Share News

మహిళ హత్య

ABN , Publish Date - May 17 , 2024 | 10:58 PM

సీతంపేట మండలం పులిపుట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం ఆ గ్రామంలోని ఎర్ర చెరువు వద్ద ఉన్న మృతదేహాన్ని స్థానికులు చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

 మహిళ హత్య

దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మృతురాలి ఆచూకీ కోసం యత్నం

సీతంపేట: సీతంపేట మండలం పులిపుట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం ఆ గ్రామంలోని ఎర్ర చెరువు వద్ద ఉన్న మృతదేహాన్ని స్థానికులు చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పాలకొండ డీఎస్పీ కృష్ణారావు, సీఐ చంద్రమౌళి, సీతంపేట ఎస్‌ఐ జగదీష్‌నాయుడు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి.. గ్రామస్థులతో మాట్లాడారు. మృతురాలి మెడపై వెనుక భాగంలో కత్తిపోట్లు ఉండడంతో ఎవరో ఆమెను ఇక్కడకు తీసుకొచ్చి హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితులు ద్విచక్రవాహనంపై వచ్చినట్టు ఆ ప్రదేశంలో ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలు వివాహిత అని, కాళ్లకు పట్టీలు, చెప్పులు, ముక్కుపుడక, చెవిదిద్దులు ఉన్నాయని, ఎర్రటి దుస్తులు ధరించినట్లు చెప్పారు. ఆమె వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని స్పష్టం చేశారు. క్లూస్‌టీం సాయంతో వేలిముద్రలు సేకరిస్తున్నామని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీతంపేట ఎస్‌ఐ తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 63099 90883, 63099 90820 నెంబర్లకు ఫోన్‌ చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. ఏదేమైనా సీతంపేట-కొత్తూరు ప్రధాన రహదారి పక్కనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Updated Date - May 17 , 2024 | 10:58 PM