Share News

ఎవరి సీటు పోతుందో?

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:23 PM

రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుకు జిల్లాలో టిక్కెట్టు దక్కలేదు. ఆయన్ను పాయకరావుపేట నియోజకవర్గానికి బదిలీ చేశారు.

ఎవరి సీటు పోతుందో?

-అధికారపార్టీ ఎమ్మెల్యేల్లో అభద్రతాభావం

-ఇప్పటికే రాజాం ఎమ్మెల్యేకి స్థానచలనం

-అందరి చూపూ నాలుగో జాబితాపైనే..

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుకు జిల్లాలో టిక్కెట్టు దక్కలేదు. ఆయన్ను పాయకరావుపేట నియోజకవర్గానికి బదిలీ చేశారు. అలాగే విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు కూడా ఈ సారి ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చే పరిస్థితి కన్పించడం లేదు. ఇప్పటికే జగన్‌ స్పష్టతనిచ్చినట్లు సమాచారం. అలాగే వైసీపీ మూడో జాబితాలో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీకి విశాఖ లోక్‌సభ స్థానం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాలుగో జాబితాలో తమ భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న ఆందోళన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో గూడు కట్టుకుంది. అయితే ఏ ఎమ్మెల్యేకు ఎసరు పెడతారో అన్న చర్చలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. దీనికితోడు కొంత మంది ఎమ్మెల్యేలను ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న తరుణంలో అలాంటి వారి భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

విజయనగరం ఎంపీ స్థానానికి జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావును నియమించినట్లు ప్రచారం సాగింది. చివరి నిముషంలో ఏమైందో ఏమో అధికారిక జాబితాలో ఆయన పేరు లేదు. దీనికి కారణం జడ్పీ చైర్మన్‌.. ఎంపీ కన్నా ఎమ్మెల్యే సీటు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు ఎస్‌.కోట, బొబ్బిలి, ఎచ్చెర్లలో ఎక్కడ కేటాయించినా పోటీ చేస్తానని ప్రతిపాదించినట్లు సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకునే లోక్‌సభకు వెళ్లకుండా అసెంబ్లీ సీటు కేటాయించే ఉద్దేశంతోనే అధినాయకత్వం చివరి నిముషంలో విజయనగరం లోక్‌సభ ఇన్‌చార్జి పేరు తొలగించినట్లు ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ఎస్‌.కోట, బొబ్బిలి, ఎచ్చెర్ల స్థానాల్లో దేన్ని కేటాయిస్తారు? అన్నది కూడా చర్చనీయాంశం అవుతోంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు వచ్చేఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చేది లేదని ఇప్పటికే స్పష్టమైంది. మరి జడ్పీ చైర్మన్‌ చిన్న శ్రీను ఇక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఎంపీ బెల్లాన కూడా ఎచ్చెర్ల ఎమ్మెల్యే టిక్కెట్టును కోరుతున్నారన్న ప్రచారం ఉంది.

ఎస్‌.కోటలో అసమ్మతి స్వరం

ఎస్‌.కోట నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కేటాయిస్తే తాము సహకరించేది లేదని కొంతమంది స్థానిక ప్రజా ప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నాయకులు హెచ్చరిస్తున్నారు. వీరంతా ఎమ్మెల్సీ రఘురాజు వర్గంగా ఉన్నారు. కడుబండికి టిక్కెట్టు ఇవ్వవద్దని ఎప్పటికప్పుడు అధినాయకత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్సీతో పాటు మరికొన్ని రహస్య శక్తులు పనిచేస్తున్న తరుణంలో మార్పు త్పదన్న ప్రచారం సాగుతోంది. అయితే కడుబండికి రాష్ట్ర స్థాయిలో కీలక నాయకుని పట్టున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నా అధినాయకత్వం గుమ్మనంగా ఉంటోంది. అయితే మరో వాదన కూడా విన్పిస్తోంది. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యను ఎస్‌.కోటకు, ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండికి గజపతినగరం కేటాయించే అవకాశం ఉందన్న చర్చకూడా ఉంది.

బొబ్బిలిలో తీవ్ర వ్యతిరేకత

బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడుపైనా తీవ్ర వ్యతిరేకత ఉంది. స్థానిక ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలను గెలిపించుఎకోవటంలో ఆయన వెనకబడ్డారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీ వలసలు భారీగా సాగుతున్నాయి. భూ కబ్జాలకు ఎమ్మెల్యే పాల్పడుతున్నారని ఇటీవల ప్రతి పక్షనేత చంద్రబాబు నాయుడు బొబ్బిలిలో ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో శంబంగికి ఈసారి టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు తక్కువేనని.. మార్పు తథ్యం అన్న ప్రచారం సాగుతోంది.

Updated Date - Jan 12 , 2024 | 11:23 PM