Share News

ఆశలు ఫలించేనా?

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:53 PM

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిపోయింది. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వారి వారి విధుల్లో నిమగ్నమయ్యారు. కీలక అధికారుల బదిలీలు కూడా పూర్తయ్యాయి. పాలనా వ్యవస్థ కూడా గాడిలో పడింది. దీంతో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.

ఆశలు ఫలించేనా?

వివరాల సేకరణలో టీడీపీ అధిష్ఠానం

ఎవరెవరికి ఏయే పదవులు దక్కేనోనని శ్రేణుల్లో చర్చ

పార్వతీపురం, జూలై 8(ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిపోయింది. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వారి వారి విధుల్లో నిమగ్నమయ్యారు. కీలక అధికారుల బదిలీలు కూడా పూర్తయ్యాయి. పాలనా వ్యవస్థ కూడా గాడిలో పడింది. దీంతో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎన్నో ఇబ్బందులు పడి.. అక్రమ కేసులు, దాడులు, హౌస్‌ అరెస్ట్‌లను ఎదుర్కొని టీడీపీ విజయమే లక్ష్యంగా జిల్లాలో ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు పనిచేశారు. ముఖ్యంగా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎంతో శ్రమించారు. వైసీపీ సర్కారు వైఫల్యాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి.. ప్రజలను చైతన్యవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. బీజేపీ, జనసేన శ్రేణులతో పాటు అన్ని వర్గాల వారిని కలుపుకుని ముందుకు సాగారు. మొత్తంగా వారి కృషి ఫలించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. దీంతో తమకు గౌరవమైన స్థానాలు లభిస్తాయని తెలుగు తమ్ముళ్లు ఆశపడుతున్నారు. నామినేటెడ్‌ పదవులు ఎప్పుడు వరిస్తాయోనని ఎదురుచూస్తున్నారు. అసలు జిల్లాలోని నామినేటెడ్‌ పదవులకు కొదవలేదు. ప్రధానంగా పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజవర్గాల పరిధిలో మార్కెట్‌ యార్డు కమిటీల చైర్మన్లు, ప్రముఖ ఆలయాల కమిటీల చైర్మన్లతో పాటు కమిటీ సభ్యులు, బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్లు తదితర పదవులను భర్తీ చేయాల్సి ఉంది. వాటితో పాటు జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులు ఎమ్మెల్సీ పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్వతీపురం మన్యం జిల్లాకు రెండు ఎమ్మెల్సీలను కేటాయించారు. ప్రస్తుత మంత్రి, సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణి, పార్వతీపురానికి చెందిన టీడీపీ నేత డి.జగదీష్‌లు గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేశారు. అయితే ఈసారి ఎమ్మెల్సీలుగా కొత్త ముఖాలు కనిపిస్తాయని టీడీపీ వర్గాల సమాచారం.

అభిప్రాయ సేకరణ...

నామినేటెడ్‌ పదవుల కోసం సీఎం చంద్రబాబునాయుడు కార్యకర్తలు, నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. దీంతో ఎవరికి ఏ పదవి వరిస్తుందోనని శ్రేణుల్లో చర్చనీయాంశమవుతోంది. కాగా వారికి మరో అంశం కలవరపెడుతోంది. ఎన్నికలకు ముందు టీడీపీ అధిష్ఠానం ఆదేశాలతో నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలుగా కొంతమందిని నియమించారు. అయితే కొందరు బూత్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు పార్టీలు మారిపోయారు. ఇంకొందరు టీడీపీలో ఉంటూ వైసీపీకి అంతర్గతంగా సహకరించారు. అయితే ఇటువంటి వారి పేర్లు కూడా అభిప్రాయ సేకరణలో ఉండడంతో కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. దీనిపై టీడీపీ అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టిసారించాలని శ్రేణులు కోరుతున్నాయి. పార్టీ విజయం కోసం నియోజకవర్గాల్లో బాగా శ్రమించిన వారికి తగు ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే నామినేటెడ్‌ పదవులకు ఎంపిక చేయాలని నాయకులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:53 PM