గృహ నిర్మాణాల్లో జాప్యమెందుకు?
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:51 PM
గృహ నిర్మాణాల్లో ఎందుకు జాప్యం జరుగుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ప్రశ్నించారు.

గృహ నిర్మాణాల్లో జాప్యమెందుకు?
ఇసుక ఉచితమే కదా
సొంత అవసరాలకు ఎండ్ల బండ్లు, ట్రాక్టర్లతో తీసుకువెళ్లొచ్చు
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
రూ. 350 కోట్లతో జిల్లాలో ఉపాధి పనులు: మంత్రి శ్రీనివాస్
వాడీవేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం
విజయనగరం(ఆంధ్రజ్యోతి)/టౌన్, అక్టోబర్ 25 (ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణాల్లో ఎందుకు జాప్యం జరుగుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ప్రశ్నించారు. జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జడ్పీ సర్వ సభ్య సమావేశం జరిగింది. తొలుత వ్యవసాయశాఖపై చర్చ మొదలవ్వగా స్పల్ప అంశాలే ప్రస్తావనకు వచ్చాయి. అనంతరం గృహ నిర్మాణ శాఖపై చర్చ మొదలవ్వగా ఆ శాఖ పీడీ కూర్మినాయుడు మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణాల్లో స్వల్ప జాప్యం జరుగుతోందన్నారు. దీనిపై మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఇసుకను ఉచితంగా ఇస్తూ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చిందని, అయినా ఎందుకు ఇలా జరుగుతోందని ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోందని, సొంత అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఎవరైనా, ఎక్కడి నుంచైనా తీసుకువెళ్లవచ్చని అన్నారు. తెర్లాం, ఎల్.కోట జడ్‌పీటీసీలు మాట్లాడుతూ ఇసుక ఉచితంగా దొరకడం లేదని అభ్యంతరం చెప్పారు. కొత్తవలసలో స్టాక్ పాయింట్ పెట్టామన్నారని, అక్కడ ఇసుకే దొరకడం లేదని, ఇసుక నదుల నుంచి తీసుకెళ్తే కేసులు పెడుతున్నారని అన్నారు. దీనిపై సంధ్యారాణి మాట్లాడుతూ సొంతఅవసరాలకు తెచ్చుకునే వారిపై ఎలాంటి కేసులు ఉండబోవన్నారు. లారీల ద్వారా వ్యాపారాలు చేసే వారిపైనే కేసులు నమోదు చేస్తామన్నారు. నదులు, ఇసుక రీచ్‌లు లేని ప్రాంతాల వారికి ప్రత్యామ్నయం చూపాలని జడ్పీ చైర్మన్ కోరారు. గతం కంటే ప్రస్తుతం ఇసుక ధర అధికంగా ఉందని, అయినా ఇసుక అందుబాటులో లేదని కొందరు జడ్పీటీసీలు ప్రస్తావించగా గత ప్రభుత్వ హయాంలో ఏడు నెలలు ఇసుకపై ఒక విధానమే లేదని, అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే పరిస్థితులు తలెత్తాయని మంత్రి శ్రీనివాస్ గుర్తు చేశారు. అనంతరం ఇసుక అంశంపై కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ జిల్లాలో గత నాలుగు నెలల్లో 92 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉండేదని, రోజుకు సుమారు 1000 టన్నులను ఉచితంగా సరఫరా చేశామన్నారు. నిర్వహణ చార్జీలు రూ.605 మాత్రమే తీసుకున్నామన్నారు.
మార్చి 31లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి.
జిల్లాలో 12 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కానివి ఉన్నాయని, వీటిని వచ్చే ఏడాది మార్చి31 లోగా ప్రారంభించకపోతే రద్దు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టంచేశారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో లబ్ధిదారులకు అవగాహన కల్పించి గృహాలు నిర్మించుకునేలా చైతన్యం తీసుకురావాలన్నారు. గృహాలకు ప్రస్తుతం రూ.1.8 లక్షలు ప్రభుత్వం అందిస్తోందని, దీనిని రూ.2.5 లక్షలకు పెంచాలని సభ్యులు, అధికారులు కోరగా, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామని మంత్రులు శ్రీనివాస్, సంధ్యారాణి చెప్పారు.
ప్రతి మూడేళ్లకు వీఏవోల మార్పు
మహిళా సంఘాల అధ్యక్షులను ఎటువంటి నోటీసులు అందించకుండా తొలగించేస్తున్నారని సభ్యులు లేవనెత్తగా వీఏవోల తొలగింపు అనేది పూర్తిగా మహిళా సంఘాలదేనని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. మెజార్టీ గ్రామ స్వయం శక్తి సంఘాల అభీష్టం మేరకు ప్రతీ మూడేళ్లకు మార్చుకునే అవకాశం వారికే ఉంటుందన్నారు. ఇందులో ప్రభుత్వం, అధికారుల జోక్యం ఉండదని సభ్యులకు తెలిపారు. 30 సంఘాలకు ఒక వీఏవోను సభ్యులందరూ కలిసి ఎన్నుకుంటారని తెలిపారు.
పాత విధానంలోనే బిల్లులు చెల్లింపులు
ఉపాధి హామీ పథకం పనులకు గ్రామ సభల ఆమోదం లేకపోయినా వెండర్ విధానంలో బిల్లుల చెల్లింపులు చేపడుతున్నారని జడ్పీ చైర్మన్, సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో ప్రస్తుతం పాత విధానంలోనే చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. పంచాయతీ తీర్మానం లేకుండా చేస్తున్న పనులపై చర్యలు తీసుకుంటామన్నారు.
- గుర్లలో అతిసారతో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించేలా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని ఎమ్మెల్సీ సురేష్‌బాబు కోరారు. సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు అదితి గజపతిరాజు, తోయక జగదీశ్వరి, బోనెల విజయచంద్ర, పార్వతీపురం జేసీ శోభిక, జడ్పీ సీఈవో సత్యనారాయణ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.
‘జగన్ పరిహారాలు ప్రకటనలకే పరిమితం’
విజయనగరం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్ విజయవాడ వరద బాధితులకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ప్రకటనలకే పరిమితమైందని, గుర్ల డయేరియా బాధితులకు ప్రకటించిన పరిహారానిదీ అదే పరిస్థితి అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. శుక్రవారం జడ్పీ సమావేశాలు ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాకు ఉపాధి హామీ నిధులు రూ.350 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని, ఈ నిధులతో గ్రామాల్లో రోడ్లు, కాలువలు, మౌలిక సదుపాయాలు కల్పించుకునే అవకాశం ఉందన్నారు.