గిరిజన రోడ్లు బాగుపడేనా?
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:47 PM
భామిని ఏజెన్సీలో పలు రహదారులు అధ్వానంగా ఉన్నాయి. రాళ్లూరప్పలతో కనీసం మనుషులు నడవలేని విధంగా తయారయ్యాయి. దీంతో కొండలపై ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

-ఏజెన్సీలో అధ్వానంగా రహదారులు
- గత ఐదేళ్లూ పట్టించుకోని వైసీపీ సర్కారు
-పీఎం సడక్ యోజనపైనే ఆశలు
భామిని, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): భామిని ఏజెన్సీలో పలు రహదారులు అధ్వానంగా ఉన్నాయి. రాళ్లూరప్పలతో కనీసం మనుషులు నడవలేని విధంగా తయారయ్యాయి. దీంతో కొండలపై ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భామిని మండల కేంద్రం నుంచి కోటకొండ, కోసింగూడ గ్రామాలకు రహదారి కరువైంది. డోకులగూడ, మూలగూడ, జామిగూడ తదితర గిరిజన గ్రామాలకు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తాత్కాలిక రోడ్లు నిర్మించారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రోడ్ల నిర్వహణను పట్టించుకోలేదు. దీంతో రోడ్లు పాడయ్యాయి. రాళ్లు తేలిపోవడంతో వాటిపై కనీసం నడవలేకపోతున్నామని గిరిజనులు వాపోతున్నారు. అదే విధంగా తివ్వకొండ శిఖరంపై ఉన్న కోటకొండ, కోసింగూడ గ్రామాలకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్డు ప్రస్తుతం కనుమరుగైంది. బండ్రసింగి, కడంబసింగి ఘాట్ రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతింది.
ప్రతి ఏటా ఆదివాసీ గ్రామాల్లో రోడ్లు నిర్మాణానికి రూ.కోట్లలో ఖర్చుపెడుతున్నామని ప్రభుత్వాలు లెక్కలు చూపుతున్నాయి. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఒక్కసారి అధికారులు తమ గ్రామాలకు వచ్చి చూడాలని గిరిపుత్రులు కోరుతున్నారు. ఏటా ఈ సీజన్‌లో రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు పేరిట హడావుడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రధాన మంత్రి సడక్ యోజన ద్వారా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో గిరిపుత్రుల్లో ఆశలు చిగురించాయి. మణిగ గ్రామం నుంచి కోటకొండ దుర్గమ్మ ఆలయంతో పాటు మిగిలిన గిరిజన గ్రామాలకు కూటమి ప్రభుత్వంలో అయినా రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.
కోటకొండ-మణిగ రహదారిని కలపాలి
కోటకొండ, మణిగం గ్రామాలను కలుపుతూ రహదారిని నిర్మించాలి. సుమారు ఆరు కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తే భామిని మండల కేంద్రం దగ్గర అవుతుంది. దీనివల్ల కోటకొండలోని కోటదుర్గమ్మ గుడి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందనుంది.
-పాలక తురకన్న, కోటకొండ, భామిని
ఏబీ రోడ్డు పనులు పూర్తి చేయాలి
ఏబీ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కడికక్కడే రాళ్లు తేలి రహదారి దారుణంగా తయారైంది. పల్లపు ప్రాంతాలకు రావాలంటే నరకం చూస్తున్నాం. ఇప్పటికైనా ఏబీ రోడ్డు పనులు పూర్తి చేయాలి.
- కొండగొర్రె ప్రసాద్, డోకులగూడ
సర్వే చేపడతాం
కొండలు, పల్లపు ప్రాంతాలపై అర్ధాంతరంగా పనులు నిలిచిన రహదారులను గుర్తిస్తాం. లింకు రోడ్లకు అవసరమైన సర్వే చేపడతాం. సడక్ యోజన పథకం కింద రహదారులను నిర్మిస్తాం.
-గౌరీశంకర్, పీఆర్, జేఈఈ