Share News

కొఠియా సమస్య పరిష్కారమయ్యేనా?

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:18 PM

ఏవోబీ వివాదాస్పద ప్రాంతం కొఠియా సమస్యకు చెక్‌ పడేనా? దశాబ్దాల నాటి వివాదానికి తెరపడేనా?.. రెండు రాష్ర్టాల్లో సర్వత్రా ఇప్పుడిదే చర్చనీయాంశమవుతోంది. ఏ ఇద్దరు కలిసినా.. దీనిపైనే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ఆ సమస్యకు చెక్‌ పడే అవకాశముందని ఏపీ, ఒడిశా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 కొఠియా సమస్య  పరిష్కారమయ్యేనా?
కొఠియా ప్రాంతం

ఒడిశాలో మొదటిసారి కొలువుదీరనున్న బీజేపీ సర్కారు

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకూలం

వివాదం పరిష్కారం కానుందని ప్రజల్లో ఆశ

సాలూరు రూరల్‌, జూన్‌ 8: ఏవోబీ వివాదాస్పద ప్రాంతం కొఠియా సమస్యకు చెక్‌ పడేనా? దశాబ్దాల నాటి వివాదానికి తెరపడేనా?.. రెండు రాష్ర్టాల్లో సర్వత్రా ఇప్పుడిదే చర్చనీయాంశమవుతోంది. ఏ ఇద్దరు కలిసినా.. దీనిపైనే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ఆ సమస్యకు చెక్‌ పడే అవకాశముందని ఏపీ, ఒడిశా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో కొఠియా వివాదం త్వరలోనే పరిష్కారం కానుందని పలువురు భావిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

వాస్తవంగా కొఠియా గ్రూప్‌ గ్రామాల వివాదం ఈనాటిది కాదు. 1935లో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వాల నుంచి నడుస్తూనే ఉంది. స్వాతంత్య్ర అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఈ వివాదం ముదిరింది. కొఠియా గ్రామాలు తమవే అని ఒడిశా సుప్రీంకోర్టు తలుపుతట్టింది. ఈ గ్రామాల వివాదంపై 1968, డిసెంబరు 2న సుప్రీంకోర్టు స్టేటస్‌కో జారీ చేసింది. దీంతో కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో ఏపీ, ఒడిశాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తునే ఉన్నాయి. కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉన్నారు. వారికి రెండు రాష్ర్టాల రేషన్‌ కార్డులు, రెండు ఓటర్‌ కార్డులు ఉన్నాయి. ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. కొఠియా వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని 2006లో సుప్రీంకోర్టు సూచింది. అయితే కొఠియాపై ఆధిపత్యానికి ఒడిశా ప్రయత్నిస్తోంది. తమదే కొఠియా అంటూ 2018 నుంచి దూకుడు పెంచింది. కోట్లాది రూపాయలతో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, పోలీస్‌ స్టేషన్లు, స్కూళ్లను ఏర్పాటు చేసింది. కొఠియా గ్రూప్‌కు చెందిన ప్రతి గ్రామంలో ఒడిశా నిర్మాణాలున్నాయి. ప్రతి గ్రామానికి తారు ్ల,సిమెంట్‌ రోడ్లు వేశారు. గత ఐదేళ్లలో వైసీపీ సర్కారు మాత్రం ఆ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. కీలకమైన కొఠియాలో ఎటువంటి ప్రభుత్వ భవనం లేదు. గతంలో కొఠియాలో ఉన్న ఏపీ పోలీస్‌స్టేషన్‌ వివిధ కారణాలతోఎత్తివేశారు. మరో వైపు ఏపీ ఉద్యోగులు కొఠియా వెళ్తే.. ఒడిశా అధికారులు అడ్డుకోవడం పరిపాటిగా మారింది. దీంతో కొన్నిసార్లు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2021లో అప్పటి ఏపీ, ఒడిశా సీఎంలు జగన్‌, నవీన్‌ పట్నాయక్‌లు చర్చలు జరిపినా.. కొఠియా వివాదం మాత్రం పరిష్కారం కాలేదు. సీఎస్‌ స్థాయిలో కమిటీని సైతం ఏర్పాటు చేసినా.. ఒడిశా దూకుడు తగ్గించలేదు. కొఠియా గ్రూప్‌ గ్రామాలపై ఒడిశా ప్రజాప్రతినిధులు పలుమార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

అపార ఖనిజ సంపద..

ఏవోబీలో ఉన్న కొఠియా గ్రూప్‌ గ్రామాలుగా ఎగువ కొఠియా, దిగువ కొఠియా, ఎగువ గంజాయిభద్ర, దిగువ గంజాయిభద్ర, కురిడిభద్ర, ఎగువశెంబి, దిగువశెంబి, ధూళిభద్ర, సోలిపిగుడ తదితర 21 గ్రామాలున్నాయి. తూర్పు కనుమల్లో అపార ఖనిజ సంపదతో ఉన్న ఈ గ్రామాలపై ఇరు రాష్ట్రాలు తమవంటే, తమవని వాదులాడుతున్నాయి. ఈ గ్రామాల పరిధిలో ఉన్న కొండల్లో ఖనిజ నిక్షేపాలపై అధిపత్యానికి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు హక్కు కోసం పట్టుబడుతున్నాయి. కాగా ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో కొఠియా సమస్యకు చెక్‌ పడనుందని ఇరు రాష్ర్టాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 08 , 2024 | 11:18 PM