Share News

ఆగమేఘాలపై పనులు.. నాణ్యతకు తిలోదకాలు

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:05 AM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీ ప్రభుత్వం ఆగమేఘాలపై గ్రామాల్లో బీటీ రహదారుల నిర్మాణాన్ని చేపట్టంది. అయితే నాణ్యత ప్రమాణాలకు మాత్రం తిలోదకాలిచ్చారు.

ఆగమేఘాలపై పనులు.. నాణ్యతకు తిలోదకాలు
పెచ్చులూడుతున్న కళ్లికోట - గారవలస రహదారి

కొద్ది రోజులకే పెచ్చులూడుతున్న వైనం

వైసీపీ సర్కారు తీరుపై ప్రజల మండిపాటు

కొమరాడ, ఏప్రిల్‌ 3: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీ ప్రభుత్వం ఆగమేఘాలపై గ్రామాల్లో బీటీ రహదారుల నిర్మాణాన్ని చేపట్టంది. అయితే నాణ్యత ప్రమాణాలకు మాత్రం తిలోదకాలిచ్చారు. మొత్తంగా ఈ రహదారుల నిర్మాణం తమ అనుయాయుల కోసమే తప్ప ప్రజల సౌకర్యార్థం కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించానికి పది రోజుల ముందు కొమరాడ మండలంలో కళ్లికోట నుంచి గారవలసకు వరకుకిలోమీటరు పరిధిలో అనుసంధాన బీటీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ పనుల్లో భాగంగా కొద్ది రోజుల కిందట రోడ్డుపై తారు వేశారు. అయితే ప్రస్తుతం ఈ రహదారి ఎక్కడికక్కడే పెచ్చులుగా విడిపోతోంది. దీంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ. 1.60 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డు కొద్దిరోజులకే పెచ్చులూడడంపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలు సైతం మండిపడుతున్నారు. నిధులు దుర్వినియోగమవుతున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పనులు చేయించామని గొప్పలు చెప్పుకోవ డానికి తప్ప నాణ్యత ప్రమాణాలు పాటించిన దాఖలాలు లేవని విమర్శించారు. అధికార పార్టీ నాయకుల అనుయాయులు చేపట్టిన పనులు కాబట్టీ అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రహదారుల నిర్మాణ నాణ్యతను పూర్తిస్థాయిలో పరిశీలించి బాధ్యుతలపై చర్యలు చేపట్టాలని టీడీపీ మండల కన్వీనర్‌ ఉదయశేఖరపాత్రుడు, స్థానికులు తదితరులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 04 , 2024 | 12:05 AM