Share News

జడ్పీ గాడిన పడేనా?

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:04 AM

గత ఐదేళ్లూ జిల్లా పరిషత్‌ సమావేశాలు ఏకపక్షంగా సాగాయి. కనీస స్థాయిలో కూడా ప్రతిపక్షాలకు చోటు ఉండేది కాదు. అప్పటి అధికార వైసీపీ ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది.

జడ్పీ గాడిన పడేనా?
జిల్లా పరిషత్‌ కార్యాలయం

- గత ఐదేళ్లలో అస్తవ్యస్తం

- ప్రతిపక్షం లేకపోవడంతో ఇష్టారాజ్యం

- నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

- సమస్యలపై వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం

- ఈ నెల 21న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ గుర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి శాపాలుగా మారాయని అన్నారు. వైసీపీ సర్కారు గ్రామాలను పట్టించుకోలేదని, పంచాయతీ నిధులను ఖర్చుపెట్టలేదని, దీంతో తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తమై డయేరియా వంటి రోగాలు ప్రబలుతున్నాయని మండిపడ్డారు.

- జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘గుర్లలో డయేరియా వ్యాప్తి చెందడానికి కలుషిత నీరు కారణమని వైద్యులు, అధికార యంత్రాంగం చెబుతున్నారు. జలజీవన్‌ మిషన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల నిధులు మంజూరూ చేస్తే, ఆ పనులు పూర్తి చేయడంలో జగన్‌ సర్కారు విఫలమైంది. కేవలం పైపులు వేసి బిల్లులు చేసుకున్నారు. దీంతో తాగునీరు కలుషితమై గుర్లలో డయేరియా వ్యాపించింది. ఇది ముమ్మాటీకి గత పాలకుల పాపమేనని’ అన్నారు.

- గుర్ల తదితర ప్రాంతాల్లో డయేరియా వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం వైసీపీయేనని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం పాలించింది. ఇప్పుడు కూడా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లో వైసీపీ వారే పాలకులుగా చెలమని అవుతున్నారు. జడ్పీ చైర్మన్‌తో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా ఎక్కువగా వైసీపీ సభ్యులే ఉన్నారు. మరి గుర్ల ఘటనపై అధికార పార్టీపై నిందలు ఎలా వేస్తారు. జడ్పీ పాలకులకు బాధ్యత లేదా?. వారి నిర్వాకం వలనే గుర్ల, తదితర ప్రాంతాల్లో డయేరియా వ్యాప్తి చెందిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విజయనగరం/ విజయనగరం టౌన్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లూ జిల్లా పరిషత్‌ సమావేశాలు ఏకపక్షంగా సాగాయి. కనీస స్థాయిలో కూడా ప్రతిపక్షాలకు చోటు ఉండేది కాదు. అప్పటి అధికార వైసీపీ ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. వైసీపీ హయాంలో జడ్పీని అచేతనం చేశారన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ పాలనకు ప్రధాన వారథిగా జిల్లా పరిషత్‌ ఉండాలి. కానీ, గత సర్కారు జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, డీసీసీబీ చైర్మన్‌, ఇలా ప్రతిఒక్కరినీ ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. సంక్షేమం మాటున వివిధ శాఖల ప్రగతిని తుంచేసింది. అది ప్రజలకు శాపంగా మారింది. గుర్ల డయేరియా ఘటనకు ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే కారణం. అక్కడ భూగర్భ జలాలు కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు నిర్ధారించారు. కానీ, నాలుగు నెలల కిందట అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఈ నింద మోపుతున్నారు. ఈ నేపథ్యంలో జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సర్వసభ్య జరగనుంది. సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, గుమ్మిడి సంధ్యారాణితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. దీంతో జడ్పీలో వాడీవేడి చర్చ కొనసాగనుంది. అధికార పక్ష ప్రజాప్రతినిధులు గళం ఎత్తే అవకాశముంది. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జడ్పీ వైఫల్యాలు బయటపడే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రాభవం కోల్పోయింది..

32 శాఖల పర్యవేక్షణతో, పుష్కలమైన నిధులతో తొణికిసలాడాల్సిన జిల్లా పరిషత్‌ వైసీపీ ప్రభుత్వ హయాంలో తన ప్రాభవం కోల్పోయింది. న్యాయబద్ధంగా జడ్పీకి రావాల్సిన స్థానిక సంస్థల పన్నులు, గనులు, ఇసుక సీనరేజ్‌ చార్జీలు వంటివి ఏళ్ల తరబడి నిలిచిపోయాయి. గతంలో సీనరేజ్‌ రూపంలో వచ్చే ఆదాయాన్ని పంచాయతీలకు 50 శాతం, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లు చెరో 50 శాతం పంచుకునేవి. అయితే సీనరేజ్‌ చార్జీలను గత కొన్నేళ్లుగా చెల్లించడం లేదు. నేరుగా ప్రభుత్వ ఖాతాకే జమ అవుతున్నాయి. అలాగే, రిజిస్ర్టేషన్‌ సర్‌ చార్జీలు, నీటి తీరువా పన్నుల ద్వారా కొంత మొత్తం స్థానిక సంస్థలకు ఆదాయం వచ్చేది. ఎకరాకు నీటి తరువా రూ.200 వసూలు చేస్తే అందులో 5 నుంచి 10 శాతం పంచాయతీలకు జమ అయ్యేది. పంచాయతీ పరిధిలో ఎవరైనా భూములు విక్రయించి రిజిస్ర్టేషన్‌ చేసుకున్నట్టయితే ఆ శాఖ నుంచి సర్‌ చార్జీల రూపంలో కొంత మొత్తం పంచాయతీలకు వచ్చేది. కానీ కొన్నేళ్లుగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో ఆదాయం లేక ఎమ్మెల్యేలు, ఎంపీల నిధులపై ఆధారపడుతున్నారు. కొన్ని మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు కూర్చునేందుకు కనీసం చాంబర్లు లేవు.

రైతాంగానికి తీవ్ర అన్యాయం

వైసీపీ పాలనలో జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. సాగునీటి సమస్యలను పరిష్కరించకపోవడంతో వ్యవసాయ సబ్సిడీలు అందించకపోవడంతో అన్నదాతలు అనేక అవస్థలు పడ్డారు. ఉమ్మడి జిల్లాలో అనేక సాగునీటి కాలువల్లో పూడికలు, తుప్పలు తొలగింపునకు నిధులు విదల్చలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో నిర్వహించిన జిల్లా పరిషత్‌ సర్వ సభ్య సమావేశంలో మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పలు సమస్యలను లేవనెత్తారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి శివారు ప్రాంతానికి నీరు ఎందుకు అందడం లేదని వారు అధికారులను అడిగారు. కాలువల అభివృద్ధికి గత ప్రభుత్వం నిధులు విదల్చలేదని, దీంతో షట్టర్లు లీకేజీ, మరమ్మతులు, జంగిల్‌ క్లియరెన్స్‌ చేయకపోవడంతో శివారు భూములకు నీరందని పరిస్థితి తలెత్తిందని అధికారులు వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో రైతాంగం సమస్యలతో పాటు పారిశుధ్యం, తాగునీరు, తదితర సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Oct 25 , 2024 | 12:04 AM