిలో మీటర్లు, కుడి పిల్ల కాలువ 17.616 కిలో మీటర్లకు గాను 9.37 కిలో మీటర్ల మేర లైనింగ్‌, కాంక్రీటు పనులు నిర్వహించారు. ఎడమ కాలువ పరిధిలో 8, కుడి కాలువ పరిధిలో 11 బ్రాంచి కాలువల పనులు చేయాల్సి ఉంది. వీటితో పాటు సుమారు 267కు పైగా ఆక్విడెక్టులు, సూపర్‌పాసెజ్‌లు, అండర్‌ టన్నెళ్లు, డ్రాపులు, ఓటీ స్లూయిస్‌లు నిర్మించాల్సి ఉంది.

ఫిబ్రవరి వచ్చినా ..

పాత రెగ్యులేటర్‌ పరిధిలోని కాలువల ఆధునికీకరణ పనులను ఏటా డిసెంబరులోనే ప్రారంభించేవారు. అయితే ప్రధానంగా చెల్లింపులు కాకపోవడంతో నిర్వహణలో జాప్యం నెలకొంది. ప్రస్తుతం ఫిబ్రవరి వచ్చినా.. ఇంకా పనుల ఊసే లేదు. మే నెలాఖరుకు పనులు పూర్తయితే జూన్‌ మొదటి వారంలో ఖరీఫ్‌కు సాగునీరు విడుదలకు సన్నాహాలు చేసేవారు. అయితే సమయం దగ్గరపడుతుండగా.. ఆ లోపు పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఖరీఫ్‌ రైతులకు ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేవు. మరోవైపు రెండు కాలువల పరిధిలో అధికంగా గండ్లు పడ్డాయి. ఖరీఫ్‌లో గండ్లు పడినా యంత్రాంగం అంతంత మాత్రంగానే స్పందించింది. నిధుల సమస్యతో చేతులెత్తేశారు. దీంతో రైతులపైనే భారం పడుతుంది.

మూడుసార్లు గడువు పెంపు

సంబంధిత పనుల నిర్వహణకు గాను కాంట్రాక్టర్లకు మూడుసార్లు గడువు పెంచారు. 2018లో చేపట్టిన పనులకు మొదట 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఆలోపు పూర్తి చేయలేకపోయారు. రెండో ధపా 2023 మే 28 వరకు గడువు పెంచారు. ప్రస్తుతం మూడో దశకు సంబంధించి ఈ ఏడాది మే నెల 28 నాటికి అవకాశం ఇచ్చారు. అయితే ఇంకా మూడు నెలలే సమయం ఉండగా.. ఆలోపు పనులు పూర్తి చేసే అవకాశం లేదు. రెండు కాలువల పరిధిలో అధికారికంగా 65 వేలు, అనధికారికంగా మరో 30 వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. లేకుంటే పంట పొలాలు బీడుగా మారే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

చెల్లింపులకు చర్యలు

ఆధునికీకరణ పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. పనులపై ఉన్నతాధికారులకు నివేదించాం. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్లతో కూడా చర్చిస్తున్నాం. ఈ నెల రెండో వారం నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తోటపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. తాగునీటి అవసరాల నిమిత్తం కుడి పిల్ల కాలువల నుంచి చెరువులకు కొంతమేర సరఫరా చేస్తున్నాం. ఆరుతడి పంటల సాగు ప్రయత్నాలను రైతులు విరమించుకోవాలి. రానున ్న ఖరీఫ్‌కు ఇబ్బందులు లేకుండా పనులు నిర్వహిస్తాం.

- డి.రవికుమార్‌, డీఈఈ, పాలకొండ డివిజన్‌

Updated Date - Feb 06 , 2024 | 11:20 PM