Share News

ఆ రోడ్లు పూర్తవుతాయా?

ABN , Publish Date - Mar 27 , 2024 | 11:55 PM

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రహదారులు కీలకం. వైసీపీ హయాంలో వాటి నిర్మాణ విషయం దేవుడెరుగు.. ఈ ఐదేళ్ల కాలంలో రోడ్ల మరమ్మతులపై కూడా పెద్దగా దృష్టి సారించలేదు. ఉమ్మడి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎంత అధ్వానంగా మారాయో.. అడుగుకో గొయ్యితో ఎంత ప్రమాదకరంగా మారాయో.. వేరేగా చెప్పనవసరం లేదు.

ఆ రోడ్లు పూర్తవుతాయా?
కురుపాం నియోజకవర్గంలో మధ్యలో నిలిచిపోయిన తోటపల్లి - గుణుపురం రోడ్డు

ఆ రోడ్లు పూర్తవుతాయా?

ఉమ్మడి జిల్లాలో నిలిచిన ఏడు ప్రధాన రహదారుల నిర్మాణాలు

ఐదున్నర నెలలే గడువు

రూ. 47.81 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌

(జియ్యమ్మవలస)

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రహదారులు కీలకం. వైసీపీ హయాంలో వాటి నిర్మాణ విషయం దేవుడెరుగు.. ఈ ఐదేళ్ల కాలంలో రోడ్ల మరమ్మతులపై కూడా పెద్దగా దృష్టి సారించలేదు. ఉమ్మడి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎంత అధ్వానంగా మారాయో.. అడుగుకో గొయ్యితో ఎంత ప్రమాదకరంగా మారాయో.. వేరేగా చెప్పనవసరం లేదు. మరోవైపు కొత్తగా మంజూరైన రహదారుల నిర్మాణాలనూ సర్కారు పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆ నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి. మొత్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఎప్పటికి బిల్లులు మంజూరవుతాయి.. రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2024 సెప్టెంబరు 17 వరకు గడువు ఇచ్చినా కొలిక్కిరావడం సందేహమే.

ఇదీ పరిస్థితి

ఉమ్మడి జిల్లాలో 2021 మార్చి 28న ఏడు స్టేట్‌ హైవే రోడ్లు మంజూరయ్యాయి. వీటిని నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన ఎం/ఎస్‌ బీవీఎస్‌ఆర్‌ కనస్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 139.43 కోట్ల అగ్రిమెంట్‌తో ముందుకు వచ్చింది. ఏకకాలంలో నిర్మాణాలు ప్రారంభించింది. అయితే కొన్ని చోట్ల పనులు దాదాపు పూర్తవ్వగా, మరికొన్ని చోట్ల మధ్యలో నిలిచిపోయాయి. వాస్తవానికి ఈ రహదారుల నిర్మాణాలు 2023 మార్చి 27 నాటికి పూర్తికావాల్సి ఉంది. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు కాక ఈ దుస్థితి నెలకొంది. కాంట్రాక్టర్‌ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో రోడ్డు నిర్మాణాల గడువును 2024 సెప్టెంబరు 17 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇంతవరకు రూ. 55.34 కోట్ల విలువైన పనులు జరగ్గా అందులో రూ. 47.81 కోట్ల మేర బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితిలో గడువు నాటికి రహదారుల నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం కన్పించడం లేదు.

విజయనగరం డివిజన్‌లో...

విజయనగరం డివిజన్‌లో 42 కిలోమీటర్ల మేర నాలుగు రోడ్ల నిర్మాణానికి రూ. 105.04 కోట్లతో పరిపాలనా ఆమోదం లభించింది. ఆ తరువాత రూ. 96.71 కోట్లతో సాంకేతిక అనుమతి లభించింది. ఈ మేరకు రూ. 26.82 కోట్ల విలువైన పనులు జరిగినప్పటికీ.. రూ. 22.90 కోట్ల మేర బిల్లులు చెల్లింపులు జరగలేదు. దీంతో కాంట్రాక్టర్‌ చేతులెత్తేశారు.

- గజపతినగరం - జిన్నాం - గడసాం - పొరలి రోడ్డు స్టేట్‌ హైవే-124 పరిధిలో ఉంది. మొత్తం 17.623 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి రూ. 45.16 కోట్లు మంజూరు చేశారు. అయితే రూ. 8.97 కోట్ల మేర పనులు మాత్రమే జరిగాయి. రూ. 6.51 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

- చింతపల్లి - విజయనగరం రోడ్డు స్టేట్‌ హైవే-147 పరిధిలో ఉంది. 3.92 కిలో మీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి రూ. 8.70 కోట్లు మంజూరయ్యాయి. కానీ ఇక్కడ రూ. 45 లక్షలు విలువైన పనులు మాత్రమే జరగ్గా.. రూ. 36 లక్షల మేర బిల్లు పెండింగ్‌లో ఉంది.

- స్టేట్‌ హైవే-134 పరిధిలో 4.19 కిలో మీటర్ల మేర విజయనగరం - భీమసింగి - కొత్తవలస రోడ్డు నిర్మాణానికి రూ. 7.48 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ. 4.15 కోట్లు పనులు జరగ్గా ఇంకా రూ. 3.17 కోట్ల మేర బిల్లు పెండింగ్‌లో ఉంది.

- స్టేట్‌ హైవే-140 పరిధిలో 16.587 కిలో మీటర్ల మేర సోంపురం - ఆనందపురం రోడ్డు నిర్మాణానికి రూ. 35.37 కోట్లు మంజూరయ్యాయి. అయితే రూ. 13.25 కోట్ల విలువైన పనులు జరగ్గా రూ. 12.86 కోట్ల మేర బిల్లు పెండింగ్‌లో ఉంది.

మంజూరుకు పంపించాం

ఉమ్మడి జిల్లాలో మంజూరైన ఏడు ప్రధాన రహదారుల నిర్మాణాలు కొంత వరకు జరిగాయి. అయితే రూ. 47.81 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సిన మాట వాస్తవమే. ఇది సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉంది. బిల్లుల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదించాం.

- జీవీ రమణ, ఆర్‌అండ్‌బీ ఈఈ, విజయనగరం డివిజన్‌

Updated Date - Mar 27 , 2024 | 11:55 PM