Share News

మాపై ఎందుకీ కక్ష?

ABN , Publish Date - May 03 , 2024 | 11:29 PM

జిల్లాలో పింఛన్‌దారులకు రెండో రోజూ ఇబ్బందులు తప్పలేదు. పింఛన్‌ సొమ్ము కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. వైసీపీ సర్కారు అనాలోచిత నిర్ణయంతో వృద్ధులు, దివ్యాంగులు నానా అవస్థలు పడ్డారు. మరోవైపు మండుటెండలో విలవిల్లాడుతూ బ్యాంకులు, వాటి సేవా కేంద్రాలకు చేరుకున్నారు.

మాపై ఎందుకీ కక్ష?
సాలూరులో ఓ సేవా కేంద్రం వద్ద పింఛన్‌ సొమ్ము కోసం ఎండలోనే నిరీక్షిస్తున్న పింఛన్‌దారులు ఫెన్షన్‌ దార్లు

బ్యాంకుల వద్ద పడిగాపులు

మండుటెండలో దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, దివ్యాంగులు విలవిల

వైసీపీ సర్కారు తీరుపై మండిపాటు

పార్వతీపురం, మే3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పింఛన్‌దారులకు రెండో రోజూ ఇబ్బందులు తప్పలేదు. పింఛన్‌ సొమ్ము కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. వైసీపీ సర్కారు అనాలోచిత నిర్ణయంతో వృద్ధులు, దివ్యాంగులు నానా అవస్థలు పడ్డారు. మరోవైపు మండుటెండలో విలవిల్లాడుతూ బ్యాంకులు, వాటి సేవా కేంద్రాలకు చేరుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అయితే ఆయా చోట్ల కూర్చోనేందుకు, కాసేపు విశ్రాంతి తీసుకునే అవకాశమూ లేక మరిన్ని ఇక్కట్లు పడ్డారు. దీంతో వారంతా వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. తమపై ప్రభుత్వానికి ఈ కక్ష ఎందుకుని ప్రశ్నించారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా.. ఇలా బ్యాంకుల వద్ద క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షించే చేసిన సర్కారుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివిధ చోట్ల ఇలా..

బ్యాంకులో ఖాతా ఉన్నప్పటికీ అప్‌డేట్‌ కాకపోవడం.. ఆధార్‌ అనుసంధానం లేకపోవడం... ఫింగర్‌ప్రింట్లు స్కాన్‌ కాకపోవడం వంటి సమస్యలతో శుక్రవారం అనేక మంది పింఛన్లు తీసుకోలేకపోయారు. అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, దివ్యాంగులు కుటుంబ సభ్యులను తోడుతీసుకుని బ్యాంకుల వద్ద వారు పడిన పాట్లు అన్నీఇవన్నీ కావు. ఖాతాల్లో నగదు జమైనా ఇంకా డబ్బులు చేతికి రాకపోవడంతో మరికొందరు ఈసురోమంటూ ఇంటికి వెనుదిరిగారు. సీతంపేట, బలిజిపేట తదితర మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. బ్యాంకుల వద్ద గంటల కొలదీ లబ్ధిదారులకు నిరీక్షించారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు సైతం పింఛన్‌ సొమ్ము కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు.

- సాలూరు: పట్టణలో ఉన్న బ్యాంకులు, వినియోగదారుల కేంద్రాల వద్ద శుక్రవారం పింఛన్‌దారులు బారులుదీరారు. ఉదయం పది గంటలకు ముందే అక్కడకు చేరుకుని, తమ ఖాతాలో పింఛన్‌ పడిందా? లేదా అని ఆరా తీశారు. వృద్ధులు సైతం ఎండలో నానా అవస్థలు పడ్డారు.

- మక్కువ: మక్కువ, మార్కొండపుట్టి, శంబర గ్రామాల్లో ఉన్న బ్యాంకుల్లో వృద్ధులు భారీగా క్యూ కట్టారు. గిరి శిఖర గ్రామాల లబ్ధిదారులైతే ఆటోల్లో బయలుదేరి బ్యాంకులు, సీఎస్‌పీ సెంటర్లకు తరలివచ్చారు. కాగా సీఎస్‌పీ సెంటర్ల వద్ద ఎండలో నేలపై కూర్చోలేక పింఛన్‌దారులు ఇబ్బందులు పడ్డారు. ఆధార్‌ సీడింగ్‌ అవ్వలేదని, ఈకేవైసీ చేయించుకోవాలని బ్యాంకర్లు చెప్పినా.. వృద్ధులు ఓపికతో పని అయ్యేంతవరకు నిరీక్షించి పింఛను నగదు పొందారు. కొంతమంది ప్రైవేటు నగదు బదిలీ నిర్వాహకులు రూ. 3 వేల పింఛన్‌ సొమ్ములో రూ.30 వసూలు చేయడం కనిపించింది.

- భామిని: లివిరి గ్రామానికి చెందిన వృద్ధుల బ్యాంకు ఖాతాలు లాక్‌ అవడంతో వారంతా ఇబ్బందులు పడ్డారు. చివరకు తమ సమస్యలను బ్యాంకు అధికారులకు విన్నవించి అకౌంట్లను ఓపెన్‌ చేసి బ్యాంకు మిత్రల ద్వారా పింఛన్ల సొమ్ము అందుకున్నారు. మరికొందరు ఖాతాలకు ఆధార్‌ లింక్‌ కాకపోవడంతో పింఛన్‌ సొమ్ము అందుకోలేకపోయారు. ఇంకొందరి ఖాతాల్లో పింఛన్‌ పడిందో లేదో.. తెలియని పరిస్థితి.

- జియ్యమ్మవలస : మండలంలో 9,110 పింఛన్లు ఉండగా, ఇందులో 6,892 మంది ఖాతాల్లో నగదు జమ చేశారు. మిగిలిన 2,218 మంది పింఛన్‌దారులకు డోర్‌ టు డోర్‌ పద్ధతిలో పింఛన్లు అందించారు. అయితే అనేకమంది పింఛన్‌దారులు మండే ఎండలో కిలోమీటర్ల మేర ప్రయాణించి.. బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

-వీరఘట్టం: మండలంలోని వృద్ధులు పింఛను డబ్బులు కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఉదయాన్నే వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వృద్ధులు ఆటోలపై వచ్చి బ్యాంకుల వద్దకు చేరుకున్నారు.

- పాలకొండ: స్థానిక ఖాతాదారుల సేవా కేంద్రంలో శు క్రవారం పింఛనుదారులు క్యూలో నిలబడి నగదు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఖాతాదారులు సేదతీరేందుకు అవకాశం లేకపోవడంతో ఎండలోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

- సాలూరు రూరల్‌: మామిడిపల్లి,తోణాంలో ఉన్న బ్యాంకులకు శుక్రవారం భారీగా పింఛన్‌దారులు తరలివచ్చారు. గిరిశిఖర డెన్స్‌రాయి, సంపంగిపాడు,రూఢి తదితర గిరిజన గ్రామాల ప్రజలు నుంచి ఎండను లెక్కచేయకుండా బ్యాంక్‌కు రావాల్సి వచ్చింది. కొందరు కురుకూటిలో బ్యాంక్‌ బిజినెస్‌ కరస్పాండెంట్‌ వద్ద సొమ్ము డ్రా చేశారు. కురుకూటిలో సిగ్నల్‌ సమస్య ఉండడంతో ఊరి బయట చెట్టు కిందకు వెళ్లారు. వృద్దుల వేలిముద్రల నమోదు సమస్య రావడంతో పింఛన్‌ ఇవ్వడానికి వీలుకాలేదు. దీంతో వారు ఉసూరుమంటు వెళ్లిపోవాల్సి వచ్చింది.

- సీతంపేట: పక్షవాతంతో బాధపడుతున్న లాడ గ్రామానికి చెందిన బిడ్డిక రాజన్న పింఛన్‌ సొమ్ము కోసం భార్య సాయంతో మండుటెండలో శుక్రవారం బ్యాంక్‌ వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. గెద్దగూడకు చెందిన సవర దొరమీ వృద్ధురాలు తీవ్ర ఇబ్బందులు పడి బ్యాంకు వద్ద పెన్షన్‌ కోసం ఎదురుచూసింది. దివ్యాంగులు, వితంతువులు కూడా పెన్షన్ల కోసం నానా అవస్థలు పడ్డారు. వాస్తవానికి నడవలేని దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇళ్ల వద్దకే పింఛను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అదెక్కడా అమలు కావడం లేదు. దీంతో మండుటెండలో పింఛన్‌దారులు కిలోమీటర్ల మేర ప్రయాణించి.. బ్యాంకుల వద్దకు చేరుకోవాల్సి వస్తోంది. అయితే ఆయా చోట్ల కనీసం తాగునీటి కూడా అందించకపోవడంతో పింఛన్‌దారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

బ్యాంకులో లోను ఉందని ...

నేను గతంలో వ్యాపారం నిమిత్తం బ్యాంకుల రుణం తీసుకున్నా.. అయితే అనారోగ్యం, ఇతర సమస్యల కారణంగా సకాలంలో రుణం తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు నా ఖాతాలో జమైన వృద్ధాప్య పింఛను సొమ్మును అందించలేదు. ఆ సొమ్మును రుణం కింద జమ చేసినట్లు బ్యాంకర్లు తెలిపారు. దీనిపై లీడ్‌ బ్యాంకు అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలి.

- ఉత్తర కవ ట చిట్టిబాబు, సీతంపేట

Updated Date - May 03 , 2024 | 11:29 PM