Share News

కాజ్‌వే నిలుస్తుందా?

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:47 PM

పారాది గ్రామ సమీపంలో వేగావతి నదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం తొలుత తాత్కాలిక డైవర్షన్‌ రోడ్డు పనులు చేపట్టారు. ఈ రోడ్డు నాణ్యతపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఇందుకోసం పారాది గ్రామం ముందునున్న రచ్చబండను, పచ్చని చెట్టును తొలగించారు.

కాజ్‌వే నిలుస్తుందా?
పారాది వద్ద వేగావతి నదిపై నిర్మిస్తున్న కాజ్‌వే

కాజ్‌వే నిలుస్తుందా?

పారాది వద్ద వేగావతి నదిపై నిర్మిస్తున్న తాత్కాలిక రహదారి నాణ్యతపై సందేహాలు

వరదలొస్తే తట్టుకుంటుందా? అని సామాన్యుల ప్రశ్న

బొబ్బిలి, ఫిబ్రవరి 1: పారాది గ్రామ సమీపంలో వేగావతి నదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం తొలుత తాత్కాలిక డైవర్షన్‌ రోడ్డు పనులు చేపట్టారు. ఈ రోడ్డు నాణ్యతపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఇందుకోసం పారాది గ్రామం ముందునున్న రచ్చబండను, పచ్చని చెట్టును తొలగించారు. గతంలో తాత్కాలికంగా వేసిన కాజ్‌వే భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో ఇప్పుడు నదిపై నిర్మిస్తున కాజ్‌వే (డైవర్షన్‌ రోడ్డు) ఎంత వరకు నిలుస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రూ.13.82 కోట్లతో మంజూరుచేసిన కొత్త బ్రిడ్జి పనులు చేపట్టాలంటే ముందుగా డైవర్షన్‌ రోడ్డు అవసరం. ఇందుకోసం రూ.94 లక్షలు బ్రిడ్జి నిధుల నుంచి వెచ్చిస్తున్నారు.

బ్రిటీషు కాలం నాటి పారాది బ్రిడ్జి బీటలు వారుతుండడంతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్నారు. టెండర్లు పిలిచి ఐదేళ్లు దాటాయి. ఒక్క అడుగు ముందుకు పడని సంగతి తెలిసిందే. ఇటీవల ఈ బ్రిడ్జి శిథిలావస్ధకు చేరడంతో బొబ్బిలి నుంచి రామభద్రపురం మీదుగా విశాఖ, విజయనగరం ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాత్కాలికంగా బ్రిడ్జిని ఇనుప గడ్డర్లపై నిలబెట్టి తేలికపాటి వాహన రాకపోకలకు అనుమతినిచ్చారు. భారీ వాహనాలను ఈ బ్రిడ్జిపై నిలువరించారు. ఇలా భారీ వాహనాలను దారిమళ్లించిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన రోడ్లన్నీ ఛిద్రమైపోతున్నాయని ఆయా ప్రాంతాల వారు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు డైవర్షన్‌ రోడ్డు మంజూరు కావడంతో ఇక ఆ రోడ్డుపై నుంచే అన్ని వాహనాలు వెళ్లనున్నాయి. అయితే భారీ వాహనాలను డైవర్షన్‌ రోడ్డు తట్టుకోగలదా అన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న.

16 పైపులతో డైవర్షన్‌ రోడ్డు వేస్తున్నా

పైడిరాజు, జేఈ ఆర్‌అండ్‌బీ, బొబ్బిలి

కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ముందు వేగావతి నదిపై రూ.94 లక్షలతో డైవర్షన్‌ రోడ్డు నిర్మిస్తున్నాం. 16 పైపులతో పటిష్టంగానే నిర్మాణం జరుగుతోంది. గతంలో పైపులు తక్కువగా ఉండేవి. ఇప్పుడు సరిపడా ఏర్పాటు చేశాం. కొద్ది రోజుల్లో దీనిపై భారీ వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తారు. వరదలు వచ్చినా డైవర్షన్‌ రోడ్డు నిలదొక్కుకుంటుంది.

Updated Date - Feb 01 , 2024 | 11:47 PM