Share News

నిధులు కేటాయిస్తారా?

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:18 PM

వైసీపీ ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బుధవారం అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సమర్పించబోతోంది. అయితే ఇందులో జిల్లాకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

నిధులు కేటాయిస్తారా?
జంఝావతి ప్రాజెక్టు

అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వైసీపీ ప్రభుత్వం

కొత్త జిల్లాకు ప్రాధాన్యం కల్పిస్తారా!

సాగునీటి ప్రాజెక్టులు, వంతెనల నిర్మాణాలు పూర్తి చేస్తారో.. లేదో!

ఎన్నికల వేళ.. సర్వత్రా ఇదే చర్చ

పార్వతీపురం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బుధవారం అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సమర్పించబోతోంది. అయితే ఇందులో జిల్లాకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల సమయం కావడంతో ఈ బడ్జెట్‌లో కొత్త జిల్లాకు ఏ మేరకు ప్రాధాన్యం కల్పిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవంగా నాలుగున్నరేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం జిల్లాలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేపట్టింది లేదు. సాగునీటి ప్రాజెక్టులు, వంతెనల నిర్మాణాలకు కూడా పెద్దగా నిధులు కేటాయించలేదు. బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. దీంతో ఆయా పనులు నేటికీ నత్తనడకనే సాగుతున్నాయి. అయితే కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం జిల్లాకు ఏ స్థాయిలో నిధులు కేటాయిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాగా ‘మన్యం’లో సాగునీటి ప్రాజెక్టులు, వంతెలన నిర్మాణం ఎంతెంత నిధులు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.

తోటపల్లికి రూ.335 కోట్లు అవసరం

పార్వతీపురం మన్యం , విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే తోటపల్లి ప్రాజెక్టు పనులు పూర్తికావాలంటే ఇంకా రూ.335 కోట్లు అవసరం. ప్రాజెక్టు వద్ద ట్రిక్రేన్‌, గేట్స్‌, స్పిల్‌వే ఇద్ద ఇరువైపులా ఫ్లడ్‌ బ్యాంక్స్‌ తదితర పనులు పూర్తికావాలంటే రూ.210 కోట్లు ఉండాలి. భూసేకరణ కోసం రూ. ఐదు కోట్లు, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి రూ. 120 కోట్లు మంజూరు చేయాల్సి ఉంది.

జంఝావతి పరిస్థితి ఇదీ..

జంఝావతి ప్రాజెక్టు ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది కలగానే మారింది. వైసీపీ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టుపై పూర్తిగా దృష్టి సారించలేదు. దీంతో పనులేవీ పూర్తికాలేదు. ప్రాజెక్టు , కాలువల నిర్వహణకు సుమారు రూ. 85 లక్షలు అవసరం. ప్రస్తుతం జరిగిన పనులకు సంబంధించి రూ. కోటి నాలుగు లక్షలకు, వచ్చే ఏడాదిలో చేపట్టబోయే పనుల కోసం రూ.కోటి 64 లక్షల 45 వేల మంజూరుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కానీ ఇంతవరకు వాటికి వైసీపీ సర్కారు ఆమోదం తెలపలేదు. వాస్తవంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలంటే కోట్లాది రూపాయలు అవసరం. కానీ వాటిని ప్రస్తావించకుండానే మార్చి నెలలోపు చెల్లించాల్సిన బిల్లులకు, వచ్చే ఏడాది చేపట్టబోయే పనులకు, ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణాలకు అవసరమైన నిధులు కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. హైలెవెల్‌ కెనాల్‌ తదితర పనులు పూర్తికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినప్పటికీ.. ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు.

వంతెనలు ఇలా..

- కొమరాడ మండలంలో నాగావళి నదిపై పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణానికి కూడా మోక్షం కలగడం లేదు. మరో 20 శాతం నిర్మాణమే మిగిలి ఉండగా.. దానిపై వైసీపీ సర్కారు శ్రద్ధ వహించడం లేదు. వంతెన నిర్మాణం పూర్తికి సుమారు రూ.5 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. దీంతో ఈ వంతెన నిర్మాణం తుది దశకు చేరుకోవడం లేదు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవంతో ఇప్పటికే కాంట్రాక్టర్‌ చేతులెత్తేశారు. ఈ వంతెన పూర్తయితే మూడు మండలాలకు చెందిన సుమారు 30 గ్రామాల ప్రజల కష్టాలు తీరుతాయి. అయినా సర్కారు దీనిపై దృష్టి సారించడం లేదు.

- సీతానగరం మండల కేంద్రంలో సువర్ణముఖి నదిపై రాష్ట్రీయ రహదారిపై నిర్మిస్తున్న నూతన వంతెన పనులు కూడా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. నదిపై వంతెన నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.12 కోట్లు మంజూరయ్యాయి. 2020 జూలైలో పనులు ప్రారంభించారు. పిల్లర్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. శ్లాబ్‌ పనులు ప్రారంభించేసరికి బిల్లులు అందకపోవడంతో ఆ పనులకు బ్రేక్‌ పడింది. దీంతో శిథిలావస్థలో ఉన్న పాత వంతెనపై భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తు న్నాయి. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు రోజుకు 2,500 వాహనాలు పైబడే రాకపోకలు సాగిస్తున్నాయి. 20 టన్నులకు పైబడి బరువున్న వాహనాల రాకపోకలను నిషేధించినప్పటికీ 60 టన్నుల పైబడిన బరువుతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో పాత వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఆయా ప్రాజెక్టులు, వంతెనల నిర్మాణాలు, ఇతరత్రా అభివృద్ధి పనులకు నిధులెంతో అవసరం. వాటిని పూర్తిచేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది. ఈ నేపథ్యంలో నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టినున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో వాటికి నిధులు కేటాయించేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:18 PM