Share News

ఎందుకీ నిర్లక్ష్యం?

ABN , Publish Date - May 19 , 2024 | 12:02 AM

. ఓటుహక్కుపై బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో ఎంతగా అవగాహన కల్పించినా.. వారి తీరు మారలేదు. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో జిల్లాలో 1,76,376 మంది ‘మనకెందుకులే’ అనే ధోరణితో వ్యవహరించి.. ఓటుకు దూరంగా ఉండిపోయారు.

ఎందుకీ నిర్లక్ష్యం?

పార్వతీపురం, మే18 (ఆంధ్రజ్యోతి): వజ్రాయుధంలాంటి ఓటు హక్కు ద్వారా మంచి పాలకులను ఎంచుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతిఒక్కరిపై ఉంది. ఒకవేళ ఎవరికీ ఓటు వేయకూడదని భావిస్తే నోటా మీట నొక్కవచ్చు. అయితే ఓటు విలువ గురించి ఎవరు ఎంతలా మొత్తుకుంటున్నా కొంతమందిలో మార్పు రావడం లేదు. ఓటుహక్కుపై బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో ఎంతగా అవగాహన కల్పించినా.. వారి తీరు మారలేదు. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో జిల్లాలో 1,76,376 మంది ‘మనకెందుకులే’ అనే ధోరణితో వ్యవహరించి.. ఓటుకు దూరంగా ఉండిపోయారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పరిస్థితి చూస్తే.. పార్వతీపురంలో 1,88,817 మంది ఓటర్లు ఉండగా 1,48,502 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నియోజకవర్గంలో 40,315 మంది ఓటు వేయలేదు. పాలకొండలో 1,95,020 మందికి గాను 1,48,781 మంది ఓటు వేశారు. ఇక్కడ 46,239 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. సాలూరులో 2,04,489 మంది ఓటర్లు ఉండగా 1,56,331 మంది ఓటు వేశారు. ఈ నియోజకవర్గంలో 48,158 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. కురుపాంలో 1,94,114 మంది ఓటర్లు ఉండగా, 1,52,450 మంది ఓటు హక్కను వినియోగించుకున్నారు. 41,664 మంది ఓటు వేయలేదు. సాలూరు నియోజకవర్గంలో అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకోలేని వారు ఉన్నారు. అవగాహన లేకనా... లేక ఓటింగ్‌పై ఆసక్తి లేకా.. అనే విషయం వారికే ఎరుక. అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేందుకు వందలాది మంది స్వగ్రామాలకు వచ్చారు. వృద్ధులు, దివ్యాంగులు సైతం పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారు. అయినా కొందరిలో మాత్రం చలనం రాలేదు. వారంతా ఓటు వేసి ఉంటే పోలింగ్‌ శాతం మరింత పెరిగేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - May 19 , 2024 | 12:02 AM