Share News

ఎందుకీ నిర్లక్ష్యం?

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:09 AM

జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన గళమెత్తారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పట్టవా? అంటూ ప్రశ్నించారు. గురువారం ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా వారు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

ఎందుకీ నిర్లక్ష్యం?
సాలూరులో ధర్నా చేస్తున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

గళమెత్తిన ఉద్యోగ, ఉపాధ్యాయులు

సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు

ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా

పార్వతీపురం రూరల్‌/పాలకొండ/సాలూరు రూరల్‌, ఫిబ్రవరి 29: జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన గళమెత్తారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పట్టవా? అంటూ ప్రశ్నించారు. గురువారం ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా వారు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్‌ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. పార్వతీపురం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మర్రాపు మహేష్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం వేరే అవసరాల కోసం దారి మళ్లించడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌ నేడు మాట తప్పి.. మడం తిప్పారని అన్నారు. ఐఆర్‌ 30 శాతం అమలు చేయాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని, డీఏలు విడుదల చేయాలని, పెన్షనర్స్‌కు అడిషనల్‌ క్వాంటమ్‌ ఫెన్స్‌న్‌ మంజూరు చేయాలని, ఉపాధ్యాయ నియామకాల్లో ప్రవేశపెట్టిన అప్రంటీస్‌ విధానం రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం డీటీ వెంకటరమణకు వినతిపత్రం ఇచ్చారు. ఈ నిరసనలో ఏపీటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- పాలకొండ: నగరపంచాయతీలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్‌ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డీటీ బుచ్చియ్యకు వినతిపత్రం ఇచ్చారు. 12వ పీఆర్‌సీలో మధ్యంతర భృతి 30 శాతం, 11వ పీఆర్‌సీ బకాయిలు ఏక మొత్తంలో చెల్లించాలని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శాసపు వాసుదేవరావు, గోగుల సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, కౌన్సిలర్‌ నాగరాజు, గౌరవాధ్యక్షుడు టి.ఉమామహేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు.

- సాలూరు రూరల్‌: సాలూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కూడా ఏపీటీఎఫ్‌ నాయకులు ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. గత నెల 27న నిర్వహించాల్సిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఏపీజేఏసీ నాయకులు ఏకపక్షంగా వాయిదా వేయడం సబబు కాదన్నారు. ఇందుకు నిరసనగా ఏపీటీఎఫ్‌ నాయకత్వం ధర్నాలకు పిలుపునిచ్చినట్లు వారు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆర్థిక బకాయిల న్నింటినీ తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ నిరసనలో ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు మహేష్‌, ప్రభాకర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు నాయుడు ప్రభాకర్‌, సాలూరు, పాచిపెంట శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:09 AM