Share News

వైటీసీలకు పూర్వ వైభవం వచ్చేనా?

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:06 PM

జిల్లాలో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వైటీసీ (యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌)ల పరిస్థితి దయనీయంగా మారింది. వైసీపీ సర్కారు నిర్లక్ష్యంగా కారణంగా వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

వైటీసీలకు  పూర్వ వైభవం వచ్చేనా?
గుమ్మలక్ష్మీపురంలో వైటీసీ భవనం

నాడు ఏటా 1500 మందికి ఉపాధి

వైసీపీ పాలనలో పూర్తిగా నిర్వీర్యం

ఉద్యోగావకాశాలకు దూరమైన గిరిజన యువత

కొత్త ప్రభుత్వంపై ఆశలు

(పార్వతీపురం, జూన్‌9 (ఆంధ్రజ్యోతి)/గుమ్మలక్ష్మీపురం/సీతంపేట)

జిల్లాలో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వైటీసీ (యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌)ల పరిస్థితి దయనీయంగా మారింది. వైసీపీ సర్కారు నిర్లక్ష్యంగా కారణంగా వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గత ఐదేళ్లలో ప్రభుత్వం వైటీసీల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. నిధుల కేటాయింపును సైతం మరిచింది. దీంతో వైటీసీలు నామమాత్రంగానే మారాయి. ఎంతోమంది గిరిజన యువత ఉపాధి, ఉద్యోగావకాశాలకు దూరమయ్యారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అందరిలోనూ ఆశలు చిగురిస్తున్నాయి. మళ్లీ వైటీసీలకు పూర్వ వైభవం వస్తుందని, గిరిజన యువతకు ఉపాధికి ఢోకా ఉండదని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో పార్వతీపురం, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, సీతంపేటలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైటీసీలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఎంతోమంది గిరిజన యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవారు. మూడు నెలల కాల వ్యవధితో గిరిజన యువతీ యువలకు కంప్యూటర్‌, బ్యూటీషన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, సెల్‌ రిపేరింగ్‌ తదితర అంశాల్లో తర్ఫీదు ఇచ్చేవారు. ఆరు నెలలు, ఏడాది కాల వ్యవధితో మరికొన్ని కోర్సుల్లో గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారు. ఈ ట్రైనింగ్‌ సమయంలో వారికి ఉచితంగా భోజన, వసతి సదుపాయం కల్పించేవారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగవకాశాలు కల్పించేవారు. ఈ కేంద్రాల నిర్వహణకు నైపుణ్య అభివృద్ధి సంస్థ నుంచి నిధులు కేటాయించేవారు. అయితే వైసీపీ అఽధికారంలోకి వచ్చిన తర్వాత సీన్‌ మారింది. వాటి నిర్వహణకు నిధులు కేటాయించకపోగా.. శిక్షణ పొందిన వారికి సరైన ఉద్యోగావకాశాలు కల్పించలేకపోయింది. అదేవిధంగా గిరిజన యువతీయువకులకు అరకొరగా శిక్షణ ఇచ్చారు. ఐదేళ్లలో 150 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారు. వీరిలో 90 మందికి ప్లేస్‌మెంట్‌ కల్పించినప్పటికీ .. అక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతో అనేకమంది ఇంటిబాట పట్టారు.

- గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైటీసీల్లో ఏటా 1500 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేవారు. అయితే వైసీపీ వచ్చిన తర్వాత వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఐదేళ్లలో పదుల సంఖ్యలో కూడా గిరిజనులకు ఉపాధి కల్పించలేకపోయింది.

- వైసీపీ పాలనలో స్కిల్‌ హబ్‌ పేరిట కొంతకాలం ఐటీఐల్లో విద్యార్థినీ విద్యార్థులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమం కూడా కొద్దికాలమే నిర్వహించి మమ అనిపించారు.

- సీతంపేట వైటీసీలో ప్రస్తుతం స్కిల్‌ కాలేజీని నిర్వహిస్తున్నారు. రెండేళ్లలో ఇక్కడ 150 మందికి పైగా శిక్షణ పొందినా ఉద్యోగాలు కల్పించలేకపోయారు. దీంతో ఈ ఏడాది ఎవరూ ఇక్కడ జాయిన్‌ అవ్వలేదు. ఫుడ్‌ అవుట్‌ లెట్‌ , ప్రింట్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌, టెక్నికల్‌ ఎగ్జిక్యూటివ్‌ కోర్సుల్లో 90 మంది శిక్షణ అందించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు.

- గుమ్మలక్ష్మీపురం, సాలూరులో వైటీసీలను గిరిజన గర్భిణుల వసతి గృహాలుగా మార్చారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కాగా అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కూడా గత 18 నెలలుగా జీతాలు అందించడం లేదు. భవిష్యత్తులో శిక్షణ కార్యక్రమాల గురించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని గుమ్మలక్ష్మీపురం వైటీసీ మేనేజర్‌ రాము తెలిపారు.

- ఇక పార్వతీపురం వైటీసీని ఎస్పీ కార్యాలయంగా మార్చారు.

- పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో వైటీసీలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో మన్యం వాసులు ఎంతోమంది ఉపాధి కోసం వలసబాట పట్టాల్సి వస్తోంది. స్థానికంగా ఉపాధి దొరక్కా.. గిరిజన యువత పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ర్టాలు, జిల్లాలకు పయనమవుతున్నారు. కాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైటీసీలకు పూర్వ వైభవం వస్తుందని జిల్లావాసులు భావిస్తున్నారు. వైసీపీ పాలనలో నిర్వీర్యమైపోయిన వైటీసీలను తిరిగి గాడిలో పెట్టాలని, గిరిజన యువతకు మెరుగైన శిక్షణలు ఇచ్చి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

ఉపాధి కల్పించడమే లక్ష్యం

జిల్లాలో వైటీసీల ద్వారా గిరిజన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బోనెల విజయచంద్ర, గుమ్మిడి సంధ్యారాణి, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణ తెలిపారు. వైటీసీలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. గిరిజన యువతీ యువకులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Jun 09 , 2024 | 11:06 PM