Share News

కేటాయిస్తారో.. విస్మరిస్తారో

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:22 PM

ఐదేళ్లుగా ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించింది. శాశ్వత కార్యక్రమం ఒక్కటీ తలపెట్టలేదు. కీలకమైన ప్రాజెక్టుల ఊసూ లేకపోయింది. చివరిగా మధ్యంతర బడ్జెట్‌ను శాసనసభలో బుధవారం ప్రవేశ పెడుతోంది. ఎన్నికల తరువాత ఏర్పడే ప్రభుత్వమే పూర్తిస్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తుంది.

కేటాయిస్తారో.. విస్మరిస్తారో
50 నత్తనడకన తారకరామ తీర్థసాగర్‌ నిర్మాణం

కేటాయిస్తారో.. విస్మరిస్తారో

రాష్ట్ర బడ్జెట్‌పై ఆశలు

ఓటాన్‌ అకౌంట్‌ అయినా అత్యవసర నిధులపై ప్రజల్లో ఆశలు

నేడు అసెంబ్లీలో మధ్యంతర రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశం

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ఐదేళ్లుగా ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించింది. శాశ్వత కార్యక్రమం ఒక్కటీ తలపెట్టలేదు. కీలకమైన ప్రాజెక్టుల ఊసూ లేకపోయింది. చివరిగా మధ్యంతర బడ్జెట్‌ను శాసనసభలో బుధవారం ప్రవేశ పెడుతోంది. ఎన్నికల తరువాత ఏర్పడే ప్రభుత్వమే పూర్తిస్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తుంది. అయితే అందరి దృష్టి మధ్యంతర బడ్జెట్‌ కేటాయింపులపైనే ఉంది. దీనికి కారణం మరో రెండో నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడమే. ఎన్నికల ప్రభావం బడ్జెట్‌పై తప్పకుండా ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అత్యవసర వాటికైనా నిధులు ఇస్తారన్న ఆశను సగటు పౌరులు వ్యక్తం చేస్తున్నారు. గత బడ్జెట్‌లలో సాగునీటి ప్రాజెక్టులు, ఇతర పథకాలకు వందల కోట్ల రూపాయలు కేటాయించారు కాని విదుదల చేయటంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఎక్కడికక్కడ పనులు పడకేశాయి. వాటికేమైనా కదలిక తెస్తారేమోనని పలువురు ఆశిస్తున్నారు. వచ్చే మూడు నెలలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయన్నది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.

తారకరామ తీర్థసాగర్‌పై కినుక

జిల్లా కేంద్రానికి తాగునీరు, నెల్లిమర్ల నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించేందుకు తారకరామతీర్థ సాగర్‌ ప్రాజెక్టును తీసుకొచ్చారు. దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఈ ప్రాజెక్టు పట్ల ఈ ప్రభుత్వ హయాంలో కనీస చొరవ లేదు. ఆఖరిలో ఏదో చేస్తున్నట్లు చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు రూ.100 కోట్లు అవసరముంది. కొంతైనా నిధులు కేటాయిస్తే మరో మూడు నెలలు పనులు సాగుతాయి. లేకుంటే పూర్తిగా ఆగిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పారాది వంతెన సాకారమయ్యేనా?

బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన నదులపై వంతెనలు కూలిపోతున్న పరిస్థితికి వచ్చాయి. అటువంటిదే వేగావతి నదిపై బొబ్బిలి మండలంలో ఉన్న పారాది వంతెన. ఇది ఒక వైపు కూలిపోయింది. దిగువ నుంచి ఇరన్‌ స్టేండ్లు ఏర్పాటు చేసి వంతెనను నిలబెట్టారు. మూడు నెలలుగా ఈ వంతెన పైనుంచి భారీ వాహనాలను అనుమతించడం లేదు. ప్రస్తుత బడ్జెట్లో రూ.10 కోట్లు మేర అయినా కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. లేకుంటే వంతెన నిర్మాణం కష్టమే.

సువర్ణముఖీ వంతెన కొలిక్కివచ్చేనా?

సువర్ణముఖీ నదిపై బొబ్బిలి-సీతానగరం మండల కేంద్రాల మధ్య వంతెన నిర్మాణానికి రూ.11కోట్లు మంజూరు చేశారు. కాని బిల్లులను ప్రభుత్వం సక్రమంగా చెల్లించడంలేదు. దీంతో కాంట్రాక్టర్‌ పిల్లర్ల నిర్మాణాలు పూర్తి చేసి పనులు విడిచి పెట్టి వెళ్లిపోయాడు. ఏడాది కాలంగా నదిలో మొండి పిల్లర్లతోనే వంతెన దర్శనమిస్తోంది. రూ.10 కోట్లు కేటాయిస్తే బిల్లుల బకాయిలు, పెండింగ్‌ పనులు, అప్రోచ్‌ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఉంది.

తోటపల్లిదీ అదే గోడు

తోటపల్లి సాగునీటి ప్రాజెక్టు కాల్వలు బొబ్బిలి మండలం నుంచి గుర్ల మండలం వరకు విస్తరించి ఉన్నాయి. అయితే పెండింగ్‌ బిల్లులు, పెండింగ్‌ పనులు, భూ సేకరణ కోసం ఇంకా రూ.350 కోట్లు వరకు అవసరం ఉంటుందని అంచనా. ప్రస్తుత బడ్జెట్లో రూ.310 కోట్లు కేటాయించాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. మరి ఏ స్థాయిలో నిధులు కేటాయిస్తుందో చూడాలి. ఈ ప్రాజెక్టు పరిధిలో సాగునీటి కాల్వల పనులకు అట్టహాసంగా జడ్పీ చైర్మన్‌ శంకుస్థాపనలు చేశారు కాని పనులు ముందుకు సాగలేదు.

వ్యవసాయ రాయితీలేవీ?

జిల్లాలో ఎక్కువ శాతం మంది వ్యవసాయంపై ఆధార పడుతున్నారు. రైతులకు వివిధ రాయితీలు అందించి సాగును ప్రోత్సహించాల్సి ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాయితీలు ఎత్తివేసింది. ముఖ్యంగా సూక్ష్మ వ్యవసాయ పరికరాలకు రాయితీలు ఇవ్వడం లేదు. డ్రిప్‌, స్పింక్లర్‌ సేద్యం, యాంత్రీకరణ వంటి వాటికి రాయితీల కోసం జిల్లాకు రూ.220 కోట్లు మేర నిధులు కేటాయించాల్సి ఉంది. ఏమాత్రమైనా ఇస్తారేమో చూడాలి.

------------------------

Updated Date - Feb 06 , 2024 | 11:23 PM